ఈటల రాజేందర్‌కు తీవ్ర జ్వరం

ABN , First Publish Date - 2021-07-31T08:05:05+05:30 IST

రీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పన్నెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కాళ్లకు పొక్కులు వచ్చి, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. ఆయన నడవలేని స్థితికి రావడంతో

ఈటల రాజేందర్‌కు తీవ్ర జ్వరం

కాళ్లకు పొక్కులు.. పడిపోయిన ఆక్సిజన్‌, బీపీ స్థాయులు

నిమ్స్‌కు తరలించాలని వైద్యుల సూచన

నేను చిన్నవాడినే.. మరి భయమెందుకు..? : ఈటల


కరీంనగర్‌/హైదరాబాద్‌/వీణవంక, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పన్నెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కాళ్లకు పొక్కులు వచ్చి, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. ఆయన నడవలేని స్థితికి రావడంతో హుటాహుటిన 108కు, వైద్యులకు సమాచారం అందించారు. శుక్రవారం వీణవంక మండలంలోని కొండపాక వరకు పాదయాత్రగా వచ్చిన ఆయన మధ్యాహ్న భోజన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈటల ఆక్సిజన్‌ స్థాయిలు 94-95కు, బీపీ 90/60కి పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. షుగర్‌ లెవల్స్‌ 265కు పెరిగాయని, ఆయన డీహైడ్రేషన్‌కు గురయ్యారని నిర్ధారించారు.


మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించాలని సూచించారు. అయితే, ఈటల స్థానికంగానే చికిత్స పొంది రెండు రోజుల తర్వాత పాదయాత్ర కొనసాగించాలని భావిస్తున్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు. వరంగల్‌ నుంచి డాక్టర్‌ కాళీప్రసాద్‌ వచ్చి పరీక్షలు నిర్వహించిన తర్వాత హైదరాబాద్‌కు తరలించే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. ఈటల రాజేందర్‌ ఈ నెల 19న వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని కమలాపూర్‌ మండలం బత్తినివానిపల్లె నుంచి పాదయాత్రను ప్రారంభించారు. 23 రోజుల పాటు 380 కి.మీ పాదయాత్ర చేయాలని నిర్ణయించిన ఆయన 12 రోజులుగా 70 గ్రామాల మీదుగా 222 కి.మీ పాదయాత్ర చేశారు. ఈటల అస్వస్థతకు గురైన సమయంలో ఆయన భార్య జమున హుజూరాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఆమె కొండపాక గ్రామానికి చేరుకున్నారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు.  


నా రాజీనామా వల్లే రేషన్‌కార్డులు, పథకాలు..

తాను రాజీనామా చేయడం వల్లనే ప్రజలకు పెన్షన్లు, రేషన్‌ కార్డులు, గొల్ల కురుమలకు గొర్లు, దళిత బంధు పథకాలు వస్తున్నాయని ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో ఆయన పాదయాత్ర చేశారు.  తాను ఏ ఊరికి వెళితే ఆ ఊళ్లో కరెంటు కట్‌ చేస్తున్నారని, తాను చిన్నవాడినే అయితే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో దెబ్బ కొడితే కేసీఆర్‌కు దిమ్మతిరగాలన్నారు. హుజూరాబాద్‌కు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు చేతనైతే వారి నియోజకవర్గాల్లో రేషన్‌కార్డులు, గొర్లు, దళిత బంధు ఇప్పించాలని అన్నారు. 

Updated Date - 2021-07-31T08:05:05+05:30 IST