రాహుల్ గాంధీ చెప్పినది అబద్ధం : బీజేపీ

ABN , First Publish Date - 2021-08-18T00:38:35+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతాను అన్‌లాక్

రాహుల్ గాంధీ చెప్పినది అబద్ధం : బీజేపీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతాను అన్‌లాక్ చేయించుకోవడం కోసం అబద్ధాలు చెప్పారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. అత్యాచార బాధిత మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫొటోను షేర్ చేయడంపై దేశానికి అబద్ధం చెప్పారని మండిపడ్డారు. బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడేటపుడు సైతం తన గుర్తింపు వివరాలు వెల్లడికాకుండా జాగ్రత్తవహించిన సంగతిని గుర్తు చేశారు. 


ఢిల్లీలో తొమ్మిదేళ్ళ మైనర్ బాలికపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, హత్య చేయడంతో, ఆమె కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించి, వారి ఫొటోను ట్వీట్ చేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించడంతో ట్విటర్ ఆయన ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఆ ఫొటోను షేర్ చేయడానికి బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమతిని పొందినట్లు రాహుల్ గాంధీ తెలియజేయడంతో ట్విటర్ ఆయన ఖాతాను పునరుద్ధరించింది. 


సంబిత్ పాత్రా మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని, ఆమెను హత్య చేశారని చెప్పారు. దీనిపై కూడా రాహుల్ గాంధీ రాజకీయాలు చేశారన్నారు. చట్ట పరిధిని దాటి ఆయన ఆ బాలిక తల్లిదండ్రుల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారని చెప్పారు. ఈ ఫొటోను బహిరంగంగా షేర్ చేయడానికి తమ అంగీకారం లేదని బాధితురాలి తల్లి స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని చెప్పారు. బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడేటపుడు సైతం తన గుర్తింపు వివరాలు వెల్లడి కాకుండా జాగ్రత్త వహించారన్నారు. ట్విటర్ పాలసీ ప్రకారం రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసిందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆ ఫొటోను షేర్ చేయడానికి తనకు అనుమతి ఇచ్చారని రాహుల్ గాంధీ దేశానికి అబద్ధం చెప్పారన్నారు. బాధ్యతగల రాజకీయ నాయకుడెవరూ ఈ విధంగా చేయరన్నారు. రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను మళ్ళీ లాక్ చేయాలన్నారు. 


ఇదిలావుండగా, బాధితురాలి తల్లి తన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడానికి అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ చెప్తోంది. దీనికి సంబంధించిన లేఖను ట్విటర్‌కు సమర్పించడంతో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతల ఖాతాలను ట్విటర్ అన్‌లాక్ చేసింది. 


Updated Date - 2021-08-18T00:38:35+05:30 IST