కేసీఆర్‌ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి

ABN , First Publish Date - 2021-10-27T05:21:14+05:30 IST

కేసీఆర్‌ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి

కేసీఆర్‌ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి
కన్నూర్‌లో మాట్లాడుతున్న మురళీధర్‌రావు

- ఈటల రాజేందర్‌కు పట్టం కట్టాలి

- బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావు

కమలాపూర్‌, అక్టోబరు 26 : రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబపాలన కొనసాగుతోందని, టీఆర్‌ఎ్‌సకు స్వస్తిచెప్పి.. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు పట్టం కట్టాలని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. కన్నూర్‌ గ్రామంలో మంగళవారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరుపున ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుటుంబపాలన కోసం సీఎం కేసీఆర్‌ చేసిన కుట్రవల్ల హుజూరాబాద్‌లో ఉపఎన్నిక వచ్చిందన్నారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ వెంట ఉండి ఉద్యమం చేసిన వ్యక్తి ఈటల అని అన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కుటుంబ వారసత్వ రాజకీయానికి అడ్డు వస్తున్నారని, అవినీతిని ప్రశ్నిస్తున్నారని కుట్ర పూరితంగా వ్యవహరించి, ఈటలను నమ్మించి గొంతు కోసిండన్నారు. కేటీఆర్‌ను సీఎంను చేసేకుట్రకు ఈటల భగ్నం చేసే ప్రయత్నం చేసినందునే టీఆర్‌ఎస్‌ నుంచి గెంటివేసిండని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతైన ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి రానివ్వొద్దనే కుట్రలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలతో హుజూరాబాద్‌లో క్యాంపు వేసి, బీజేపీ కార్యకర్తలను బెదిస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్‌కు, ఉగ్రవాదులకు, నక్సలైట్లకు, నిజాంలకు ప్రజలు ఎన్నడూ బయపడలేదని, ఇప్పుడు వారికి నరేంద్రమోదీ అండగా ఉన్నారన్నారు.

ప్రజలు కేసీఆర్‌ను సీఎం కుర్చిలో కూర్చోబెడితే.. రాజకీయ హత్యలు చేస్తున్నారని మురళీధర్‌రావు ఆరోపించారు. అలాంటి వ్యక్తి సీఎం కుర్చిలో కూర్చునే అర్హత లేదన్నారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పలు రాష్ర్టాల్లో వారసత్వపు రాజకీయాలే ఉన్నాయన్నారు. కేవలం వారసత్వానికి తావు ఇవ్వని ఏకైక పార్టీ బీజేపీ అని కొనియాడారు. కేసీఆర్‌ అవినీతి లెక్కలు లెక్కిస్తున్నామని, రెండున్నర ఏళ్లు తరువాత వారి భరతం పడుతామని హెచ్చరించారు. కేసీఆర్‌ ఇలాకాలోనే బీజేపీ జెండా ఎగురవేయడం జరిగిందని, అదే మాదిరిగా హుజూరాబాద్‌లో సైతం బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అమ్ముడుపోమే పార్టీ, కోవర్టుల పార్టీ అని ఎద్దేవా చేశారు. సిద్ధాంతాలపై నిలబడేది, దేశభక్తిపై నడిచే పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నా రు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి, శ్రీశైలంగౌడ్‌, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:21:14+05:30 IST