గోషామహల్‌ బీజేపీలో రచ్చ.. రాజాసింగ్‌ రాజీనామా ప్రచారం!

ABN , First Publish Date - 2020-11-22T12:50:08+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసినా బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఆశావహులు అందరూ నామినేషన్లు అయితే వేశారు. వారిలో అధికారికంగా ఆమోదం లభించేది ఎవరికి అనేది తేలాల్సి ఉంది. గోషామహల్‌ నియోజవర్గంలో దీనిపై రచ్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గోషామహల్‌ బీజేపీలో రచ్చ.. రాజాసింగ్‌ రాజీనామా ప్రచారం!

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసినా బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఆశావహులు అందరూ నామినేషన్లు అయితే వేశారు. వారిలో అధికారికంగా ఆమోదం లభించేది ఎవరికి అనేది తేలాల్సి ఉంది. గోషామహల్‌ నియోజవర్గంలో దీనిపై రచ్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తనను నమ్ముకున్న వారికే టికెట్లు ఖరారు చేయాలని స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌ పట్టుబట్టగా అందుకు అధిష్ఠానం నుంచి సరైన స్పందన లేదని ప్రచారం జరుగుతోంది. ఒక దశలో రాజాసింగ్‌ రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఆ వార్తలను రాజాసింగ్‌ ఖండించినా సీట్ల విషయంలో అగ్ర నేతలకు, రాజాసింగ్‌కు మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది. గోషామహల్‌ డివిజన్‌ను డాక్టర్‌ లక్ష్మణ్‌కు దగ్గరి బంధువుకు కేటాయిస్తున్నారని ప్రచారం జరగడంతో జాంబాగ్‌, గోషామహల్‌ నాయకులు లక్ష్మణ్‌ను అడిగారు.


తన ప్రమేయం లేదని ఆయన చెప్పగా, తమను కాదని వేరే వారికి టికెట్‌ కేటాయిస్తే సహకరించబోమని స్థానిక నేతలు చెప్పినట్లు తెలిసింది. మంగళ్‌హాట్‌, జాంబాగ్‌ టికెట్లు రాజాసింగ్‌ కోరిన వారికే కేటాయించడంతో గోషామహల్‌, గన్‌ఫౌండ్రీ, బేగంబజార్‌ డివిజన్ల టికెట్లు లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి ఇతర అభ్యర్థులకు ఇవ్వాలని చూస్తున్నారని, ప్రతిపాదనలను ఎమ్మెల్యే వ్యతిరేకిస్తుండడంతో వివాదాలు మొదలైనట్లు పార్టీ కార్యకర్తలు చెప్పుకొంటున్నారు. గన్‌ఫౌండ్రీ నుంచి శైలేందర్‌ యాదవ్‌కు టికెట్‌ కేటాయించాలని, గోషామహల్‌లో వైకుంఠం మినహా ఎవరికి ఇచ్చినా పర్వాలేదని రాజాసింగ్‌ చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం మాత్రం గోషామహల్‌లో వైకుంఠం లేదా పురుషోత్తంకు, గన్‌ఫౌండ్రీలో ఓంప్రకాష్‌ భీష్వ లేదా మధుగౌడ్‌లకు, బేగంబజార్‌లో శంకర్‌ యాదవ్‌ లేదా గణేష్‌ యాదవ్‌లకు కేటాయించే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానంతో రాజాసింగ్‌ ఢీ కొడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-11-22T12:50:08+05:30 IST