బీర్బల్‌ కిచిడీ!

ABN , First Publish Date - 2020-09-30T05:55:59+05:30 IST

ఒకరోజు బీర్బల్‌, అక్బర్‌ నడుచుకుంటూ వెళుతున్నారు. అది చలికాలం. బాగా చలిగా ఉంది. బీర్బల్‌ అక్బర్‌తో ‘‘మహారాజా! డబ్బులిస్తే మనుషులు ఏ పనైనా చేస్తారు’’ అని అన్నాడు. వెంటనే అక్బర్‌ అక్కడున్న కొలనులో చేయి పెట్టి చూసి ‘‘నేను అలా అనుకోవడం లేదు. డబ్బులిస్తే ఒకరోజు రాత్రంతా ఈ చల్లటి నీటిలో ఏ వ్యక్తయినా ఉంటాడా?’’ అన్నాడు...

బీర్బల్‌ కిచిడీ!

ఒకరోజు బీర్బల్‌, అక్బర్‌ నడుచుకుంటూ వెళుతున్నారు. అది చలికాలం. బాగా చలిగా ఉంది. బీర్బల్‌ అక్బర్‌తో ‘‘మహారాజా! డబ్బులిస్తే మనుషులు ఏ పనైనా చేస్తారు’’ అని అన్నాడు. వెంటనే అక్బర్‌ అక్కడున్న కొలనులో చేయి పెట్టి చూసి ‘‘నేను అలా అనుకోవడం లేదు. డబ్బులిస్తే ఒకరోజు రాత్రంతా ఈ చల్లటి నీటిలో ఏ వ్యక్తయినా ఉంటాడా?’’ అన్నాడు. ‘‘అలాంటి వ్యక్తి తప్పక దొరుకుతాడు’’ అని బదులిచ్చాడు బీర్బల్‌. ‘‘అలాంటి వ్యక్తి దొరికితే వెయ్యి బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను’’ అన్నాడు అక్బర్‌. వెంటనే బీర్బల్‌ ఊరంతా తిరిగి ఒక పేద వ్యక్తిని పట్టుకొచ్చాడు. ఆ వ్యక్తి కొలనులోకి దిగగానే ఇద్దరు భటులను నియమించాడు అక్బర్‌.


మరుసటి రోజు ఉదయం భటులు ఆ వ్యక్తిని మహారాజు దగ్గరకు తీసుకెళ్లారు. అతణ్ణి చూసి ఆశ్చర్యపోయిన అక్బర్‌ ‘‘చల్లటి కొలనులో ఎలా ఉండగలిగావు?’’ అని అడిగాడు. అప్పుడా వ్యక్తి ‘‘కొలను దగ్గరే ఉన్న వీధి దీపాన్ని చూస్తూ ఉండిపోయాను. దానివల్ల నాకు చలి తెలియలేదు’’ అన్నాడు. ‘‘అయితే నీకు ఎలాంటి బహుమతి ఇవ్వను. ఆ దీపం నుంచి వచ్చే వేడితో నీవు చలి తెలియకుండా బయటపడ్డావు’’ అన్నాడు అక్బర్‌. దాంతో ఏం చేయాలో పాలుపోక ఆ పేదవాడు బీర్బల్‌ దగ్గరకు పరుగెత్తాడు. బీర్బల్‌ మరుసటి రోజు సభకు రాలేదు. ఏం జరిగిందో తెలుసుకొమ్మని భటులను పురమాయించాడు అక్బర్‌. వెళ్లి వచ్చిన భటులు ‘‘కిచిడీ వండడం పూర్తి కాగానే వస్తానని చెప్పమన్నాడు’’ అని విన్నవించారు. కానీ గంటలు గడిచినా బీర్బల్‌ రాలేదు. దాంతో స్వయంగా అక్బర్‌ బయలు దేరి బీర్బల్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ బీర్బల్‌ మంట పెట్టి, ఐదడుగుల పైన కిచిడీ పాత్రను వేలాడదీశాడు. అది చూసి అక్బర్‌ నవ్వుకున్నాడు. ‘‘బీర్బల్‌! పాత్రను మంటకు అంత దూరం పెడితే కిచిడీ ఎలా పూర్తవుతుంది’’ అన్నాడు. అప్పుడు బీర్బల్‌ ‘‘ఆ పేదవాడు వీధి దీపం నుంచి వేడిని పొందినట్టుగానే, ఇక్కడ కూడా కిచిడీ అవుతుంది’’ అని సమాధానమిచ్చాడు. దాంతో అక్బర్‌ తప్పు తెలుసుకుని పేదవాడికి బహుమతి ఇచ్చి పంపించాడు.

Updated Date - 2020-09-30T05:55:59+05:30 IST