మస్క్ యూటర్న్.. బిట్‌కాయిన్ ఢమాల్

ABN , First Publish Date - 2021-05-14T05:30:00+05:30 IST

టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలతో క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతోన్న బిట్‌కాయిన్‌ ద్వారా టెస్లా విద్యుత్‌ కార్ల కొనుగోలు...

మస్క్ యూటర్న్.. బిట్‌కాయిన్ ఢమాల్

7% పైగా క్షీణతతో 50 వేల డాలర్లకు..


టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలతో  క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతోన్న బిట్‌కాయిన్‌ ద్వారా టెస్లా విద్యుత్‌ కార్ల కొనుగోలు వెసులుబాటును నిలిపివేస్తున్నట్లు మస్క్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. దాంతో బిట్‌కాయిన్‌ విలువ గురువారం ఒక దశలో 50,000 డాలర్ల దిగువకు పతనమైంది. భారత కాలమాన ప్రకారం, సాయం త్రం 6.30 గంటల సమయంలో బిట్‌కాయిన్‌ 7.51 శాతం నష్టంతో 50,183 డాలర్ల వద్ద ట్రేడైంది. బిట్‌కాయిన్‌ భారీ క్షీణత కారణంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ విలువ ఒక్కరోజులో 36,585 కోట్ల డాలర్ల మేర క్షీణించి 2.06 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది.


బిట్‌కాయిన్‌ మైనింగ్‌కు బొగ్గు వంటి కాలుష్యకారక ఇంధనాల వినియోగం వేగంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన మస్క్‌.. పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కంపెనీ వద్ద బిట్‌కాయిన్‌ నిల్వలను మాత్రం విక్రయించదలుచుకోలేదన్నారు. 


క్రిప్టో కరెన్సీలు అద్భుతమైన ఆవిష్కరణ అని, వాటికి మంచి భవిష్యత్‌ ఉందని మస్క్‌ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. అయితే, పర్యావరణానికి నష్టం కలిగించేదిగా ఉండకూడదన్నారు. పూర్తి పర్యావరణహిత పద్ధతుల్లో మైనింగ్‌ జరుగుతున్న క్రిప్టో కరెన్సీల్లో లావాదేవీలకు టెస్లా సుముఖమేనని ఆయన సంకేతాలిచ్చారు. 150 కోట్ల డాలర్ల విలువైన బిట్‌కాయిన్లను కొనుగోలు చేసినట్లు ఫిబ్రవరిలో టెస్లా ప్రకటించింది. తమ కార్ల కొనుగోలుదారుల నుంచి బిట్‌కాయిన్‌ చెల్లింపులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అయితే, ఈ మధ్య మస్క్‌ తన ట్వీట్లలో డోజ్‌కాయిన్‌ అనే క్రిప్టోకరెన్సీ గురించి తరచుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.


2013లో ఈ కరెన్సీ వెలుగులోకి వచ్చింది. మస్క్‌ ట్వీట్ల మద్దతుతో డోజ్‌కాయిన్‌ ప్రాచుర్యంలోకి రావడమే కాకుండా, దాని విలువ కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అంతేకాదు, ‘‘టెస్లా డోజ్‌కాయిన్‌ చెల్లింపులను స్వీకరించవచ్చా?’’ అని మస్క్‌ ఈ మధ్య ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన బిట్‌కాయిన్‌కు బదులు డోజ్‌కాయిన్‌వైపు మొగ్గుచూపుతున్నాడన్న ఊహాగానాలు మార్కెట్లో నెలకొన్నాయి. 

Updated Date - 2021-05-14T05:30:00+05:30 IST