కమలనాథుల్లో.. కలవరం..

ABN , First Publish Date - 2021-09-15T21:21:18+05:30 IST

కమలనాథులు దిద్దుబాటు చర్యలకు దిగారా? ఈనెల 17న నిర్మల్ సభకు అమిత్‌షా అందుకే హాజరవుతున్నారా? విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన ఏం చెప్పబోతున్నారు? నిరుత్సాహంలో ఉన్న బీజేపీ

కమలనాథుల్లో.. కలవరం..

బీజేపీ దూకుడుకు కేసీఆర్ కళ్లెం...

కార్యకర్తలో ఉత్సాహం నింపడానికి బీజేపీ దిద్దుబాటు చర్యలు 

బీజేపీ, టీఆర్ఎస్ వేర్వేరనే సంకేతం పంపడమే లక్ష్యం

ఇందులో భాగంగానే అమిషా.. నిర్మల్ భారీ బహిరంగ సభ..!


కమలనాథులు దిద్దుబాటు చర్యలకు దిగారా? ఈనెల 17న నిర్మల్ సభకు అమిత్‌షా అందుకే హాజరవుతున్నారా? విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన ఏం చెప్పబోతున్నారు? నిరుత్సాహంలో ఉన్న బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి కాషాయ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసిందా? అమిత్ షా సభ తర్వాత టీఆర్ఎస్‌తో బీజేపీ రాజకీయ వైరం‌ మరింత ముదురుతుందా? హుజురాబాద్ ఉపఎన్నిక కాక పెరగనుందా?.. ఈ అంశంపై ఇవాల్టి.. ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడర్‌ స్టోరీ..


కేసీఆర్ ఢిల్లీ పర్యటన అందుకేనా..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ.. ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్రతో మంచి ఊపు మీదుంది. ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడుకు సీఎం  కేసీఆర్.. కళ్లెం వేశారన్న చర్చ తెలంగాణలో జోరందుకుంది. వారానికి పైగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం కేసీఆర్.. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. దీంతో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. బీజేపీ, టీఆర్ఎస్‌లు వేర్వేరు కాదు.. ఒక్కటేనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగిందన్న చర్చ జోరందుకుంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనెల 17న నిర్మల్‌లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అమిత్‌షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.


కాషాయ దళం కసరత్తు..

ముఖ్యంగా బీజేపీ కింది స్థాయి నేతలు, క్యాడర్‌లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే విధంగా అమిత్‌షా ప్రసంగం ఉంటోందని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన.. తెలంగాణ బీజేపీ వర్గాలను నిరుత్సాహానికి గురిచేసిన నేపథ్యంలో.. అమిత్‌షా నిర్మల్‌లో నిర్వహించే బహిరంగ సభలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కమలనాథులు చెబుతున్నారు. టీఆర్ఎస్‌తో బీజేపీకి ఎలాంటి దోస్తీ లేదనీ, తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బలమైన ప్రత్యర్థిగానే కమలం పార్టీ పోరాటం చేస్తోందనీ కాషాయదళం అంటోంది.‌ ఇదే మెసేజ్‌ను అమిత్ షా ద్వారా ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి పంపాలనుకుంటున్నట్లు కమలనాథులు బలంగా భావిస్తున్నారట.


కేసీఆర్ వల్లే ఎన్నిక వాయిదా..!

నిజానికి టీఆర్ఎస్, బీజేపీకి మధ్య రాజకీయంగా హోరాహోరీ నడుస్తోన్న సమయంలో.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తెలంగాణ ప్రజల్లో పలు అనుమానాలను రేకెత్తించింది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ వరుసగా భేటీలు కావడం, హుజురాబాద్ ఉపఎన్నిక అనూహ్యంగా వాయిదా పడటం వంటి పరిణామాలు ఒకేసారి జరిగాయి. దీంతో ఈ అంశం బీజేపీకి శాపంగా మారింది. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్‌కు రాజకీయంగా లాభించే అంశం. ఈ విషయంగానే ప్రస్తుతం తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది. ‌ కేసీఆర్ ఒత్తిడి మేరకే హుజురాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్‌ వెలువడలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


కేంద్ర పెద్దలపై రాష్ట్ర నేతల అలక..

నిజానికి రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌తో తెలంగాణ బీజేపీ గట్టిగా పోరాడుతోంది. అయితే ఢిల్లీలో బీజేపీ నేతలు కేసీఆర్‌తో స్నేహంగా ఉండటం, రాష్ట్ర పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసించడం వంటివి తెలంగాణ కమలనాథులకు మింగుడు పడటం లేదు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా కూడా ప్రగతిభవన్‌కు వెళ్లి.. సీఎం కేసీఆర్‌తో కలిసి భోజనం చేయడాన్ని సైతం కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు.


టీఆర్ఎస్‌తో దోస్తీ లేదని చెప్పేందుకే..

ఒకవైపు అధికార టీఆర్ఎస్‌తో కొట్లాడి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, ప్రజల్లోకి స్పష్టమైన సందేశాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు పంపిస్తున్నారు. మరోవైపు అదే పార్టీకి చెందిన కొందరు నేతలు సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీలు కావడం తమ పోరాటాన్ని నీరుగారుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర నేతలు బలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఇందుకోసం గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా కేసీఆర్‌‌తో జరిగిన సమావేశాలను ప్రస్తావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్‌తో బీజేపీకి దోస్తీ లేదని చెప్పేందుకు కేంద్రంలోని పెద్దలు ప్రయత్నం చేస్తున్నారట. ఇందులో భాగంగా ఈనెల 17న నిర్మల్‌లో అమిత్‌ షా పర్యటన సందర్భంగా టీఆర్ఎస్‌పై ఘాటుగానే విరుచుకుపడే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


అమిషా సభపైనే అందరి దృష్టి..

మొత్తంమీద కమలం పార్టీ  దిద్దుబాటు చర్యలకు దిగింది. ఢిల్లీలో కేసీఆర్ తాజా పర్యటనతో బీజేపీకి రాష్ట్రంలో జరిగిన డ్యామేజీని కవర్ చేసుకునే విధంగా అమిత్ షా నిర్మల్ పర్యటన ‘డ్యామేజ్ కంట్రోల్’ తీరులో ఉంటుందనే ధీమాను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్‌లో అమిత్‌ షా సభ ముగిసిన తర్వాత.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. మరి నిర్మల్‌ సభ ద్వారా అమిత్‌ షా తెలంగాణ సమాజానికి ఏం చెబుతారో, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Updated Date - 2021-09-15T21:21:18+05:30 IST