Abn logo
Sep 24 2021 @ 10:18AM

బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌...బహుపరాక్‌

నిండా ముంచేస్తున్న సైబర్‌  నేరగాళ్లు

వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి టోకరా 

అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు


హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌: సైబర్‌ నేరస్థులు తమ మోసాలకు ఇప్పుడు బిట్‌ కాయిన్‌ను వినియోగించుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీ పేరిట దూసుకెళ్తున్న బిట్‌కాయిన్‌ల కోసం జనం డబ్బులు వెచ్చిస్తున్నారని గ్రహించి దాన్నే తమ దందాగా మార్చుకున్నారు. తాజాగా సైబర్‌క్రైమ్‌లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే వాట్సాప్‌ గ్రూపుల ద్వారా బిట్‌కాయిన్‌లపై అవగాహన, ట్రేడింగ్‌ పేరుతో దోచుకుంటున్నట్లు తెలుస్తోంది.


వాట్సాప్‌ గ్రూపుతో బురిడీ

బిట్‌కాయిన్‌- ఎం8 పేరిట ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసిన మోసగాళ్లు నగరానికి చెందిన నజీబుద్దీన్‌ ఫోన్‌ నెంబర్‌ను అందులో యాడ్‌ చేశారు. బిట్‌కాయిన్‌లో లాభాలు అధికంగా వస్తాయంటూ గ్రూపులో శిక్షణ ప్రారంభిస్తారు. అదే గ్రూపులో ఉండే మోసగాళ్ల గ్యాంగుకు చెందిన వారు తాము రూ. కోట్లలో సంపాదిస్తున్నామని పోస్టు చేస్తుంటారు. సహజంగానే.. దానిని నమ్మిన వారు ఆసక్తి చూపిస్తారు. ఇదే అదనుగా బిట్‌కాయిన్‌ విషయంపై శిక్షణ ఇస్తామని కొందరు రంగంలోకి దిగుతున్నారు. శిక్షణ నిమిత్తం కొంత రుసుం తీసుకుని ఆ తర్వాత ట్రైనింగ్‌ పూర్తయినట్లు చెబుతూ పర్సనల్‌ వాట్సా్‌పకు ఓ లింకును పంపిస్తారు. లింక్‌ ఓపెన్‌ చేసి బిట్‌కాయిన్‌లు కొనుగోలు చేయవచ్చని చెబుతారు. ప్రతి రోజు ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని, అనుకూలిస్తే రోజుల వ్యవధిలోనే పెట్టుబడికి 10 రెట్లు సంపాదించవచ్చని ప్రచారం చేస్తారు. నమ్మిన వారు తొలుత రూ.వేలల్లో పెట్టుబడి పెడతారు. ఆదాయం రెట్లు పెరిగినట్లు యాప్‌లో అంకెలు కనిపిస్తాయి. దీంతో పెట్టుబడిని పెంచుకుంటూ వెళతారు. ఇలా రూ. లక్షల్లో వెచ్చించిన తర్వాత సంపాదించిన డబ్బును వెనక్కి తీసుకుందామని ప్రయత్నించేటప్పుడు అసలు విషయం తెలుస్తుంది. ఆ డబ్బు తీసుకునే అవకాశం లేకపోగా, వారి ఖాతాను ఆ లింకు నుంచి డిలీట్‌ చేసేస్తారు. మళ్లీ ప్రయత్నిస్తే ఖాతా తెరుచుకోదు. ఇదే తరహాలో నజీబుద్దీన్‌ రూ. 14 లక్షలు కోల్పోయి సైబర్‌ క్రైంలో ఫిర్యాదు చేశారు. 


విభిన్న మోసాలు

మోసగాళ్లు తొలుత బ్రోకర్లుగా పరిచయం చేసుకుంటారు. తక్కువ ధరలో కొన్ని బిట్‌కాయిన్‌లు వారి ఖాతాలోకి వచ్చేట్లు చేస్తారు. దీంతో ఎక్కువ కొనుక్కుందామని భావించిన వారు నేరస్థులు చెప్పే అకౌంట్‌కు డబ్బులు పంపించేస్తారు. ఇలా తొలుత బైనాన్స్‌, విజ్‌రిక్స్‌ అనే వెబ్‌సైట్లతో ఆశావహులకు ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్స్‌ పంపించి.. ఎక్కువ డబ్బు రాగానే దుకాణం మూసేస్తారు. ఇలా ఇప్పటి వరకు మోసపోయిన వారు నగరంలోనే వందల సంఖ్యలో ఉన్నారు.


కింగ్‌పిన్‌ అరెస్టు అయినా

బిట్‌కాయిన్‌ పేరిట తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వేల మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సిరిమల్ల నాగరాజును సరిగ్గా ఏడాది క్రితం సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు తెలంగాణ రీజియన్‌కు హెడ్‌గా వ్యవహరించాడు. ప్రత్యేకంగా తయారు చేసిన వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో జనం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే 18 వారాల్లో అధిక మొత్తాల లాభాలతో తిరిగి చెల్లిస్తానని నమ్మించి పలువురిని నట్టేట ముంచాడు. బైనరీ పద్ధతి (గొలుసు స్కీము)లో  దేశవ్యాప్తంగా సుమారు 1200 మంది నుంచి రూ. 52కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడి ఉంటాడని అప్పట్లో పోలీసులు గుర్తించారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 250 మంది బాధితుల నుంచి రూ. 10కోట్ల వరకు వసూలు చేశాడు. నాగరాజు మరి కొందరు కలిసి రాస్‌నె్‌ఫ్టహెడ్జ్‌ఫండ్‌.రు, ఆర్‌హెచ్‌ఎ్‌ఫకాయిన్‌.కామ్‌, ఆర్‌హెచ్‌ఎ్‌ఫగోల్డ్‌.కామ్‌, యూరె్‌సకాయిన్‌.కామ్‌ పేరిట నాలుగు వెబ్‌సైట్లు సృష్టించి ఆన్‌లైన్‌ బిట్‌కాయిన్‌ దందా ప్రారంభించి దేశవ్యాప్తంగా దోపిడీకి పాల్పడ్డారు.