సైద్ధాంతిక రేఖ దాటని బీజేపీ!

ABN , First Publish Date - 2020-08-12T07:41:19+05:30 IST

‘దక్షిణాదిన బిజెపి బలపడాలంటే మీలాంటి వారు మా పార్టీలో చేరాలి. మీకు తగిన ప్రాధాన్యత నిస్తాం’ అని లాల్ కృష్ణ ఆడ్వాణీ 1993లో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరితో అన్నారు. ఆ నాయకుడు...

సైద్ధాంతిక రేఖ దాటని బీజేపీ!

దేశం అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రస్తుత సమయంలో బిజెపి పూర్తిగా కేంద్రీకృత పార్టీగా మారితే ఎలా? పార్టీలో బాధ్యతలు అప్పజెప్పడానికి, పదవులు కేటాయించడానికీ కేవలం సంఘ్ నేపథ్యాన్నీ, భావజాలాన్నీ ప్రాతిపదికగా తీసుకుంటే ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఏర్పడే అవకాశాలు లేవు. వివిధ వర్గాల్లో విస్తరించేందుకు బిజెపి ప్రయత్నాలు చేయకపోవడంలో ఔచిత్యం కనపడడం లేదు. ఇది అభద్రతా భావమా, లేక భావజాల పరిమితులా  అన్న విషయాన్ని ఆ పార్టీ తేల్చుకోవల్సి ఉన్నది.


‘దక్షిణాదిన బిజెపి బలపడాలంటే మీలాంటి వారు మా పార్టీలో చేరాలి. మీకు తగిన ప్రాధాన్యత నిస్తాం’ అని లాల్ కృష్ణ ఆడ్వాణీ 1993లో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరితో అన్నారు. ఆ నాయకుడు తర్వాత అటల్ బిహారీ వాజపేయిని కూడా కలుసుకుని బిజెపిలో చేరే విషయంపై ఆయన సలహా అడిగారు. ‘మా వాళ్లు ఇతరులను రానీయరు. వచ్చినా గౌరవించరు. అందువల్ల నీవు వచ్చి మా పార్టీలో ఇమడగలవన్న నమ్మకం నాకు లేదు’ అని వాజపేయి ఆయనతో అన్నారు. వాజపేయి మాట వినకుండా ఆ నాయకుడు బిజెపిలో చేరారు. కాని వాజపేయి అన్నట్లు అక్కడ ఇమడలేకపోయారు. బిజెపితో తన సాహచర్యం అసహజంగానూ, అవకాశవాదంగాను ఆయనకు అనిపించింది. మళ్లీ ఆయన 1994లో వాజపేయిని కలుసుకున్నారు. ‘నేను నీకు ముందే చెప్పాను. ఇందులో నువ్వు ఇమడలేవని. నెమ్మదిగా సమావేశాలకు రావడం విరమించుకుని స్వతంత్ర రాజకీయాలు కొనసాగిస్తూ వెళ్లు’ అని వాజపేయి ఆయనకు చెప్పారు. ఈ విషయాలన్నీ ఆ నాయకుడే తన పుస్తకంలో రాసుకున్నారు.


