భాగ్యనగరంలో బిట్‌కాయిన్‌ పేరిట కొత్త దందాలు..

ABN , First Publish Date - 2021-04-02T19:00:49+05:30 IST

బిట్‌కాయిన్‌ పేరిట కొత్త దందాలు పుట్టుకొస్తున్నాయి. ఇది కూడా బిట్‌కాయిన్‌ మార్కెట్‌ను...

భాగ్యనగరంలో బిట్‌కాయిన్‌ పేరిట కొత్త దందాలు..

  •  బింటెక్స్‌ పేరిట మరో కొత్త ఫ్యూచర్‌ బిట్‌కాయిన్‌
  •  లాభాలు ఎక్కడి నుంచి వస్తాయంటే స్పష్టత కరువు
  •  ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్‌ : బిట్‌కాయిన్‌ పేరిట కొత్త దందాలు పుట్టుకొస్తున్నాయి. ఇది కూడా బిట్‌కాయిన్‌ మార్కెట్‌ను పోలినట్టే ఉంటుందని, దీనిని ఫ్యూచర్‌ బిట్‌ కాయిన్‌ అని చెబుతూ బింటెక్స్‌ అనే కొత్త దందాను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. అసలు ఈ బింటెక్స్‌ కాయిన్‌ ఏమిటి...? ఎవరు మొదలు పెట్టారు...? ఎలా మార్కెట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విషయంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి అందిస్తున్న పరిశోధనాత్మక కథనం ఇది..


ఎంతో మంది నిందితులు

బిట్‌కాయిన్‌ వ్యాపారం ఊపందుకోవడంతో దాన్నే సంపాదనకు అవకాశంగా మలుచుకున్న కొందరు నిందితులు అడ్డదారులు తొక్కారు. బిట్‌ కాయిన్‌ వ్యాపారం పేరుతో భారీ మోసం చేసిన సిరిమల్ల నాగరాజు అనే క్రిమినల్‌ను హైదరాబాద్‌  సీసీఎస్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించారు. కేవలం నాగరాజు ఒక్కడే కాదు, బిట్‌కాయిన్‌ పేరిట కొన్ని వందల మంది వివిధ పేర్లు, వెబ్‌సైట్‌లు నిర్వహిస్తూ అందిన కాడికి దోచుకుంటు న్నారు. అప్పట్లో నాగరాజును విచారించగా ఆన్‌లైన్‌ బిట్‌ కాయిన్‌ పేరుతో 4వెబ్‌సైట్లు సృష్టించి దేశవ్యాప్తంగా వసూళ్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. పెట్టుబడులు పెడితే 18వారాల్లో అధిక లాభాలతో చెల్లింపులు చేస్తానని నమ్మించిన నాగరాజు దేశవ్యాప్తంగా 1200మంది నుంచి సుమారు రూ.50కోట్లు దాకా వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క తెలంగాణ లోనే 250మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు.


కట్టే డబ్బు విలువ డిసెంబర్‌ వరకు మూడు నుంచి అయిదు రెట్లు పెరుగుతుందని నమ్మించారు. రూ. 5లక్షలు పెట్టుబడి పెట్టి ఈ కాయిన్‌ కొన్న తర్వాత వాలెట్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుంటే మరిన్ని టోకెన్స్‌ అలాట్‌ చేస్తారు. ఆ వాలెట్‌ యాప్‌లో మనం కొన్న బింటెక్స్‌ టోకెన్‌ రేటు ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు. రూ. 5లక్షల డబ్బులను 12 నెలలు కనుక హోల్డ్‌ చేస్తే రూ. 20నుంచి రూ.30లక్షల వరకు సంపాదించ వచ్చని వెల్లడించారు.  కంపెనీపై రూ. 6కోట్ల పెట్టుబడులు పెట్టామని... అమెరికాలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. వాళ్లు కూడా కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని ప్రచారం కల్పించారు. 


బిట్‌కాయిన్‌ విలువ పెరిగినట్లే బింటెక్స్‌ కూడా త్వరలోనే భారీగా పెరగనుందని ప్రచారం చేశారు. దానికి బ్లాక్‌మనీ, వైట్‌మనీ ఏదైనా పెట్టుబడిగా పెట్టవచ్చని పెట్టుబడి దారులకు గాలం వేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రారంభ దశలో ఉన్న ఈ కంపె నీలో ఇప్పటి వరకు ఎంతమంది పెట్టుబడులు పెట్టారో స్పష్టత లేనప్పటికీ.. లాభాలు ఎక్కడి నుంచి ఇస్తారనే విషయంలో సరైన ప్రణాళిక లేదు. మరో వైపు కస్టమర్లను తీసుకొస్తే 20శాతం కమీషన్‌ కూడా ఇస్తారట. కమీషన్లు, లాభాలు ఎక్కడి నుంచి వస్తాయనే విషయంలో వారి వద్ద స్పష్టత లేదు. ఇది కేవలం ఓ బింటెక్స్‌ మాత్రమే కాదు.. ఇలాంటి వందల కంపెనీలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి స్కీముల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


నగరంలో నకిలీలు..

ప్రతి దానికి నకిలీ తయారు చేయడంలో దిట్టలైన క్రిమినల్స్‌ బిట్‌కాయిన్‌‌ను కూడా వదల్లేదు. ప్లానింగ్‌ పక్కాగా చేసుకున్న గ్యాంగ్‌ ఫ్యూచర్‌ బిట్‌ కాయిన్‌ అని ప్రాచుర్యం కల్పిస్తూ కొత్తగా బింటెక్స్‌ పేరుతో ఓ కాయిన్‌ మార్కెట్‌లోకి తీసుకురావడానికి రంగం  సిద్ధం చేశారు. దీనికోసం నలుగురు  స్కెచ్‌ వేసినట్లు తెలిసింది. పెద్ద పెద్ద హోటళ్లలో మీటింగ్‌లు ఏర్పాటు చేసి భారీగా పెట్టుబడుల సేకరణకు ప్లాన్‌ చేసుకున్నారు. బింటెక్స్‌లో నగరానికి చెందిన వ్యక్తి ఫౌండర్‌ కమ్‌ సీఈఓగా ఉంటూ భారతదేశంలో స్టార్ట్‌ చేయాలని నిర్ణయించాడు. క్రిప్టోకరెన్సీ బింటెక్స్‌ అనే టోకెన్‌ లాంచ్‌ చేశాడు. ఈ కాయిన్‌ను రూ.75ల మార్కెట్‌ రేటుతో రిలీజ్‌  చేసినట్లు స్వయానా అతనే ఒప్పుకొన్నాడు. ఈ కాయిన్‌ ఇంటర్‌నేషనల్‌ మార్కెట్‌లో  ట్రేడ్‌ అవుతోందని తెలిపారు. క్రిప్టో కరెన్సీ స్టోర్‌ చేసుకోవడానికి డిసెంట్రలైజ్డ్‌ అడ్వాన్సుడ్‌ వాలెట్‌ను మొదలు పెట్టడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. సొంతగా కరెన్సీ ఎక్స్‌చేంజ్‌ బిల్డ్‌ చేస్తున్నట్టు ప్రచారం కల్పించారు. పెట్టుబడులు పెట్టిన తమ కస్టమర్లకు రూ. 75 కాయిన్‌ను మూడు రెట్ల లాభం వచ్చేలా చూస్తాం అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అంతే కాకుండా కట్టిన డబ్బుకు తాము సెక్యూరిటీ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2021-04-02T19:00:49+05:30 IST