టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపే

ABN , First Publish Date - 2021-01-20T05:08:15+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజలు గుర్తించారని కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపే
సమావేశంలో మాట్లాడుతున్న కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి

ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన ముఖ్యమంత్రి

ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్‌

ఏ ఎన్నికలు జరిగినా విజయం కమలానిదే

కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి

నేలకొండపల్లి, జనవరి19: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజలు గుర్తించారని కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నేలకొండపల్లిలోని సీతారామ ఫంక్షన్‌ హాల్లో జరిగిన బీజేపీ మండల సమావేశంలో శ్రీధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అరాచకాలు పెరిగిపోయాయన్నారు. కాంగ్రెస్‌ ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులందరూ గులాబీ కండువా కప్పుకుని, టీఆర్‌ఎస్‌కు భజన చేస్తూ తోకలుగా మారిపోయారన్నారు. ప్రజల పక్షాన పోరాడగలిగే శక్తి ఒక్క బీజేపీకే ఉందని గుర్తించిన ప్రజలు, బీజేపీని నమ్ముతున్నారన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి రాచరిక పాలన నడుపుతూ, నియంతలా వ్యవహరిస్తున్నారు. కేవలం ఫామ్‌హౌజ్‌ కే పరిమితమయ్యారు. రాష్ట్రంలో నడుస్తున్న కుటుంబ పాలన పట్ల ప్రజలు విసుగెత్తి పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌ను ఓడించి, కేసీఆర్‌కు బుద్ది చెప్పటానికి, బీజేపీకి పట్టం గట్టటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. రానున్న రోజులు బీజేపీవేనని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భవనాశి దుర్గారావు, కిసాన్‌ మోర్చా జిల్లా కార్యదర్శి మన్నె కృష్ణారావు, దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు సూరేపల్లి జ్ఞానరత్నం,యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్‌, మండల ప్రధాన కార్యదర్శి గొలుసు ఆంజనేయులు, మీగడ గోపి, కోటి హనుమంతరావు, ఇస్లావత్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వివిధ గ్రామాల నుంచి చేరికలు...

మండల పరిధిలోని నేలకొండపల్లి, ఆచార్లగూడెం, మండ్రాజుపల్లి, బుద్దారం గ్రామాల నుంచి దాదాపు వంద మంది యువకులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు శ్రీధర్‌రెడ్డి సమక్షంలో మంగళవారం బీజేపీలో చేరారు.అందరికీ పార్టీ కండువాలు కప్పి శ్రీధర్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కన్నెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్‌, బండి ఉపేందర్‌, చింతల సీతారాములు, మర్రి శివ, యాసం శివ తదితరులు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు. 

ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీదే గెలుపు

ఖమ్మం మయూరిసెంటర్‌, జనవరి19: ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగిన బీజేపీదే గెలుపని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అద్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఒకటో టౌన్‌లో జరిగిన బూత్‌కమిటీ సమావేశంలో ఆయన పాల్గోని మాట్లాడారు. గ్రేటర్‌ ఎన్నికలు ఆదర బాదరగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు వెనుకంజ వేస్తున్నదని ఆరోపించారు. గ్రేటర్‌ దెబ్బకు టీఆర్‌ఎస్‌లో వణుకు ప్రారంభమైందని అన్నారు. ఖమ్మంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు.  త్వరలో టీఆర్‌ఎస్‌ అక్రమాలపై పూర్తి స్థాయి చార్జీ షీట్‌ విడుదల చేస్తామని అన్నారు. కార్యకర్తలు అన్ని పోలింగ్‌ బూత్‌ కమిటీలను రెండు రోజుల్లోగా ఇవ్వాలని కోరారు. సమావేశంలో వెంకట్‌, జిల్లా కార్యదర్శి ప్రదీప్‌, వెంకట్‌గుప్తా, వీరభద్రం, ప్రసాద్‌, శ్యాం, శ్రీనివాస్‌ ఉన్నారు.  

Updated Date - 2021-01-20T05:08:15+05:30 IST