1994కూ ఇప్పటికీ రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు వచ్చాయి. బిజెపి అత్యధిక మెజారిటీతో రెండు సార్లు అధికారంలోకి వచ్చి తనకు తిరుగులేదని భావిస్తున్న రోజులు ఇవి. కాని బిజెపిలో ఇప్పుడు ఏ పార్టీ వారు వచ్చి చేరినా ఇమడగలిగే పరిస్థితి ఉన్నదా? అప్పటికీ ఇప్పటికీ బిజెపిలో ఏమైనా మార్పులు వచ్చాయా? సమాజంలో వచ్చిన మార్పులను గ్రహించి, అనేక ఇతరేతర శక్తులను తనలో చేర్చుకుని వారిని కలుపుకుపోయే వాతావరణం బిజెపి ఏమైనా కల్పించిందా? ఇవాళ దేశంలో ప్రతిపక్షాల స్థానం బాగా క్షీణించింది. అనేక పార్టీల్లో సంక్షోభం తలెత్తినప్పుడల్లా ఆయా పార్టీల నేతలు ఏమి చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. వివిధ రంగాల్లో ఉన్న మేధావుల్లో మాత్రమే కాదు, అనేక వర్గాల ఆలోచనా సరళిలో పెద్ద ఎత్తున మార్పు వస్తోంది. గతాన్ని ప్రశ్నించడమే కాదు, భవిష్యత్ కూడా ప్రశ్నార్థకమైన స్థితి ఏర్పడింది. కాని ఈ మార్పులను ఇముడ్చుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పార్టీగా ఒక కొత్త రూపురేఖలతో ఏర్పడగలిగిన శక్తి బిజెపికి ఉన్నదా? అన్నది చర్చనీయాంశం.


నిజానికి గతంతో పోలిస్తే చాలామంది ఇతర పార్టీలకు చెందిన నేతలు భారతీయ జనతా పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. ఇదొక గత్యంతరం లేని పరిస్థితి మాత్రమే కాని బిజెపి ఘనత ఎంత మాత్రమూ కాదు. బిజెపికి కూడా తాను విస్తరిస్తున్నానన్న అభిప్రాయం కల్పించడం అవసరం కనుక అనేకమందిని చేర్చుకుని కాషాయ కండువా కప్పడంతోనే సరిపోతోంది. కొంతమందిని తాత్కాలిక అవసరం కోసం చేర్చుకోవడం తప్పని సరి అవుతోంది. కాని ఇలా చేరిన వారందరికీ బిజెపి ఇస్తున్న భరోసా ఏమిటి? తన ప్రధాన స్రవంతిలో వారికి భాగస్వామ్యం కల్పించగలుగుతోందా అన్నది చర్చనీయాంశం. బిజెపిలో చేరిన ఇతర పార్టీల వారిలో చాలా మంది ఇప్పటికీ తాము ఆ పార్టీలో ఇమడలేకుండా ఉన్నామని, తమను పరాయివారిగానే పరిగణిస్తున్నారని భావించేవారున్నారు. ఇది వారి ఆలోచనా ధోరణిలో ఉన్న లోపమా లేక వారిని ఇముడ్చుకోలేని బిజెపి మౌలిక స్వరూపంలో ఉన్న లోపమా అన్న విషయం పై ఆ పార్టీలో అంతర్గత చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది.


నిజానికి బిజెపిలో ఉన్న చాలామంది వెనుకటి తరం వారే బిజెపి ప్రస్తుత నాయకత్వంతో ఇముడలేకపోతున్నారని, ఒకప్పుడు అశోకా రోడ్ లోని బిజెపి ఆఫీసుకు స్వేచ్ఛగా వెళ్లగలిగిన పార్టీ నేతలే ఇప్పుడు అధునాతనంగా ఉన్న దీనదయాళ్ రోడ్లోని కార్యాలయానికి వెళ్లి ఇది తమ స్వంత పార్టీ అనుకోలేకపోతున్నారని, ఈ పరిస్థితుల్లో తామెక్కడ ఇమడగలమని ప్రశ్నించే ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా లేకపోలేదు. బిజెపిలో ఆడ్వాణీ ఆలోచనా విధానానికీ, మోదీ ఆలోచనా విధానానికీ తేడా ఉన్నదంటే, సీనియర్లను మోదీ క్రమంగా వదుల్చుకున్నారంటే– దాన్ని తరాల మధ్య అంతరంగానో, ఆధిపత్య ధోరణిగానో భావించవచ్చు కాని ఇతర పార్టీల నేతలను బిజెపి ఎందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతున్నది?


