నితీష్ సారథ్యంలోనే ఎన్నికలు: బీజేపీ

ABN , First Publish Date - 2020-10-01T01:01:55+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోనే బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) కలిసికట్టుగా..

నితీష్ సారథ్యంలోనే ఎన్నికలు: బీజేపీ

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోనే బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) కలిసికట్టుగా బీహార్ ఎన్నికలకు వెళ్తాయని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ బీహార్ ఇన్‌‌చార్జి భూపేందర్ యాదవ్ తెలిపారు. బుధవారంనాడు పార్టీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, భాగస్వామ్య పార్టీలతో మాట్లాడేందుకు కేంద్ర నాయకత్వం ప్రతినిధులను నియమించినట్టు తెలిపారు. గురువారం కల్లా ఆ ప్ర్రక్రియ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.


నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే)లో సీట్ల పంపకాల విషయంలో అయోమయం తలెత్తినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ మరోసారి తన వాదన వినిపించింది. బీహార్‌లో నితీష్ నాయకత్వంలోనే ఎన్డీయే ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించింది.


మా పార్టీ సీఎం అభ్యర్థి చిరాగ్ పాశ్వానే..

దీనికి ముందు, ఎల్‌జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి షానవాజ్ అహ్మద్ కైఫి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనీ, తమ పార్టీ 143 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. తమ పార్టీ సీఎం అభ్యర్థి చిరాగ్ పాశ్వాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు చెప్పారు. కాగా, రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతలగా అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు ప్రకటిస్తారు.


థర్డ్ ఫ్రంట్..

బీహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో పాటు, ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల కూటమి పోటీ చేస్తోంది. మూడో ఫ్రంట్ కూడా ఈసారి బరిలోకి దిగనుంది. ఆర్ఎస్ఎల్‌పీ, బీఎస్‌పీ కలిసి పోటీ చేయడానికి నిర్ణయించడంతో త్రిముఖ పోటీ ఉండనుంది.

Updated Date - 2020-10-01T01:01:55+05:30 IST