రాజ్యాంగానికి వెన్నుపోటు

ABN , First Publish Date - 2020-09-21T07:15:06+05:30 IST

రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను కేంద్రం ఆమోదింపజేసిన తీరుపై టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత కె. కేశవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలో, 12 ఏళ్ల పార్లమెంటరీ అనుభవంలో ఇలా రాజ్యాంగానికి వెన్నుపోటు పొడవడం, నిబంధనలను చెత్తబుట్టలో పడేయడం, ప్రజాహక్కులను అణగదొక్కడాన్ని ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి రాజ్యసభలో చూశాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు...

రాజ్యాంగానికి వెన్నుపోటు

  • కార్పొరేట్‌ సంస్థలను పెంచి పోషించేందుకే చట్టం
  • రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోలేదు.. సమాఖ్య స్ఫూర్తికి గండి
  • మార్షల్స్‌తో దాడి చేయించారు.. నా జీవితంలో చూడని ఘటన
  • డిప్యూటీ చైర్మన్‌ను ప్రభావితం చేశారు.. అందుకే అవిశ్వాసం: కేకే
  • రైతులకు బ్లాక్‌ డే.. సాగు బిల్లుతో రైతుల గొంతు నొక్కారు
  • ఓటింగ్‌ నిర్వహిస్తే బిల్లులు వీగిపోతాయనే భయం
  • అందుకే మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు: నామా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను కేంద్రం ఆమోదింపజేసిన తీరుపై టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత కె. కేశవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలో, 12 ఏళ్ల పార్లమెంటరీ అనుభవంలో ఇలా రాజ్యాంగానికి వెన్నుపోటు పొడవడం, నిబంధనలను చెత్తబుట్టలో పడేయడం, ప్రజాహక్కులను అణగదొక్కడాన్ని ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి రాజ్యసభలో చూశాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ సభ్యులమంతా వ్యతిరేకించామని పేర్కొన్నారు.


సభలో అంతా బాగా జరుగుతున్న సమయంలో బిల్లు వీగిపోతుందనే భయంతో ప్రభుత్వ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చిందని, డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ను ప్రభావితం చేసి, ఆయన్ను తొందరపెట్టి బిల్లులను ఆమోదింపజేసుకున్నారని ఆరోపించారు.  రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లులను తిరస్కరించాలంటూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన చట్టబద్ధ తీర్మానాలను రాకుండా చేశారని, వాటిని అనుమతించలేదని, సవరణల విషయంలోనూ అలాగే వ్యవహరించారని విమర్శించారు ‘‘సభలో పరిణామాలు చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు. మేమేమీ చేయలేకపోయాం. మార్షల్స్‌ను పిలిపించి దాడి (మ్యాన్‌హ్యాండ్లింగ్‌) కూడా చేయించారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసినంతగా ఏ రాష్ట్రం చేయలేదని, అందుకే కేంద్రం ఏ బిల్లు తీసుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు మించి ఏమీ ఉండదని తెలిపారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం సరికాదని సూచించారు. అంతకుముందు సభలో చర్చ సందర్భంగా కేకే మాట్లాడుతూ వ్యవసాయ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆరోపించారు.


రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ బిల్లును టీఆర్‌ఎస్‌ సభ్యులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.  బిల్లు విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా సమాఖ్య స్ఫూర్తికి గండి కొట్టారని విమర్శించారు. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న కార్పొరేట్‌ సంస్థలను పెంచి పోషించడానికే ఈ బిల్లు తెచ్చారని విమర్శించారు. వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు కేంద్రం అన్యాయం చేసిందని, మున్ముందు కేంద్రానికి వారే తగిన బుద్ధి చెబుతారని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి ఇది బ్లాక్‌ డేగా అభివర్ణించారు. రాజ్యసభలో ఓటింగ్‌ నిర్వహిస్తే బిల్లులు వీగిపోతాయనే ఉద్దేశంతోనే మూజువాణి ఓటుతో  ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు.


ప్రజాస్వామ్య గొంతును నొక్కిపెట్టి రైతు గొంతును నొక్కే పరిస్థితిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం మీడియాతో నామా మాట్లాడారు. బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తమ ఎంపీలు పోరాడుతుంటే  టీవీ ప్రసారాలను నిలిపివేశారని ఆరోపించారు. వ్యవసాయ బిల్లుల పారదర్శకంగా ఉంటే.. అన్ని పక్షాలను సమన్వయం చేసి, ఏకతాటిపైకి ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ‘‘బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపొచ్చు. భాగస్వామ్యులతో చర్చించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడవచ్చు. ఇవేవీ లేకుండానే పార్లమెంటులో వ్యవసాయ బిల్లును ఆమోదించుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో మొట్టమొదటి సారి రైతాంగం మొత్తం రోడ్డెక్కిందని, దాదాపు చాలా రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు లోక్‌సభలో  కరో నా పరిస్థితిపై జరిగిన చర్చ సందర్భంగా దేశమంతా ఆరోగ్య శ్రీ అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కొంద రు ప్రశ్నిస్తున్నారని, ఈ పథకం కన్నా ఆరోగ్య శ్రీ పథకమే ఉత్తమమైనదని పేర్కొన్నారు


డిప్యుటీ చైర్మన్‌పై అవిశ్వాసం 

రాజ్యసభ డిప్యుటీ చైర్మన్‌ హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని అందించామని కేశవ రావు వెల్లడించారు. తీర్మానంపై 12 పార్టీలకు చెందిన 40 - 50 మంది ఎంపీలు  సంతకాలు చేశారని తెలిపారు. తీర్మానాన్ని అందించడానికి వెళితే సెక్రటరీ జనరల్‌ లేరని, టేబుల్‌ ఆఫీసులో ఇన్‌చార్జిని కలిసి తీర్మానాన్ని అందించామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం ఎవరిపైనైనా ప్రవేశపెడితే ... అది తేలే వరకు ఆయన సభాపతి స్థానంలో కూర్చోకూడదని స్పష్టం చేశారు. ఈ తీర్మానంపై సోమవారం సభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. ఎప్పుడూ ఇలా కాలేదని, పార్లమెంటును రక్షించాలని దేవుడినే కోరుకుంటున్నానని తెలిపారు. 


Updated Date - 2020-09-21T07:15:06+05:30 IST