గడచిన కొద్ది నెలల్లో బిజెపి తన సైద్ధాంతిక ఎజెండాకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. దాని ద్వారా బిజెపికి ఒక హిందూత్వ పార్టీగా ముద్ర పడిందన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. బిజెపిలో చేరాలనుకున్న ఇతర పార్టీల నేతలకు ఆ విషయంలో పెద్దగా అభ్యంతరం కూడా లేదు. బిజెపిలో చేరిన ఒక పార్టీ ఎంపి ఫోన్ చేయగానే జై శ్రీరామ్ అని పలకరిస్తున్నారు. ‘నన్ను ఒక ఉదయాన్నే ఒక మంత్రి ఇంటికి రమ్మన్నారు. అక్కడకు వెళ్లగానే పూజ జరుగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఒక పెద్దాయన ప్రసంగించారు. నాకు ఈ వాతావరణం కొత్త. అయినా స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాను’ అని ఆయన చెప్పారు. బిజెపిలో చేరిన వారు ఇలాంటి పరిస్థితులతో సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంత మాత్రాన బిజెపి వారిని మానసికంగా దగ్గరికి చేర్చుకోవడం అంత సులభంగా జరగడం లేదు. బిజెపిలో చేరిన నేతలు తాము ఏమి చేయాలో, ఎలా వ్యవహరించాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే సమయంలో వారు తమ అవసరాలకోసమే బిజెపిలో చేరారు కనుక వారు అలా పడి ఉంటారని, తాము చెప్పిన పనిచేస్తారని బిజెపి నాయకత్వం అనుకుంటున్నట్లు కనపడుతున్నది. బిజెపి తన సైద్ధాంతిక ప్రతిబంధకాల వల్లే ఇలా వ్యవహరిస్తోందా?


రాజకీయాల్లో అన్ని పార్టీలు వ్యవహరించినట్లు బిజెపి కూడా తాను బలంగా లేని చోట్ల ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం, ప్రభుత్వాలు పడగొట్టేందుకు ఇతర పార్టీలకు ఎర వేయడం చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో ఒకప్పుడు ప్రబల శక్తిగా ఉన్న మాయావతి కూడా బిజెపి అండతో ముఖ్యమంత్రి అయి, ఆ తర్వాత గద్దె దిగిన వారే. బిహార్లో నితీశ్ కుమార్‌కు మద్దతునీయడం, వివిధ ప్రాంతీయ పార్టీలతో ఆయా సందర్భాల్లో పొత్తులు ఏర్పరచుకోవడం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు ఎరవేయడం, తన బలం ఏ మాత్రం లేని ఈశాన్యంలో హేమంత బిశ్వాస్ లాంటి కాంగ్రెస్ నేతలను లాగి అధికారంలోకి రావడం కూడా బిజెపి రాజకీయ అవసరమే. కొన్ని చిన్నా చితక పార్టీలు ఆ పార్టీతో అంటకాగడం తప్పని పరిస్థితుల్లో ఉన్నాయి. అయినా అవసరార్థ రాజకీయాలు ఎన్ని చేసినా బిజెపి ఒక మూస నుంచి బయటపడలేకపోతున్నదని, ఒక పారదర్శకమైన ప్రజాస్వామ్య పార్టీగా అభివృద్ధి చెందలేకపోతున్నదని విమర్శించేవారున్నారు.


