యడియూరప్ప ఢిల్లీ పర్యటనపై ఖర్గే సెటైర్...

ABN , First Publish Date - 2021-07-18T01:21:29+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్జే..

యడియూరప్ప ఢిల్లీ పర్యటనపై ఖర్గే సెటైర్...

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్జే సూటిగా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగంగానే ముఖ్యమంత్రిని తప్పించమంటూ మాట్లాడుతున్నారని తెలిపారు. బహుశా ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఏడెనిమిది నెలల నుంచీ ఈ అస్థిర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని, ఆ ప్రభావం ప్రభుత్వ పాలనా వ్యవహారాలపై కనిపిస్తోందని విమర్శించారు.


కాగా, యడియూరప్పను పార్టీ అధిష్ఠానం సీఎం పదవి నుంచి తప్పించాలని అనుకుంటోందనే ఊహాగానాలు ఆయన ఢిల్లీ పర్యటనతో మరింత బలపడ్డాయి. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులను యడియూరప్ప కలుసుకోవడంతో యడియూరప్పకు ఉద్వాసన తప్పదనే ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేదని తొలుత కొట్టిపారేసిన యడియూరప్ప, మోదీతో సమావేశంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్టు తెలుస్తోంది. తన వారసులకు కేంద్రంలో కీలక స్థానం కల్పిస్తే సీఎం పదవికి రాజీనామా సమర్పించగలనని ఒక షరతును ప్రధాని ముందుచినట్టు కూడా చెబుతున్నారు. యడియూరప్పపై పెరుగుతున్న అసంతృప్తికి అడ్డుకట్ట వేయకుంటే అది పార్టీపై, తదుపరి ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అధిష్ఠానం అభిప్రాయపడుతున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

Updated Date - 2021-07-18T01:21:29+05:30 IST