Abn logo
Nov 22 2020 @ 00:32AM

బీజేపీ.. బస్తీ మే సవాల్‌!

కారణాలు సహేతుకమా? కాదా? అన్నది పక్కనపెడితే ఇవ్వాళ తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా తనకు గిట్టనివారిపై విషం చిమ్ముతూ పోవడం వల్ల ఫలితం ఉండదు. ఏ పూట ఎవరి అవసరం ఉంటే, ఆ పూట వారిని పిలిపించుకోవడంలో, లేక వారి వద్దకే స్వయంగా వెళ్లి పార్టీలో చేర్చుకోవడంలో సిద్ధహస్తుడైన కేసీఆర్‌ ఆ తర్వాత వారిని పట్టించుకోరు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణలో అందరికీ తెలిసిపోయింది. ఈ కారణంగా గద్దర్‌ లాంటి వాళ్లు కేసీఆర్‌ను ప్రశంసించినా, గోరటి వెంకన్న వంటి వారిని పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టినా ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు బీజేపీపై యుద్ధం చేస్తాననీ, ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమీకరిస్తాననీ చెబుతూ ఉండటం తెలివైన చర్యగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడికి ఏమైందో మరిచిపోతే ఎలా?


ప్రధాని మోదీతో ఢీకొంటున్నవారంతా చతికిలపడుతున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు, వారసత్వ రాజకీయాలు ఉండకూడదన్నది ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆశయం. అనేక ప్రాంతీయ పార్టీలను మోదీ–షా ద్వయం బలహీనపరచగలిగారు. తమ భాగస్వాములుగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా బీజేపీ వదిలిపెట్టడం లేదు. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు పడుతున్న గతే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని మోదీ–షా ద్వయం ఎప్పటి నుంచో తహతహలాడుతోంది. ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్‌ ఎన్నికలలో దుబ్బాక తరహాలో అనూహ్య ఫలితాలు వస్తే తెలంగాణలో అధికారానికి అడుగు దూరంలో బీజేపీ ఉంటుందని చెప్పవచ్చు. ఈ ముప్పును అధిగమించడం ఎలానో ఆలోచించుకోవడం కేసీఆర్‌కు మంచిదే.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారతీయ జనతా పార్టీపై గుస్సా వచ్చింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని, జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను కూడగడతానని ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే నెలలో నాలుగు ప్రాంతీయ పార్టీల నాయకులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళతానని కేసీఆర్‌ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. అడపాదడపా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. జాతీయస్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కొన్ని రోజులు హడావిడి చేశారు. తర్వాత సొంతంగా జాతీయ పార్టీ ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్టు లీకులు ఇచ్చారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కాంక్లేవ్‌ పెడతానని అంటున్నారు. మధ్యమధ్యలో ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ వచ్చిన కేసీఆర్‌కు ఇప్పుడు హఠాత్తుగా ప్రధాని పైన, బీజేపీ పైన కోపం తారస్థాయికి చేరింది. రాష్ట్రంలో తన అధికారానికి బీజేపీ నుంచి సవాల్‌ ఎదురుకావడమే ఇందుకు కారణం కావచ్చు. తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఇంటి పార్టీగా ప్రచారం చేస్తూ, తనకు తన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరిస్తూ వచ్చిన కేసీఆఆర్‌కు ఇప్పుడు మొదటిసారిగా తెలంగాణలో ఎదురుగాలి మొదలైంది. దుబ్బాక ఎన్నికలో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. ఇంటి పార్టీకి నట్టింట పరాభవం ఎదురైంది. ఈ పరిణామాన్ని ఊహించని కేసీఆర్‌ ఇప్పుడు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. గ్రేటర్‌ ఎన్నికలలో కూడా బీజేపీ నుంచి సవాల్‌ ఎదురవుతుండడంతో బీజేపీపై యుద్ధం చేస్తానని ప్రకటించారు. నిజానికి కేసీఆర్‌ స్వయంకృతాపరాధం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహామహులంతా మకాం వేసి చెమటోడ్చినా కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు. దీంతో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. గ్రేటర్‌ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేసీఆర్‌ పాలనను, వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న వారంతా బీజేపీకి జై కొడుతున్నారు. కాంగ్రెస్‌ – బీజేపీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతూ రావడం వల్ల ఇప్పటివరకు కేసీఆర్‌ అధికారానికి తిరుగు లేకుండా ఉంది. దుబ్బాక ఫలితం చూశాక ఆ పరిస్థితి ఇప్పుడు లేదని స్పష్టమవుతోంది. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో స్పష్టత వస్తుంది. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా అమాంతం ఎదగడానికి కూడా కేసీఆర్‌ పరోక్షంగా కారణం. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారడానికి కూడ కేసీఆరే కారణం. అదే సమయంలో హిందువుల్లోను మతభావన పెరిగిపోతున్నది. ఆ భావనకు మరింత బలం చేకూరితే గ్రేటర్‌ ఎన్నికలలో ఫలితాలు అనూహ్యంగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణలో కేసీఆర్‌ ఆధిపత్యానికి బ్రేక్‌ పడినట్లే. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే దాని ప్రభావం గ్రేటర్‌ ఎన్నికలపై పడుతుందని అందరూ భావించారు.


