వ్యవసాయ బిల్లులపై విప్ జారీ చేసిన బీజేపీ

ABN , First Publish Date - 2020-09-20T00:41:01+05:30 IST

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదముద్ర పడేలా చూసేందుకు ప్రభుత్వం పట్టుదలగా..

వ్యవసాయ బిల్లులపై విప్ జారీ చేసిన బీజేపీ

న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదముద్ర పడేలా చూసేందుకు ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కీలకమైన మూడు వ్యవసాయ బిల్లులను ఆదివారంనాడు రాజ్యసభలో ప్రవేశపెడుతోంది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడు లైన్ల విప్‌ను బీజేపీ జారీ చేసింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.


వ్యవసాయ బిల్లులు రైతు నడ్డి విరిచి, కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుండగా, బిల్లుల విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతోందని బీజేపీ అంటోంది. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ చిరకాల భాగస్వామి అయిన శిరోమణి అకాలీదల్ (సాద్) ఈ బిల్లులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటిని రైతు వ్యతిరేక బిల్లులుగా అభివర్ణించింది. సాద్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.


కాగా, బీజేపీ మాత్రం వ్యవసాయ బిల్లులపై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు పట్టుదలగా ఉంది. ఇవి రైతు అనుకూల బిల్లులని, దళారుల ప్రమేయం లేకుండా పోతుందనే భయంతోనే బిల్లులను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపిస్తోంది. వ్యవసాయ రంగ బిల్లులతో రైతులకు దళారుల బెడద తప్పుతుందని ప్రధాని మోదీ శుక్రవారంనాడు కోసి మెగా బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. ఈ బిల్లులతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మండీలలోనే కాకుండా, దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కలుగుతుదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు.

Updated Date - 2020-09-20T00:41:01+05:30 IST