Abn logo
Jul 30 2021 @ 01:53AM

హుజూరాబాద్‌ ఉద్రిక్తం

ఈటల బావమరిది పేరిట వాట్సాప్‌ చాట్‌ వైరల్‌

దళితులను కించపరిచారంటూ టీఆర్‌ఎస్‌ నిరసన

తప్పుడు ప్రచారమంటూ పట్టణంలో జమున ర్యాలీ

అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం, పూలమాలలు

చెప్పులు విసురుకున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ శ్రేణులు

ఫేక్‌ చాట్‌పై పోలీసులకు మధుసూదన్‌ ఫిర్యాదు


కరీంనగర్‌/హుజూరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డి మరో వ్యక్తితో చేసినట్లు చెబుతున్న వాట్సాప్‌ చాటింగ్‌ హుజూరాబాద్‌లో వివాదాస్పదంగా మారింది. ఆ వాట్సాప్‌ చాటింగ్‌లో ఆయన దళితులను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ దానికి నిరసనగా ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం హుజూరాబాద్‌లో  ఈటల రాజేందర్‌, ఆయన బావమరిది మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మలను ఊరేగించి, దహనం చేశారు. విషయం తెలుసుకున్న ఈటల సతీమణి జమున ఆయన బావమరిది మధుసూదన్‌రెడ్డ్డి, మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు సునీల్‌, ఓయూ జేఏసీ నేతలు నెహ్రునాయక్‌, సురేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వంద మంది బీజేపీ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా హుజూరాబాద్‌ అంబేడ్కర్‌  చౌరస్తాకు చేరుకున్నారు.


అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో టీఆర్‌ఎ్‌సవీ నాయకుడు పూర్ణచందర్‌ ఆధ్వర్యంలో సుమారు 10మంది ఈటల దళితద్రోహి అంటూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ అక్కడికి చేరుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ చెప్పులు విసురుకున్నారు. బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఉండడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు ఇరువర్గాలను నెట్టేసి టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అనంతరం బీజేపీ నేతలు, కార్యకర్తలు వరంగల్‌-కరీంనగర్‌ రహదారిపై ధర్నా నిర్వహించి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోపక్క ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో దళితులు నిరసన ప్రదర్శనలు నిర్వహించి, ఈటల రాజేందర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం కరీంనగర్‌లో మాట్లాడుతూ ఈటల బావమరిది మధుసూదన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.


ఆయన వాఖ్యలకు నిరసనగా ఆగస్టు 4న జమ్మికుంట, హుజూరాబాద్‌ పట్టణాల్లో నిరసన ర్యాలీలను నిర్వహిస్తామని ప్రకటించారు. కాగా, తాను దళితులను కించపరిచినట్లు ఫేక్‌ వాట్సాప్‌ చాటింగ్‌ను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ ఈటల బావమరిది మధుసూదన్‌రెడ్డి హుజూరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత చాట్‌లో ఈటల పీఏ నరేశ్‌ ప్రస్తావన కూడా ఉండటంతో ఆయన కూడా జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈటల బావమరిది, మరో సన్నిహితుడి మధ్య జరిగిందని చెబుతున్న ఈ చాట్‌ నిజమైనదే అయితే అది ఎలా బయటకు వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ వివాదాస్పద చాట్‌లో దళితబంధు పథకం, దళితులపై వ్యాఖ్యలు, డబ్బు ప్రస్తావన ఉన్నాయి. ఇది ఫేక్‌ చాట్‌ అని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. టీఆర్‌ఎస్‌ శ్రేణులు మాత్రం దీనిని విస్తృతంగా ప్రచారంలో పెడుతున్నాయి. ఇది వాస్తవమే అయితే ఫోన్‌ హ్యాక్‌ చేస్తే తప్ప విషయం బయట పడదని చర్చ జరుగుతోంది.


నా భార్యపై దాడికి యత్నించారు

కేసీఆర్‌ పాలన తెలంగాణకు అరిష్టమని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. గురువారం జమ్మకుంట మండలం విలాసాగర్‌, పాపయ్యపల్లి, బిజిగిరిషరీఫ్‌, వెంకటేశ్వర్లపల్లి, కాపులపల్లి, కోరపల్లి, సైదాబాద్‌ గ్రామాల్లో ప్రజా దీవెన పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా  ఈటల వెంకటేశ్వర్లపల్లిలో ఈటల మాట్లాడుతూ, కేసీఆర్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనను ఓడగొట్టే దమ్ము లేక కొన్ని టీవీ చానెళ్లను అడ్డు పెట్టుకుని, అదే పనిగా తనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన భార్య ఆంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్తే టీఆర్‌ఎస్‌ నాయకులు దాడికి యత్నించారని అన్నారు. ఫేక్‌ న్యూస్‌లు సృష్టించి వాళ్ల మీడియాలో తనను దళిత ద్రోహినంటూ బదునాం చేస్తున్నారని మండిపడ్డారు. దేశచరిత్రలో ఆఫీ్‌సకు రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రైతుబంధు హుజూరాబాద్‌లో అమలు చేసి రాష్ట్రమంతా విస్తరించినట్లు దళితబంధు కూడా రాష్ట్రమంతా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 


అభ్యర్థి ఎంపికపై కేసీఆర్‌ ఫోకస్‌

గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలిసింది. ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈటల రాజేందర్‌కు దీటైన అభ్యర్థిని నిలబెట్టాలన్న సంకల్పంతో కసరత్తును ప్రారంభించారు. ఇటీవల ప్రకటించిన దళితబంధుపై నియోజకవర్గ ప్రజల్లో జరుగుతున్న చర్చ గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. నేతల చేరికల అనంతరం పార్టీ పరిస్థితిపై ఇన్‌చార్జ్‌లను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. సమావేశానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధర్మారెడ్డి హాజరైనట్లు సమాచారం. 

దళితుల పాదాలు మొక్కిన ఈటల

జమ్మికుంట రూరల్‌: విలాసాగర్‌ గ్రామంలో ఈటల రాజేందర్‌ కాళ్లను దళితులు పాలతో కడిగారు. అదే సమయంలో ఈటల రాజేందర్‌ కూడా వారి కాళ్లు మొక్కారు. ఈటల రాజీనామా చేయడం వల్లే దళితబంధు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని ఈ సందర్భంగా దళితులు వ్యాఖ్యానించారు. దళితులు తన కాళ్లు కడుగుతానని వస్తే రాజకీయ నాయకులు ఎక్కడ విమర్శిస్తారో అని ముందుగా తానే వాళ్ల కాళ్లకు మొక్కానని ఈటల అన్నారు. వేల మంది దళిత బిడ్డలకు చదువు చెప్పించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను నిర్ధాక్షిణ్యంగా బయటకు వెళ్లేలా చేశారన్నారు. అభివృద్ధి జరుగాలంటే రాజీనామా చేయాలనే ఆలోచనకు ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే పోయిన లీడర్లు అందరూ మళ్లీ తన దగ్గరకు వస్తారన్నారు.