ఇప్పుడు అదే జరుగుతోంది. గ్రేటర్‌లో కూడా బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తే దాని ప్రభావం మొత్తం రాష్ట్రంపై పడుతుంది. కాంగ్రెస్‌ పార్టీ మరింత బలహీనపడుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరిపోవడం ఖాయం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తితో ఉన్నవారు కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తారు. గ్రేటర్‌లో గత ఎన్నికలలో బీజేపీ నాలుగు డివిజన్లనే గెలుచుకుంది. ఈ పర్యాయం 40 డివిజన్లలో ఆ పార్టీ గెలిచే అవకాశం ఉందని కేసీఆర్‌ క్యాంపు నుంచే సమాచారం వస్తున్నది. నిజానికి దుబ్బాక ఫలితం ఒకరకంగా కేసీఆర్‌కు మంచే చేసిందనుకోవచ్చు. కేసీఆర్‌ ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుంది. లోపాలను సరిదిద్దుకుని పార్టీకి దూరమైన వారిని దగ్గర చేసుకోవడానికి కావాల్సినంత వ్యవధి ఉంది. విరుగుడు చర్యలపై దృష్టి సారించాల్సిన కేసీఆర్‌ ఇప్పుడు బీజేపీపై యుద్ధం చేస్తానంటూ కాలుదువ్వుతున్నారు. అధికార బలం, అంగ బలం, అర్థ బలం పుష్కలంగా ఉన్న కేసీఆర్‌లో మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏర్పడింది. ఏరికోరి పార్టీలోకి తెచ్చుకున్న వారిలో పలువురిని దూరం పెట్టారు. అదే సమయంలో బీజేపీ గతానికి భిన్నంగా ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. గ్రేటర్‌ ఎన్నికలే తమ టార్గెట్‌ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏడాది క్రితమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారుగా బీజేపీ ఎదిగింది. దుబ్బాక తరహాలోనే టీఆర్‌ఎస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమకు, మజ్లిస్‌ పార్టీకి పొత్తు లేదని మంత్రి కేటీఆర్‌ పదే పదే ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. గ్రేటర్‌ ఎన్నికల గురించి చర్చించడానికి మంత్రులు, పార్టీ ముఖ్యులతో కేసీఆర్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొనడం గమనార్హం.


