GHMC : జననం.. మరణం.. ధ్రువపత్రం జాప్యం!

ABN , First Publish Date - 2021-10-18T17:47:27+05:30 IST

మీరు ఇచ్చిన ఐడీ ఆధారంగా వివరాలు పంపాం. ఒక సర్కిల్‌కు బదులు మరో సర్కిల్‌కు వెళ్లాయంటున్నారు...

GHMC : జననం.. మరణం.. ధ్రువపత్రం జాప్యం!

  •          సర్కిళ్లలో మారని ఉద్యోగుల పనితీరు
    • పట్టించుకోని ఉన్నతాధికారులు
    • కేంద్ర కార్యాలయంలోనే హడావిడి
    • క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టని వైనం
    • వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌

హైదరాబాద్‌ సిటీ : చార్మినార్‌ సర్కిల్‌ పరిధిలో 650 జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఇచ్చిన లాగిన్‌ ఐడీ ఆధారంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బంది శిశువుల జనన వివరాలు పంపారు. సదరు సమాచారమూ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. అధికారులు లాగిన్‌ ఐడీ తప్పుగా ఇవ్వడమే ఇందుకు కారణం. రెండు నెలలైనా ఆన్‌లైన్‌ వివరాలు నమోదు కాకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రి వర్గాలను నిలదీస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఐడీ ఆధారంగా వివరాలు పంపాం. ఒక సర్కిల్‌కు బదులు మరో సర్కిల్‌కు వెళ్లాయంటున్నారు. ఐటీ విభాగం చొరవ తీసుకొని సంబంధిత సర్కిల్‌కు పంపాలని లేఖ ఇచ్చాం’ అని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.


నాలుగు వారాలు దాటినా ఇప్పటికీ స్పందన లేదు. బల్దియాలోని హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగం పనితీరుకు ఇది నిదర్శనం. ఓ సర్కిల్‌లో 600కు పైగా బర్త్‌, డెత్‌ల రిజిస్ర్టేషన్‌ పెండింగ్‌లో ఉంటే, మరి గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో పరిస్థితి ఏమిటి? కొత్త విధానం అందుబాటులోకి వచ్చినా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నా, జీహెచ్‌ఎంసీలో పారదర్శక పౌర సేవల విషయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి ఉద్యోగుల పనితీరు మారనంత వరకు ఎన్ని సంస్కరణలు చేసినా.. ఏ సాఫ్ట్‌వేర్‌ వినియోగించినా ఫలితం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


అక్రమాలకు చెక్‌ పెట్టేలా..

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలపై గతంలో పోలీస్‌ కేసులు నమోదయ్యాయి. పలువురు ఏసీబీకి పట్టుబడ్డారు. బోగస్‌ పత్రాల జారీ, ఇతర రాష్ర్టాల్లో పుట్టిన వారికీ నగరంలో జన్మించినట్టు బర్త్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు. రూ.5 వేల నుంచి రూ.8 వేలు ఇస్తే దేశ, విదేశాల్లో ఎక్కడ పుట్టిన వారికైనా జీహెచ్‌ఎంసీలో జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. కొందరికి తీవ్ర ఇబ్బందులు తప్పటడం లేదు. వీటన్నింటికి చెక్‌ పెట్టేలా.. అంతకుముందు రిజిస్ర్టార్లుగా వ్యవహరించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తప్పించి ఏఎంసీ, ఏఎంఓహెచ్‌లకు సబ్‌ రిజిస్ర్టార్‌, రిజిస్ర్టార్లుగా బాధ్యతలు అప్పగించారు. కాల వ్యవధిని బట్టి సంబంధిత అధికారుల ఫోన్‌ నెంబర్‌కు వచ్చే వన్‌ టైం పాస్‌ వర్డ్‌(ఓటీపీ) ఆధారంగా ఆన్‌లైన్‌లో జనన, మరణ పత్రాల నమోదు జరుగుతుంది. కొత్త విధానంలో పౌరులు దరఖాస్తు చేయకుండానే జనన, మరణ ధృవీకరణ పత్రం తీసుకునే వెసులుబాటు ఉంటుంది.


ఎప్పటికప్పుడు నమోదు చేయక...

శిశువు పుట్టిన వెంటనే వారి తల్లిదండ్రులు చెప్పిన వివరాలను ఆస్పత్రి సిబ్బంది జీహెచ్‌ఎంసీ ఇచ్చిన లాగిన్‌ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఫారం-1తో పాటు ఇతరత్రా పత్రాలు స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం మ్యాన్యువల్‌గా ఫైల్‌ను ఆస్పత్రి సిబ్బంది స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో అందజేస్తారు. వాటి ఆధారంగా సబ్‌ రిజిస్ర్టార్‌, రిజిస్ర్టార్ల ఆమోదంతో సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ అవుతాయి. ఆస్పత్రిలో సిబ్బంది వివరాలు అప్‌లోడ్‌ చేసినప్పటి నుంచి సర్కిల్‌ కార్యాలయానికి వెళ్లినా, అక్కడ అధికారులు ఆమోదించినా ఆ సమాచారం పౌరులకు వస్తుంది. 


మ్యాన్యువల్‌గా ఫైల్స్‌ వచ్చినా.. కొన్ని సర్కిళ్లలో ఆన్‌లైన్‌ నమోదులో జాప్యం జరుగుతోంది. మరి కొన్ని చోట్ల ఆస్పత్రుల నుంచి ఫైళ్లు రావడం లేదని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు లేకపోవడంతో షార్ట్‌ ఫాల్స్‌ కోసం కూడా ఆలస్యం అవుతోంది. ‘ఇవన్నీ అంతర్గత కారణాలు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోంది’ అని చార్మినార్‌కు చెందిన ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. కేంద్ర కార్యాలయంలో హడావిడి చేస్తున్నా, మెజార్టీ సర్కిళ్లలో సిబ్బంది పనితీరు సక్రమంగా లేక పౌర సేవలపై ప్రభావం పడుతోంది.


నయా విధానం.. పాత పద్ధతే...

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలు పెరగడంతో నూతన సాఫ్ట్‌వేర్‌తో నయా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు.  దాని ప్రకారం పౌరులు రిజిస్ర్టేషన్‌ చేసుకోకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పటికీ.. పౌరులు కార్యాలయాలకు వెళ్తే కానీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం దాదాపు 3 నుంచి 4 వేల వరకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ఆన్‌లైన్‌ నమోదు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. 

Updated Date - 2021-10-18T17:47:27+05:30 IST