త్రిపుర ప్రభుత్వ ప్రకటనలో కోల్‌కతా ఫ్లైఓవర్.. బీజేపీపై తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2021-12-11T23:05:15+05:30 IST

ఈ విషయమై తృణమూల్ నేత సుబాల్ భోంవిక్ మాట్లాడుతూ ‘‘కోల్‌కతా నుంచి ఫ్లైఓవర్‌ను ఎత్తుకొచ్చి త్రిపురలో ప్రకటనలకు వాడుకుంటున్నారు. త్రిపురలోని బీజేపీ ప్రభుత్వ ఏహ్యకరమైన చర్యలకు ఇదొక నిదర్శనం..

త్రిపుర ప్రభుత్వ ప్రకటనలో కోల్‌కతా ఫ్లైఓవర్.. బీజేపీపై తీవ్ర విమర్శలు

అగర్తలా: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్లపై రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించింది త్రిపుర ప్రభుత్వం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలతో పంచుకుంది. అయితే ఇందుకు ఉపయోగించిన ఒక ఫ్లైఓవర్ ఫొటో కారణంగా అధికార భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శల పాలవుతోంది. కోల్‌కతాలోని సీల్దా ఫ్లైఓవర్ ఫొటోను వాడుకున్నారంటూ విప్లవ్ దేవ్ ప్రభుత్వంపై, బీజేపీపై అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్) తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇతర పార్టీ ప్రభుత్వాలు చేసిన పనులను బీజేపీ ప్రభుత్వాలు అద్దెకు తీసుకుని ప్రకటనలు చేసుకుంటున్నాయని ఎద్దేవా చేస్తున్నారు.


ఈ విషయమై తృణమూల్ నేత సుబాల్ భోంవిక్ మాట్లాడుతూ ‘‘కోల్‌కతా నుంచి ఫ్లైఓవర్‌ను ఎత్తుకొచ్చి త్రిపురలో ప్రకటనలకు వాడుకుంటున్నారు. త్రిపురలోని బీజేపీ ప్రభుత్వ ఏహ్యకరమైన చర్యలకు ఇదొక నిదర్శనం. విప్లవ్ దేవ్ ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఏమైనా పనులు చేసుంటే బాగుండేది. బీజేపీ అభివృద్ధి పనులు చేయది కాబట్టే ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న చోట నుంచి ఇలా వాడుకుంటున్నారు. టీఎంసీ అభివృద్ధిలో ముందు ఉంటుంది. అందుకే నిన్న యోగి, ఈరోజు విప్లవ్ దేవ్ ప్రభుత్వాలు కోల్‌కతాలో జరిగిన అభివృద్ధిని తమవిగా చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి’’ అని అన్నారు.


ఇక సీపీఎం నేత చక్రవర్తి మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్త కాంపిటీషన్‌కు సంబంధించిన ట్వీట్ అది. కానీ అది బీజేపీ అధికారంలో ఉన్న త్రిపురలో ఎక్కడా లేదు. త్రిపురలో తమ అభివృద్ధి చూపించుకోవడానికి బీజేపీ చేసింది ఏమీ లేదు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి అభివృద్ధిని అద్దెకు తెచ్చుకుంటున్నారు’’ అని అన్నారు.

Updated Date - 2021-12-11T23:05:15+05:30 IST