బీజేపీకి ఆయుధాలు అందిస్తూ రావడం వల్లనే గ్రేటర్‌ ఎన్నికలలో ఆడుతూ పాడుతూ విజయం సాధించాల్సిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు మంత్రి కేటీఆర్‌ చెబుతున్న అభివృద్ధి ఫలాలు గ్రేటర్‌లో పేదలకు అందడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా సంపన్న వర్గాలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలనే చేపట్టారు. ఈ కారణంగా 2004లో జరిగిన ఎన్నికలలో ఆయన నమ్ముకున్న ప్రాంతాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించలేదు. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ కూడా అదే దారిలో నడుస్తున్నారు. దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన వంటివి అవసరమే కానీ, వాటివల్ల ఓట్లు రావు. అయినా నామినేషన్ల ప్రక్రియ ఇప్పుడే ముగిసింది. కనుక గ్రేటర్‌ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చెప్పలేం. కొన్ని కారణాల వల్ల అధికారంలో ఉన్నవారి పట్ల ప్రజల్లో మొహం మొత్తుతుంది. ఆ కారణాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్నవారు సురక్షితంగా ఉంటారు. కారణాలు సహేతుకమా? కాదా? అన్నది పక్కనపెడితే ఇవ్వాళ తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా తనకు గిట్టనివారిపై విషం చిమ్ముతూ పోవడం వల్ల ఫలితం ఉండదు. ఏ పూట ఎవరి అవసరం ఉంటే, ఆ పూట వారిని పిలిపించుకోవడంలో, లేక వారి వద్దకే స్వయంగా వెళ్లి పార్టీలో చేర్చుకోవడంలో సిద్ధహస్తుడైన కేసీఆర్‌ ఆ తర్వాత వారిని పట్టించుకోరు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణలో అందరికీ తెలిసిపోయింది. ఈ కారణంగా గద్దర్‌ లాంటి వాళ్లు కేసీఆర్‌ను ప్రశంసించినా, గోరటి వెంకన్న వంటి వారిని పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టినా ఫలితం ఉండటం లేదు. కాంగ్రెస్‌ను కోలుకోకుండా దెబ్బతీస్తూ వచ్చిన కేసీఆర్‌, ఇప్పుడు బీజేపీ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు బీజేపీపై యుద్ధం చేస్తాననీ, ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమీకరిస్తాననీ చెబుతూ ఉండటం తెలివైన చర్యగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడికి ఏమైందో మరిచిపోతే ఎలా? ఏడాదిన్నర క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా ఇలాగే బీజేపీపై తొడ కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని దూషించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ ఇంటికెళ్లి మరీ చేతులు కలిపారు. దేశమంతా కాలికి బలపం కట్టుకుని మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, స్టాలిన్‌, కేజ్రీవాల్‌, కుమారస్వామి వంటి ప్రాంతీయ పార్టీల నాయకులతో విడిగా సమావేశమయ్యారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉమ్మడి వేదికలు పంచుకున్నారు. దీంతో బీజేపీ ఆయనపై కక్ష పెంచుకుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి తన వంతు పాత్ర పోషించింది.


నిజానికి ఇవాళ బీజేపీకి, ముఖ్యంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడే ప్రాంతీయ పార్టీల నాయకులు ఎవరంటే ఒక్క మమతా బెనర్జీ మాత్రమే కనిపిస్తోంది. వచ్చే నెల మొదటివారంలో హైదరాబాద్‌లో తాను ఏర్పాటు చేస్తున్న సమావేశానికి మమతా బెనర్జీతో పాటు అఖిలేశ్‌, మాయావతి, స్టాలిన్‌ వస్తారని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. వీరిలో మమతను మినహాయిేస్త మిగతా వారెవ్వరూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడలేరు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్రంలో బీజేపీకే మద్దతిస్తానని డీఎంకే అధినేత స్టాలిన్‌ అవగాహన కుదుర్చుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారిని నమ్ముకుని బీజేపీపై యుద్ధం చేస్తానని కేసీఆర్‌ ప్రకటిస్తున్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు తిరుగులేని శక్తి. ప్రధాని మోదీతో ఢీకొంటున్నవారంతా చతికిలపడుతున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు, వారసత్వ రాజకీయాలు ఉండకూడదన్నది ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆశయం. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతీయ పార్టీలను మోదీ–షా ద్వయం బలహీనపరచగలిగారు. తమ భాగస్వాములుగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా బీజేపీ వదిలిపెట్టడం లేదు. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు పడుతున్న గతే ఇందుకు నిదర్శనం. తనకు ఇటువంటి ప్రమాదం ఎదురవ్వకూడదని కాబోలు మహారాష్ట్రలో శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే బీజేపీతో విభేదించి కాంగ్రెస్‌, ఎన్సీపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లోపంతో రోజురోజుకు బలహీనపడటాన్ని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులలో కేసీఆర్‌ చేసిన ప్రకటన దుస్సాహసమనే చెప్పవచ్చు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని మోదీ–షా ద్వయం ఎప్పటి నుంచో తహతహలాడుతోంది. ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్‌ ఎన్నికలలో దుబ్బాక తరహాలో అనూహ్య ఫలితాలు వస్తే తెలంగాణలో అధికారానికి అడుగు దూరంలో బీజేపీ ఉంటుందని చెప్పవచ్చు. ఈ ముప్పును అధిగమించడం ఎలానో ఆలోచించుకోవడం కేసీఆర్‌కు మంచిదే. ఆయన మాటల్లో చెప్పాలంటే బతికుంటే బలుసాకు తినొచ్చు.


