ముక్కంటి ఆలయ చైర్మన్‌గా బీరేంద్రవర్మ

ABN , First Publish Date - 2021-07-18T04:58:13+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బీరేంద్రవర్మ నియమితులయ్యారు.

ముక్కంటి ఆలయ చైర్మన్‌గా బీరేంద్రవర్మ
బీరేంద్రవర్మ

శ్రీకాళహస్తి, జూలై 17: శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బీరేంద్రవర్మ నియమితులయ్యారు. ఆ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఆలయ చరిత్రలో మొదటిసారిగా చైర్మన్‌ పదవి స్థానికేతరులకు దక్కడం విశేషం. సత్యవేడు మండలం ఓబులవారికండ్రిగకు చెందిన బీరేంద్రవర్మ కాంగ్రెస్‌ నేతగా సేవలందించారు. 2005లో పార్టీ తరపున జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన వైసీపీలో చేరారు. బీరేంద్రవర్మకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో సన్నిహితంగా ఉండడం, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పదవి దక్కడంలో కలసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు. బీరేంద్రవర్మ ప్రస్తుతం వైసీపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం గెలవడంలో ఎంతగానో కృషిచేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్లుగా పనిచేసిన మాధవరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాంతారాం పవార్‌, పీఆర్‌మోహన్‌, కొండుగారి శ్రీరామరామమూర్తి, కోలా ఆనంద్‌, పోతుగుంట గురవయ్యనాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన వారే. తొలిసారి ప్రభుత్వం నిబంధనలు మార్చి స్థానికేతరుడైన బీరేంద్రకు ముక్కంటి ఆలయ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. 2015 సెప్టెంబరులో పోతుగుంట గురవయ్య నాయుడు చైర్మన్‌గా ఏర్పాటైన ఆలయ ధర్మకర్తల మండలి రెండేళ్ల పాటు కొనసాగింది. అప్పటి నుంచి నాలుగేళ్లుగా చైర్మన్‌ పదవి ఖాళీగా ఉండడం విశేషం. 


వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి

శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పదవిని సత్యవేడు మండలానికి చెందిన బీరేంద్రవర్మను నియమించడంపై వైసీపీ నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. ఈ పదవి కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తున్న స్థానిక నేతల ఆశలపై ప్రభుత్వ నిర్ణయం నీళ్లు చల్లినట్టయింది. దీంతో అధికారంలో లేనపుడు పార్టీని కాపాడుకుంటూ వచ్చామనీ, పదవుల విషయం వచ్చేసరికి తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. కాగా, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం తన పూర్వజన్మ సుకృతమని బీరేంద్రవర్మ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-18T04:58:13+05:30 IST