స్థానాల కోసం సిగ‘పాట్లు’

ABN , First Publish Date - 2021-03-03T15:21:47+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పోలింగ్‌కు ఇంకా 34 రోజులు మాత్రమే మిగిలివున్నప్పటికీ ప్రత్యర్థులెవ్వరో, ఎంత మందో ...

స్థానాల కోసం సిగ‘పాట్లు’

అన్ని కూటముల్లో కుస్తీ పట్లు   

పార్టీలన్నింటికీ అవే అగచాట్లు


చెన్నై (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పోలింగ్‌కు ఇంకా 34 రోజులు మాత్రమే మిగిలివున్నప్పటికీ ప్రత్యర్థులెవ్వరో, ఎంత మందో అర్థంగాక, తమ భాగస్వామ్య పార్టీలకు సీట్లు ఖరారుగాక, ఏఏ స్థానాలో ఇవ్వాలో తెలియక అన్ని ప్రధాన పార్టీలు గందరగోళంలో పడిపోయాయి. ఇక చిన్న పార్టీలైతే తాము నమ్ముకున్న కూటమిలో చోటు దక్కుతుందో లేదో, దక్కినా ఎన్ని స్థానాలు వస్తాయో తెలియక అయో మయంతో చూస్తున్నాయి. ఎన్నికల నామి నేషన్‌ ప్రక్రియ మరో వారం రోజులు ప్రారంభం కానున్నప్పటికీ ఏమాత్రం స్పష్టత లేని, అస్పష్టమైన అవగాహనతో అన్ని పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి.


అన్నాడీఎంకేకు కొరకరాని కొయ్యలుగా ఆ రెండు పార్టీలు

అధికార అన్నాడీఎంకేకు బీజేపీ, డీఎండీకే పార్టీలు కొరకరాని కొయ్యలుగా తయార య్యాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి అధిక స్థానాల కోసం తీవ్ర ఒత్తిడి వున్నట్లు అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. ఆదిలో 60 స్థానాలు కావాలంటూ బేరసారాలు సాగించిన బీజేపీ.. ప్రస్తుతం 30 స్థానాలు, కన్నియకుమారి లోక్‌సభ స్థానం తమకు కేటాయించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నట్టు ఆ నేతలు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జులైన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, వీకే సింగ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సీటీ రవి, కో-ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ ఇప్పటికే నాలుగు దఫాలుగా అన్నాడీఎంకే ముఖ్యనేతలైన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంతో చర్చించారు. ఆనక ఇరువర్గాలు కేంద్రహోమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యాయి. అయితే ఆయన కూడా తమకు కనీసం 30 స్థానాలు కావాల్సిందేనని, స్థానాలు కొంత తక్కువైనా తాము కోరుకున్న నియోజకవర్గాలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పినట్టు సమాచారం. ఒకవేళ బీజేపీ అడిగినన్ని స్థానాలు, కోరిన నియోజకవర్గాలు ఇస్తే తమకేమీ మిగలదని, భవిష్యత్తులో పూర్తిగా బీజేపీపై ఆధారపడాల్సిందేనని ఈపీఎస్‌, ఓపీఎస్‌ భావిస్తున్నారు. దాంతో బీజేపీ నేతలకు సర్ది చెప్పలేక, అలాగని ఆ పార్టీ నేతలు అడిగిన స్థానాలు ఇవ్వలేక వారు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. అయితే తమ పార్టీల నడుమ సంబంధాలు బాగున్నాయని, ఇరువర్గాల మధ్య చర్చలు సాఫీగా సాగుతున్నాయని వీకే సింగ్‌ మంగళవారం మీడియా ముందు పేర్కొన్నారు. ఒకటీరెండు రోజుల్లోనే తమ వ్యవహారంపై స్పష్టత వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు డీఎండీకే కూడా అన్నాడీఎంకేకు చికాకు కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి 12 స్థానాలు ఇచ్చేందుకు అన్నాడీఎంకే నేతలు సుముఖంగా వుండగా, తమకు కనీసం 20 కావాల్సిందేనని డీఎండీకే పట్టుబుడుతోంది. తమ విన్నపాన్ని పరిశీలించనిపక్షంలో తమదారి తాము చూసుకుంటామని కూడా తెగేసి చెప్పింది. దీంతో అన్నాడీఎంకే నేతలు కేపీ మునుస్వామి, మంత్రులు తంగమణి తదితరులు మంగళవారం సాయంత్రం ఓ హోటల్లో డీఎండీకే నేతలతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం ఇంకా వెలువడలేదు. ఇక టీఎంసీ వ్యవహారం కూడా తేలాల్సి వుంది. అయితే ఆ పార్టీ అధినేత జీకే వాసన్‌కు రాజ్యసభ స్థానం ఇప్పటికే ఇచ్చినందున ఆయన తాము ఇచ్చినన్ని స్థానాలతో సర్దుకుంటారని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఇక చిన్న పార్టీలైన పుదియనీది కట్చి, పుదియ తమిళగం, మూవేందర్‌ మున్నేట్ర మున్నని తదితర పార్టీల స్థానాలపైనా స్పష్టత రాకపోవడం అన్నాడీఎంకేను చికాకు పెడుతోంది. అయితే వాటివల్ల తమకు పెద్దగా సమస్య ఉండకపోవచ్చని బుధవారం సాయంత్రం లోగా ఆ పార్టీల లెక్క తేలుస్తామని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అందరి కంటే ముందుగా అన్నాడీఎంకే కూటమిలో 23 స్థానాలు సాధించుకున్న పీఎంకే మాత్రం.. భాగస్వామ్య ఒప్పందాన్ని మంగళవారం ఖరారు చేసుకుంది.