హైకోర్టు చెప్పిందీ అదే!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వద్దాం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ శుక్రవారం రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత రాజధానిని తరలించాలనుకోవడం మతిలేని చర్య కాదా? అమరావతిలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నదని, క్రిమినల్స్‌ రాజకీయాల్లోకి రాకుండా నిరోధించే చట్టం ఉండాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ తన వ్యక్తిగత వ్యాఖ్యలు అని ఆయన అన్నారు. విచారణకు వచ్చిన కేసుతో సంబంధం లేకపోయినా, జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సమర్థనీయమా? కాదా? అన్న విషయం పక్కనపెట్టి ఆయన అలా వ్యాఖ్యానించడం వెనుక ఉన్న నేపథ్యం చూద్దాం. డిసెంబర్‌ 31వ తేదీన జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ పదవీ విరమణ చేస్తున్నారు. రెండు మూడు నెలల్లో పదవీ విరమణ చేసే న్యాయమూర్తులు అంత క్రియశీలకంగా ఉండరు. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ మనస్తత్వం విభిన్నమైంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అధికారుల ప్రవర్తన పట్ల ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ, దురుద్దేశాలు ఆపాదిస్తున్నవారు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ నేపథ్యం గురించి తెలుసుకోవాలి. జగన్‌ ప్రభుత్వం ద్వేషించే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన. బిహార్‌కు చెందిన ఆయన అమరావతికి బదిలీపై వచ్చే ముందు హైకోర్టులో పనిచేస్తున్న 10 మంది సహచర న్యాయమూర్తులపై విచారణకు ఆదేశించారు. అదీ ఆయన నిబద్ధత! పట్నా హైకోర్టులో పని చేసినప్పుడు ఆ రాష్ట్ర డీజీపీ ఒక సందర్భంలో మాట్లాడుతూ, తాము అరెస్ట్‌ చేసి చేతులకు బేడీలు వేయాల్సిన నేరస్థులు అధికారంలో ఉండటం వల్ల సెల్యూట్‌ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారట. అమరావతికి వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎలాంటివారో తెలుసుకునే ప్రయత్నం చేయగా, ప్రజలు చైతన్యవంతులని చెప్పారట. అమరావతికి వచ్చిన తర్వాత ఇదేమిటి? రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలుకాకపోయినా ప్రజలు ఇంత స్తబ్ధుగా ఎందుకు ఉంటున్నారని ఆయన సహచరుల వద్ద విస్మయం వ్యక్తంచేశారట. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేస్తున్నందున జగన్‌ ప్రభుత్వాన్ని అకారణంగా తప్పుపడితే జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌కు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. నీలి బ్యాచ్‌ నిందిస్తున్నట్లుగా ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సంబంధాలు లేవు. ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదు.


