కరోనా టెస్ట్.. ఇక మీ చేతుల్లో..

ABN , First Publish Date - 2020-04-04T03:59:49+05:30 IST

మీరు కోవిడ్-19 బారిన పడ్డారేమోనని భయంగా ఉందా..? ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలంటే భయంగా ఉందా..? అయితే ఈ శుభవార్త మీకోసమే...

కరోనా టెస్ట్.. ఇక మీ చేతుల్లో..

  • 5 నుంచి 10 నిమిషాల్లో ఫలితం 
  • ఖరీదు రెండు నుంచి మూడు వేలే..
  • అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ బయోన్


బెంగళూరు: మీరు కోవిడ్-19 బారిన పడ్డారేమోనని భయంగా ఉందా..? ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలంటే భయంగా ఉందా..? అయితే ఈ శుభవార్త మీకోసమే.. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చునే కరోనా పరీక్ష చేసుకోవచ్చు. అది కూడా మీకు మీరే పరీక్ష చేసుకుని ఫలితం తెలుసుకోవచ్చు. అందుకోసం బయోన్ అనే సంస్థ సరికొత్త స్క్రీనింగ్ టెస్ట్ కిట్‌ను తయారు చేసింది. దీంతో దేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా బయోన్ చరిత్ర సృష్టించింది. ఈ కిట్‌ను ఉపయోగించడం సులభం.. అంతేకాకుండా కచ్చితమైన ఫలితాన్ని నిమిషాల్లోనే అందిస్తుంది. bione.in వెబ్‌సైట్ ద్వారా ఈ ఎట్ హోం స్క్రీనింగ్ కిట్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాలను బట్టి ఈ కిట్ ధర రూ.2000 నుంచి 3000 వరకు ఉండే అవకాశం ఉంది. ఆర్డర్‌ చేసిన 2,3 రోజుల్లోపు కిట్ మీకు చేరుతుంది. ఈ కిట్ ఐజీజీ, ఐజీఎం ఆధారంగా పనిచేసే ఈ కిట్ 5 నుంచి 10 నిమిషాల్లో ఫలితాన్నిస్తుంది. 


అందుబాటులోకి ఎప్పుడొస్తుంది..?

ఈ టెస్ట్ కిట్‌లను ఇప్పటికే ఐసీఎంఆర్ ఆమోదించింది. నాణ్యత నిర్ధారణ పూర్తయిన తరువాత రిటైల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. వారానికి 20,000 కిట్ల వరకు సరఫరా చేయగల సామర్థ్యం తమకుందని బయోన్ సంస్థ చెబుతోంది. అయితే డిమాండ్‌ను బట్టి ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. ప్రస్తుతం మార్కెట్లో కరోనా వైరస్ లక్షణాలను వెంటనే తెలుసుకునేందుకు సరైన సాధనాలు లేకపోవడం వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు అవస్థలు పడుతున్నాయి. దీంతో ఈ కిట్ ఆయా దేశాలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ మొదలైన దేశాల నుంచి అధిక డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.


ప్రఖ్యాత జన్యు శాస్త్రవేత్త డాక్టర్ సురేంద్ర కే చికారా 2019లో బెంగళూరులో బయోన్ సంస్థను స్థాపించారు. దేశంలోనే జన్యు, మైక్రోబయోమ్ పరీక్షలు చేయగల ఏకైక సంస్థ ఇది కావడం విశేషం. దేశ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచి, ప్రజల్లో ఉండే జన్యు లోపాలను సవరించి వారి ఆయుర్థాయం పెంచే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇదిలా ఉంటే ఇలా వ్యాధులను కనుగొనడానికి కిట్‌లను తయారు చేయడం ఈ సంస్థకు ఇదే తొలిసారి కాదు. గట్ డైస్బియోసిస్‌(పేగు సంబంధింత వ్యాధి)ని కనుగొనడానికి కూడా మైక్రోబయోమ్ టెస్ట్ కిట్‌ను గతంలో బయోన్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం కరోనాను కనుగొనడానికి రాపిడ్ టెస్ట్ కిట్‌ను రూపొందించింది.


ఈ సందర్భంగా బయోన్ సీఈవో డాక్టర్ సురేంద్ర చికారా మాట్లాడుతూ, “మేము కరోనాను ట్రాక్ చేస్తున్నాం. దాని వ్యాప్తి నిరోధించేందుకు సమర్థవంతమైన సాధనాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం. మా కృషికి ప్రతిరూపమే కోవిడ్-19 హోమ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్. నిముషాల్లో ఫలితం రావడం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడగలుగుతామన్న నమ్మకం మాకుంది. అంతేకాకుండా ఈ మహమ్మారితో దేశం చేస్తున్న పోరాటానికి మా వంతు సహాయం చేయాలని అనుకుంటున్నాం” అని అన్నారు.


కిట్ ఉపయోగించడం ఎలా..?

ముందుగా వేలిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పరికరంలో ఉన్న సూదిలాంటి పదునైన మొనకు వేలిని కొద్దగా గుచ్చాలి. దాంతో మన రక్త నమూనాను పరికరం సేకరించి, పరీక్షించి 5-10 నిమిషాల్లో ఫలితాలనిస్తుంది. 


కిట్ ద్వారా పాజిటివ్ వస్తే ఏం చేయాలి..?

ఒకవేళ ఈ కిట్ ద్వారా రక్త నమూనాలను పరీక్షించుకున్నప్పుడు ఎవరికైనా కోవిడ్-19 పాజిటివ్ వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ కిట్ ద్వారా కరోనా ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే గుర్తించవచ్చని, దానివల్ల చికిత్స సులభమవుతుందని, అంతేకాకుండా బాధితుడు ప్రాణాపాయ స్థితికి చేరుకోడని, చికిత్స ద్వారా త్వరగా కోలుకునే అవకాశం పెరుగుతుందని బయోన్ సంస్థ వెల్లడించింది.

Updated Date - 2020-04-04T03:59:49+05:30 IST