యూపీ బ్రాహ్మణులను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ యత్నాలు

ABN , First Publish Date - 2021-12-26T23:27:37+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో

యూపీ బ్రాహ్మణులను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ యత్నాలు

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో బ్రాహ్మణులను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బ్రాహ్మణులకు చేరువయ్యేందుకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వీరు రాష్ట్రంలోని 403 శాసన సభ నియోజకవర్గాల్లో పర్యటించి, బ్రాహ్మణులను పార్టీవైపు ఆకర్షించేందుకు కృషి చేస్తారు. 


రాజ్యసభ చీఫ్ విప్ శివ ప్రతాప్ శుక్లా, బీజేపీ నేత అభిజాత్ మిశ్రా, బీజేపీ నేతలు రామ్ భాయ్ మొకరియా, డాక్టర్ మహేశ్ శర్మ ఈ కమిటీలో సభ్యులు. కాగా, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కూడా బ్రాహ్మణులను మచ్చిక చేసుకునే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా లఖింపూర్ ఖేరీ ఘటనలో నిందితుడనే విషయం తెలిసిందే. 


ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఈ కమిటీని నియమించారు. ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ, మంత్రులు అనిల్ శర్మ, జితిన్ ప్రసాద, బ్రజేష్ పాఠక్, రీటా బహుగుణ జోషీ, సునీల్ భరాలా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


ఉత్తర ప్రదేశ్ ఓటర్లలో దాదాపు 17 శాతం మంది బ్రాహ్మణులు ఉన్నారు. కాబట్టి వీరి సంక్షేమం కోసం తాము అవిశ్రాంతంగా కృషి చేశామని చెప్పేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్, పరశురామ్ తీర్థాలు, ధామాల అభివృద్ధి  వంటివాటిని ప్రస్తావించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


ఇదిలావుండగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం బ్రాహ్మణులకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. 


Updated Date - 2021-12-26T23:27:37+05:30 IST