పదవీ విరమణ తర్వాత బిహార్‌ వెళ్లిపోతారు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై రాగద్వేషాలు ఉండే అవకాశం లేదు. ‘‘బిహార్‌లో కనీసం అధికారులైనా చట్టానికి లోబడి పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు అది కూడా చేయడం లేదు’’ అని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారట. ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు సైతం చట్టాలకు, రాజ్యాంగానికి లోబడి ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా ఈ మధ్యనే స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా ఇదే చెబుతోంది. అయినా ఒక రాజకీయ పార్టీ బ్రాంచ్‌ ఆఫీస్‌గా హైకోర్టు పనిచేస్తోందని అధికార పార్టీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలకు చట్టసభలలో ఎంత మెజార్టీ ఉన్నప్పటికీ చట్టాలు, రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలని జగన్‌రెడ్డి సొంత పత్రిక ఆ మధ్య వ్యాఖ్యానించింది. కేశవానందభారతి మృతి చెందినప్పుడు రాసిన సంపాదకీయంలో ఇందీరాగాంధీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం రద్దు చేయడాన్ని గుర్తు చేస్తూ జగన్‌ పత్రిక ఆ వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా పదే పదే ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నది. అంటే ప్రజలు మాకు అధికారం ఇస్తే మమ్మల్ని పాలించకుండా హైకోర్టు నిలవరిస్తోందని నిందలు వేయడంలో ఔచిత్యం లేనట్లే కదా? ఎన్నికల కమిషనర్‌కు, రాష్ట్రప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంపై స్పందించిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కూడా ఈసారి ప్రభుత్వానికి అక్షింతలు మాత్రమే కాదు అంతకుమించి శిక్ష పడొచ్చని వ్యాఖ్యానించారు. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణి అధికార పార్టీలో కనిపిస్తోంది. ఒకరిద్దరు మంత్రులైతే నోటికి హద్దు, అదుపు లేకుండా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై దాడికి తెగబడుతున్నారు. అధికార పార్టీకి చెందిన వారు అరాచకాలకు పాల్పడుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇప్పటివరకు ఒక్కరిని కూడా మందలించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించలేదు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ఆ పదవిలో ఉన్నంతవరకూ స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వ పెద్దలు భీష్మించుకుని కూర్చున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సైతం ఈ పెడధోరణులకు అనుగుణంగానే వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉంది. డిసెంబర్‌ 31వ తేదీతో ఆమె పదవీకాలం కూడా ముగుస్తుంది. స్వామి భక్తి చాటుకున్నందుకు పదవీ విరమణ తర్వాత కూడా ఆమెకు ముఖ్యమంత్రి ఏదో ఒక పదవి ఇవ్వవచ్చు. ఏదో ఆశించి విధి నిర్వహణలో వెన్నెముక లేకుండా న్యాయస్థానమంటే కూడా వెరపు లేకుండా వ్యవహరించే నీలం సాహ్ని వంటి వారు ఏ పదవిలో ఉంటే మాత్రం ఏంటి? అధికారులకు న్యాయస్థానాలంటే కూడా భయం లేకుండా పోవడంపై న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు. ఈ క్రమంలోనే జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తనలో గూడు కట్టుకున్న ఆవేదనను శుక్రవారం వ్యక్తంచేశారు. ఆయన ధర్మాగ్రహంలో హేతుబద్ధత ఉందా లేదా? అన్నది మాత్రమే మనం చూడాలి. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తెలుగువాడు కాకపోవడంతో పాటు మరో నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు కనుక ఆయనకు తాటాకులు కట్టడానికి నీలి బ్యాచ్‌ వెనకడుగు వేస్తుండవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న చట్టవ్యతిరేక చర్యల పట్ల బిహార్‌కు చెందిన రాకేష్‌ కుమార్‌ ఇంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రజలు, మరీ ముఖ్యంగా అధికారులు గ్రహించగలిగితే ఆయన పడుతున్న ఆవేదనకు సార్థకత లభిస్తుంది. లేని పక్షంలో ప్రజలే ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపం చెందుతారు!

ఆర్కే

Advertisement
Advertisement
Advertisement