ప్రాణాలు పణంగా పెడతాం

ABN , First Publish Date - 2020-05-27T09:23:36+05:30 IST

‘‘ప్రాణాలు పణంగా పెట్టయినా ఆంధ్రలో దేవాలయాల ఆస్తులను పరిరక్షించుకుంటాం. భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగించే రీతిలో ఏపీ ప్రభుత్వం పని చేస్తే ఉపేక్షించబోము. రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ఉంది. ప్రజల ఆశలు,

ప్రాణాలు పణంగా పెడతాం

  • దేవాలయ భూములను రక్షించుకొంటాం: బీజేపీ
  • ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కమలం నేతలు, శ్రేణుల ఉపవాస దీక్షలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘‘ప్రాణాలు పణంగా పెట్టయినా ఆంధ్రలో దేవాలయాల ఆస్తులను పరిరక్షించుకుంటాం. భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగించే రీతిలో ఏపీ ప్రభుత్వం పని చేస్తే ఉపేక్షించబోము. రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ఉంది. ప్రజల ఆశలు, ఆశయాల కోసమే మా పార్టీ పని చేస్తోంది’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్ర బాధ్యుడు సునీల్‌ దేవధర్‌ అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తుల అమ్మకాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ నాయకులు, శ్రేణులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్షలు చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌, బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్‌, బీజేపీ అధికారప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆయా ప్రాంతాల్లో దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్‌ దేవధర్‌మాట్లాడారు.  అధికార వైసీపీని ‘భూ ఆక్రమణల పార్టీ’గా అభివర్ణించారు. ‘ఆయన వచ్చాడు, చూశాడు, అక్రమించాడు’ అనే రీతిలో అధికార వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ చేపట్టిన ఉపవాసదీక్షకు భయపడి టీటీడీ ఆలయ ఆస్తుల అమ్మకాల జీవోను రద్దు చేస్తూ జీవో 888 విడుదల చేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్‌ అన్నారు. ఇది కేవలం తాత్కాలిక నిలుపుదల మాత్రమేననీ, పూర్తిగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   ‘‘దేవాలయాల ఆస్తులు, భూములు అమ్మకాలు జరగకుండా ఏపీ ప్రభుత్వం ఖచ్చిమైన నిర్ణయాలు తీసుకోవాలి.  అన్ని దేవాలయాలకు ఉన్న ఆస్తులు, భూముల పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు.


చీటింగ్‌ జీవోతో దేవుడ్నీ మోసం: కన్నా

‘‘టీటీడీ ఆస్తుల అమ్మకం వ్యవహారంలో ప్రభుత్వం చెబుతున్న సోది కబుర్లు నమ్మే దద్దమ్మలెవరూ ఇక్కడ లేరు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 888 నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఆ జీవోలో భూముల అమ్మకం నిలుపుదల చేస్తున్నట్లు లేదు. అందరినీ సంప్రదించి అమ్మకాలు జరపమని ఉంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం ఒక చీటింగ్‌ జీవోను ఇచ్చి దేవుడిని కూడా మోసం చేసిందని విమర్శించారు.

Updated Date - 2020-05-27T09:23:36+05:30 IST