డీఎంకేలోనూ రాని స్పష్టత

ఆది నుంచి తాము చెప్పినట్లుగా నడచుకునే కాంగ్రెస్‌, ఎండీఎంకే, డీపీఐ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు సైతం అసెంబ్లీ స్థానాల కేటాయింపుల వద్ద నిక్కచ్చిగా వుండడం డీఎంకేకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ య(ఐయూఎంఎల్‌), మణిదనేయ మక్కల్‌ కట్చి (ఎంఎంకే) పార్టీల సీట్ల సర్దుబాటు మాత్రమే డీఎంకే కూటమిలో పూర్తయింది. ఐయూఎంఎల్‌కు 3, ఎంఎంకే 2 స్థానాలు ఖరారయ్యాయి. మిగిలిన పెద్ద పార్టీలన్నీ బేరసారాలు సాగిస్తూనే వున్నాయి. మంగళవారం ఒక్కరోజే డీఎంకే నేతలైన దురైమురుగన్‌, టీఆర్‌ బాలు, ఎ.రాజా, కనిమొళి తదితరులు కూటమి పార్టీల నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీ తమకు కనీసం 30 స్థానాలు, కన్నియకుమారి నియోజకవర్గం కావాలని డీఎంకేను పట్టుబడుతోంది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, సీనియర్‌ నేత కేఏ రామస్వామి, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి బోపన్న తదితరులు మంగళవారం డీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చి గంటకు పైగా చర్చించి వెళ్లారు. చర్చలు సంతృప్తిగా సాగినట్టు కాంగ్రెస్‌ నేతలు మీడియా ముందు చెప్పినప్పటికీ, వారి ముఖకవళికలు, హావభావాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపించాయి. ఇక కూటమిలోని ఎండీఎంకే సీట్ల సర్దుబాటు కూడా పెండింగ్‌లోనే వుండిపోయింది. డీఎంకే నేతలు నేరుగా ఎండీఎంకే కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ అధినేత వైగోతో సుదీర్ఘంగా చర్చించారు. తమకు కనీసం 10 స్థానాలైనా కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. దాంతో ఆ విషయాన్ని స్టాలిన్‌కు చేరవేస్తామని పేర్కొన్న డీఎంకే నేతలు వెనుదిరిగినట్టు సమాచారం. ఇక డీపీఐ అధినేత తిరుమావళవన్‌తోనూ డీఎంకే నేతలు చర్చించారు. ఆయన కూడా తమకు 7 స్థానాలు కావాలని కోరినట్ట్లు తెలిసింది. ఇక సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం కూడా చర్చలు జరిపారు. కానీ ఆ పార్టీలకు స్థానాల ఖరారుపై ఇంకా పేచీ కొనసాగుతూనే వుంది.

 

తృతీయ కూటమి సంగతేమిటో?

‘మక్కల్‌ నీదిమయ్యం’ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ తృతీయ కూటమికి తాను నేతృత్వం వహిస్తున్నట్ట్లు ప్రకటించినప్పటికీ ఆ కూటమిలో ఉండే పార్టీలేంటన్నది ఇప్పటికే స్పష్టత లేదు. సమత్తువ మక్కల్‌ కట్చి, ఇండియ జననాయగ కట్చి మాత్రం కమల్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఆదివారం రాత్రి ఇండియ జననాయగ కట్చి అధినేత పచ్చముత్తు బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో భేటీ అయినట్లు వస్తున్న వార్తలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఆ పార్టీ ఉపప్రధాన కార్యదర్శి ఎం.రవిబాబు మాత్రం తాము తృతీయ కూటమిలోనే వుంటు న్నామని స్పష్టం చేశారు. తమ కూటమిలో చేరాలని బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినమాట వాస్తవమని, కానీ తాము తృతీయ కూటమికే కట్టుబడి వున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే తృతీయ కూటమిలో ఏ పార్టీలకు ఎన్ని స్థానాలన్నదానిపై ఇప్పటివరకూ అసలు చర్చలే ప్రారంభం కాకపోవడం గమనార్హం.


స్థానాలు సరే, నియోజకవర్గాల సంగతేంటి?

డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ కేవలం ఏ పార్టీకి ఎన్ని స్థానాలన్నదానిపైనే. అయితే ఏఏ పార్టీకి ఏఏ నియోజకవర్గాలన్నదానిపై ఇప్పటి వరకూ కసరత్తు ప్రారంభం కాలేదు. నిజానికి తమకు ఏఏ స్థానాలు కావాలన్నదానిపై ఏ పార్టీకి ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చాయి. కానీ ఒక్కో నియోజకవర్గాన్ని మూడు నాలుగు పార్టీలు కోరుకుంటుండడంతో ఎవరికి కేటాయించాలన్నది ప్రధాన పార్టీలకే పెద్ద సమస్యగా మారింది. ముందు ఎవరికెన్ని స్థానాలో తేలితే, ఆ తరువాత ఏఏ నియోజకవర్గాలన్నది నిర్ణయించుకోవచ్చన్నట్టుగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఎన్నికలకు సమయం తక్కువగా వుండడంతో ఈ వ్యవహారంపై ఏమవుతుందో, ఎవరికి సంతృప్తి మిగులుతుందో, ఎవరిని అసంతృప్తి కుదిపేస్తుందోనన్న ఉత్కంఠతో అన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి. 

Updated Date - 2021-03-03T15:21:47+05:30 IST