కేవలం సైద్ధాంతిక పార్టీగా ముద్రపడడం వల్లనే బిజెపి ఒక రాజకీయ పార్టీగా విస్తరించగలదా అన్నది చర్చనీయాంశం. బిజెపి రామజన్మభూమి ఉద్యమం నడిపిన అయోధ్యలోనే ఆ పార్టీ ఓడిపోయిన సందర్భాలు లేకపోలేదు. సంఘ్ పరివార్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్లోనే కాంగ్రెస్ గెలిచిన ఉదంతాలు ఉన్నాయి. బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత ఉత్తరప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలు జరిపించినప్పుడు మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. ఇవాళ దేశంలో అనేక సమస్యలు చుట్టుముట్టిన సమయంలో బిజెపి పూర్తిగా ఎజెండా కేంద్రీకృత పార్టీగా మారితే, ఇతర పార్టీలనుంచి వచ్చిన వారిని స్వీకరించలేని పరిస్థితి ఏర్పడితే, కేవలం సంఘ్ నేపథ్యాన్నీ, భావజాలాన్నీ పార్టీలో బాధ్యతలు అప్పజెప్పడానికి, పదవులు కేటాయించడానికీ ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు లేవు. ఇవాళ ఢిల్లీలో పదవులు పొందడానికి, పనులు జరగడానికి ప్రాతిపదిక సంఘ్ నేపథ్యమో, గుజరాత్ నేపథ్యమో, లేక వ్యక్తిగత విధేయతో కావడం విచిత్ర పరిస్థితులను ఏర్పరుస్తోంది. ప్రతి మంత్రిత్వ శాఖలో నిర్ణయాలు, నియామకాలు ఇదే ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం బిజెపి నాయకత్వం కరడు గట్టిన భావజాలంతో వ్యవహరించడం వల్ల విమర్శకులకూ, ప్రత్యర్థులకూ తేడా చూడలేకపోతున్నది. ఇద్దర్నీ ఒక గాటన కట్టడమే కాక, తటస్థంగా ఆలోచించేవారిని అనుమానిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇతర వర్గాలనుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేసినా మళ్లీ వారిని తొలగించి తమ వారిని నియమించేంతవరకూ సంతృప్తి చెందడం లేదు. భారీ ఎత్తున మెజారిటీ వచ్చిన తర్వాత కూడా బిజెపి అవసరం లేని మడి గట్టుకోవడం, వివిధ వర్గాల్లో విస్తరించే ప్రయత్నాలు చేయకపోవడంలో ఔచిత్యం కనపడడం లేదు. ఇది అభద్రతా భావమా, లేక భావజాల పరిమితులా అన్న విషయాన్ని ఆ పార్టీ తేల్చుకోవల్సి ఉన్నది.


ఈ రకమైన ధోరణి బిజెపికి ఏమైనా తోడ్పడుతుందా? తమిళనాడులో లుకలుకలు సృష్టించి బలహీనమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నా అక్కడ బిజెపి దుర్బల స్థితిలోనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు గట్టిగా ప్రయత్నించిన బిజెపి ఇవాళ రాష్ట్రంలో స్వంతంగా ఒక కార్పొరేటర్ సీటును గెలుచుకుంటుందా అన్నది అనుమానమే. తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందనడానికి దాఖలాలు లేవు. ఈ మూడు రాష్ట్రాల్లోనే కాదు, కేరళలో కూడా బిజెపి భావోద్వేగాలు పనిచేసే అవకాశాలు లేవు. కర్ణాటకలో 77ఏళ్ల యడ్యూరప్ప మూలంగానే అక్కడ అధికారంలో ఉన్నది. ఒడిషా, ఢిల్లీలలో బిజెపి అధికారంలోకి రావడానికి పలు సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఇవాళ బిజెపి ఎజెండాలో ఉన్న అన్ని అస్త్రాలను దాదాపు ప్రయోగించిన తర్వాత కూడా ఆ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు అంతగా లేవు. రాజస్థాన్లో సచిన్ పైలట్ తన స్వంత గూటికి వచ్చేందుకు సిద్ధపడడం విస్మరించదగిన పరిణామం కాదు. ప్రచారాలు, ఆర్భాటాలు, ఉద్వేగాలు, బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు ఎల్లకాలమూ తోడ్పడవు. ప్రవాహం ఆగిపోయిన చోట నీరు కుళ్లిపోతుంది. బిజెపి తన ప్రవాహ శీలతను దెబ్బతినకుండా చూసుకోవడం దాని అవసరం.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-08-12T07:41:19+05:30 IST