బయోటెక్నాలజీ కోసం ఇంజనీరింగ్‌ తీసుకోవాలా? బీఎస్సీ తీసుకోవాలో తెలియడం లేదా? అయితే ఇది మీకోసమే..!

ABN , First Publish Date - 2021-11-23T18:18:37+05:30 IST

ఇంటర్‌ రెండో సంవత్సరం..

బయోటెక్నాలజీ కోసం ఇంజనీరింగ్‌ తీసుకోవాలా? బీఎస్సీ తీసుకోవాలో తెలియడం లేదా? అయితే ఇది మీకోసమే..!

కామర్స్‌కు అవకాశాలు ఎలా ఉంటాయి?

నేను ఎంపీసీతో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇప్పుడు ఇంజనీరింగ్‌ చదివే ఆలోచన లేదు. కామర్స్‌ లేదా మేనేజ్‌మెంట్‌ వైపు వెళ్లాలనే ఆలోచన ఉంది. హెల్త్‌కేర్‌, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో బ్యాచిలర్‌, మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్‌తో పోలిస్తే వీరికి జాబ్‌ అవకాశాలు ఎలా ఉంటాయి?

- ప్రేరణ, హైదరాబాద్‌


మీరు అనుకుంటున్నట్లుగా తప్పకుండా చదవొచ్చు. అయితే మీరు హెల్త్‌కేర్‌కు వెళ్లాలనుకుంటున్నారా లేదా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకా అనేది ముందే నిర్ణయించుకోండి. ఇవి రెండూ భిన్నమైన రంగాలు. గ్రాడ్యుయేషన్‌ తరవాత కొంతకాలం మీరు అనుకున్న రంగంలో పనిచేసి తరవాత ఎంబీఏ చేయొచ్చు. కొద్దికాలం మీరు అనుకున్న రంగంలో పనిచేయడం వల్ల అందులోని లోతుపాతులు అర్థం అవుతాయి. ఆ తరవాత ఎంబీఏలో చేరేటప్పటికీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఉద్యోగ సమయంలో మీకు ఆ కోర్సు నచ్చనట్లయితే సాధారణ ఎంబీఏలో కూడా చేరవచ్చు. ఒక విషయం గుర్తు పెట్టుకోండి హాస్పిటాలిటీ లేదా హెల్త్‌కేర్‌లో ఐటి రంగం స్థాయిలో జీతాలు ఉండవు.



ఇంజనీరింగా... బీఎస్సీనా..

ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. బయోటెక్నాలజీ చదవాలనుకుంటున్నాను. తరవాత పరిశోధనవైపు వెళ్లాలని కోరిక. అయితే ఇందు కోసం ఇంజనీరింగ్‌ తీసుకోవాలా?  బీఎస్సీ తీసుకోవాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు? 

- స్వప్న, అనంతపురం


బీఈ లేదా బీఎస్సీ బయోటెక్నాలజీ తరవాత మీరు రీసెర్చ్‌వైపు వెళ్లవచ్చు. మీరు ప్రాక్టికల్‌, అప్లికేషన్‌ ఓరియంటెడ్‌ వ్యక్తి అయితే ఇంజనీరింగ్‌ డిగ్రీ తీసుకోవచ్చు. మీరు మంచి ఆలోచనపరులు, నిలకడగా ఒక విషయంపై దృష్టిసారించగలిగితే బీఎస్సీ డిగ్రీ అయినా తీసుకోవచ్చు. అయితే బీఎస్సీ వైపు వెళ్లాలనుకుంటే బీఎస్సీ+ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీకి ప్లాన్‌ చేసుకోవడం బెస్ట్‌. బయోటెక్నాలజీలో కూడా ఏది బాగుంటుందో చూసుకోండి. ఉదాహరణకు జెనెటిక్స్‌, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాజీ తదితరాలు అన్నమాట. 


- గోవర్ధనం కిరణ్‌కుమార్‌

మీక్కూడా ఏదైనా సందేహం ఉంటే సంప్రదించండి:

చిరునామా: వివరాలు ఇవిగో, కేరాఫ్‌ ఎడ్యుకేషన్‌ డెస్క్‌, ఆంధ్రజ్యోతి, ప్లాట్‌ నెం.76, రోడ్‌ నెం.70, అశ్వినీ ఎన్‌క్లేవ్‌, హుడా హైట్స్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌-500 033


Updated Date - 2021-11-23T18:18:37+05:30 IST