బిరబిరా కృష్ణమ్మ!

ABN , First Publish Date - 2021-07-29T09:19:05+05:30 IST

కృష్ణానదిలో వరద ప్రవాహం దూసుకొస్తోంది. శ్రీశైలం డ్యామ్‌ నిండుకుండను తలపిస్తుండగా, ఎగువనున్న ఆల్మట్టి డ్యామ్‌ నుంచి భారీగా వరద వస్తోంది.

బిరబిరా కృష్ణమ్మ!

  • 2 గేట్లు ఎత్తి శ్రీశైలం నుంచి నీటి విడుదల
  • నేడు మరో 5 గేట్లు ఎత్తే అవకాశం
  • ఆల్మట్టి నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద
  • ఎగువ నుంచి భారీగా ప్రవాహం
  • వచ్చిన వరద వచ్చినట్లే దిగువకు..

అమరావతి, కర్నూలు, జూలై 28(ఆంధ్రజ్యోతి): కృష్ణానదిలో వరద ప్రవాహం దూసుకొస్తోంది. శ్రీశైలం డ్యామ్‌ నిండుకుండను తలపిస్తుండగా, ఎగువనున్న ఆల్మట్టి డ్యామ్‌ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో బుధవారం రాత్రి శ్రీశైలం డ్యామ్‌ రెండు గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి దిగువకు 53,488 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో నీటిమట్టం గరిష్ఠ స్థాయిని చేరుకోడానికి మరో 3 అడుగులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జలాశయంలోకి ఎగువ నుంచి 4.65 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులకు చేరింది. ఆల్మట్టి డ్యామ్‌ గరిష్ఠ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 86.06 టీఎంసీల మేర జలాలు ఉన్నాయి. ఎగువ నుంచి 4,13,889 క్యూసెక్కుల వరద ఆల్మట్టిలోకి వస్తోంది. డ్యామ్‌లో మరో 43 టీఎంసీలనిల్వకు అవకాశం ఉన్నప్పటికీ ఎగువ నుంచి తన్నుకొస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని 3,80,000 క్యూసెక్కులను దిగువనున్న నారాయణపూర్‌ డ్యామ్‌కు విడుదల చేశారు. నారాయణపూర్‌ డ్యామ్‌ గరిష్ఠ సామర్థ్యం 37.64 టీఎంసీలకుగాను, ప్రస్తుతం 26.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 


ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, దిగువకు  3,86,900 క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ ప్రవాహం వేగంగా జూరాల వైపు దూసుకొస్తోంది. జూరాల డ్యామ్‌ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 6.42 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలలోనికి 3,81,990 క్యూసెక్కుల వరద వస్తుండగా, 41 గేట్లను ఎత్తి 3,86,001 క్యూసెక్కులను దిగువనున్న శ్రీశైలం డ్యామ్‌కు విడుదల చేశారు. దీంతోపాటు సుంకేశుల నుంచి 79,023 క్యూసెక్కులు విడుదలవుతుండటంతో శ్రీశైలంలోకి 4,61,546 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్‌ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 200.33 టీఎంసీల నిల్వ ఉంది.  ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే గురువారం మధ్యాహ్నానికల్లా మరో 5 గేట్లు ఎత్తే అవకాశముందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఏపీ పవర్‌ హౌస్‌ నుంచి 31,356, తెలంగాణ పవర్‌ హౌస్‌ నుంచి 35,315, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స నుంచి 2,026, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 12వేల క్యూసెక్కులు, ఇతర ప్రాంతాల నుంచి కూడా 1,600 క్యూసెక్కులు(మొత్తం ఔట్‌ఫ్లో 1,35,785 క్యూసెక్కులు) విడుదల చేస్తున్నారు. అలాగే తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులకుగాను, ప్రస్తుతం 1632.33 అడుగులకు చేరుకుంది. 


పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 100.855 టీఎంసీలకు గాను, 98.28 టీఎంసీలకు చేరాయి. స్పిల్‌వే నుంచి 39,755 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఇక నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికిగాను, ప్రస్తుతం 191.68 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 66,375 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులు ఉంది. ఇక పులిచింతల గరిష్ఠ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 43.50 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి 5,600 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టే కిందకు వదిలేస్తున్నారు. దిగువన ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 22,212 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 22,569 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి .. కృష్ణా జలాలతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలూ చేరుతున్నాయి. వీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

Updated Date - 2021-07-29T09:19:05+05:30 IST