Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : అనాలోచిత నిర్ణయాలతో.. జనన, మరణ సర్టిఫికెట్ల జారీలో అంతరాయం..!

  • పలు ప్రాంతాల్లో నిలిచిన సేవలు
  • సాంకేతిక నిర్వహణ నేపథ్యంలోనేనా..?
  • ముందస్తు సమాచారం ఇవ్వని జీహెచ్‌ఎంసీ, మీ సేవా 
  • సాంకేతిక సమస్య కావొచ్చు.. 
  • త్వరలో పరిష్కరిస్తాం- బల్దియా ఐటీ విభాగం

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ, మీ సేవా విభాగాల అనాలోచిత నిర్ణయాలతో గ్రేటర్‌ పౌరులు మరోసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా, పౌరులను అప్రమత్తం చేయకుండా అధికారులు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజులుగా మీ సేవా కేంద్రాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండగా.. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, అప్‌డేట్‌ చేసే క్రమంలోనే ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది.


సమన్వయ లోపం..

బోగస్‌ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి చెక్‌ పెట్టడం, పారదర్శక పౌర సేవల కోసమంటూ కొన్నాళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్ల(సీఎ్‌ససీ)లో ఇస్తున్న పత్రాల జారీ సేవలు నిలిపివేసింది. ఆ బాధ్యతలు మీ సేవా కేంద్రాలకు అప్పగించి కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. జీహెచ్‌ఎంసీ, మీ-సేవా విభాగాల మధ్య సమన్వయ లోపంతో సర్టిఫికెట్లు తీసుకోవడంలో మొదటినుంచి పౌరులు అవస్థలు పడుతున్నారు.

ప్రవేశాలు.. తల్లిదండ్రుల తిప్పలు

నయా విధానంలో సర్టిఫికెట్ల జారీలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్టిఫికెట్‌లో సవరణలకూ మీ సేవా కేంద్రాల్లో అవకాశం లేదు. పేరు, ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే సీఎస్‌సీల్లో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ‘జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అత్యవసరమున్న వారు సర్టిఫికెట్‌ తీసుకోండి.. నాలుగైదు రోజులు సేవల్లో అంతరాయం ఉంటుంది’ అని వారం ముందే ప్రకటించి ఉంటే బాగుండేదని ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ పౌరుడు పేర్కొన్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ స్కూల్‌లో పాప అడ్మిషన్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. తెలిసిన వారితో చెప్పిస్తే.. 17వ తేదీన ఒరిజినల్‌ జననపత్రం, ఇతరత్రా వివరాలు తీసుకురావాలని పాఠశాల సిబ్బంది చెప్పారు. 


సర్టిఫికెట్‌ కోసం గురువారం మీ సేవా కేంద్రానికి వెళితే సాంకేతిక సమస్యలతో ప్రింట్‌ రాలేదు. ఆబిడ్స్‌ సర్కిల్‌ కార్యాలయానికి వెళితే సీఎస్‌సీల్లో సేవలు నిలిపివేశారు.. మీసేవా కేంద్రాల్లోనే తీసుకోవాలని అక్కడి ఉద్యోగులు చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ తండ్రి ఆందోళన చెందుతున్నాడు. అతనొక్కడే కాదు.. గత రెండు రోజులుగా వందల సంఖ్యలో పౌరులకు జనన, మరణ సర్టిఫికెట్లు తీసుకోవడంలో  ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిపై జీహెచ్‌ఎంసీ ఐటీ విభాగం వర్గాలు స్పందిస్తూ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయడం లేదు. సాంకేతిక సమస్య వల్ల ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వారంపాటు సేవలు నిలిపివేయడం ఉండదు అని స్పష్టం చేశాయి.

Advertisement
Advertisement