రైతులకు అన్ని విధాలా మేలు చేసేలా మోదీ ప్రభుత్వ నిర్ణయం: జీవీఎల్

ABN , First Publish Date - 2020-09-21T15:55:41+05:30 IST

కేంద్రం చేసిన చట్టం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్చ ఉంటుందని బీజేపీ నేత జీవియల్ నరసింహారావు తెలిపారు.

రైతులకు అన్ని విధాలా మేలు చేసేలా మోదీ ప్రభుత్వ నిర్ణయం: జీవీఎల్

అమరావతి: కేంద్రం చేసిన చట్టం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే  స్వేచ్చ ఉంటుందని బీజేపీ నేత జీవియల్ నరసింహారావు తెలిపారు. మార్కెట్ యార్డుల బయట కూడా  రైతుల నుంచి నేరుగా ఎవరైనా కొనుగోలు చేయవచ్చన్నారు. మార్కెట్ యార్డులకు, ఏజెంట్లకు ఎటువంటి రుసుములు చెల్లించనవరం లేదని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులు బంద్ అయిపోతాయని విపక్షాలు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతలకు, కొనుగోలుదారులకు మధ్య వ్యవసాయ ఉత్పత్తుల మధ్య మాత్రమే ఒప్పందాలు జరుగుతాయని చెప్పారు. రైతుల ఆదాయం పెంచే ఉద్దేశంతో 2022 నాటికి రెట్టింపు కావాలనే మోదీ ఈ విప్లవాత్మకమైన నిర్ణయం చేశారని పేర్కొన్నారు. 2003లోనే ఇటువంటి సవరణలు చేయాలని చెప్పినా.. ఆనాడు చేయలేదని అన్నారు. రైతు కష్టాలను గుర్తించే.. మోదీ ఈరోజు ఆ చట్టం చేశారనేది అందరూ గుర్తించాలని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రైతులకు సంకెళ్లు వేసి.. మార్కెట్ యార్డులలో కమిషన్ ఏజెంట్ల ద్వారానే అమ్ముకోవాల్సి ఉందని, మధ్యవర్తులు పరిస్థితిని బట్టి వారి దయాదాక్షణ్యాలతో రైతుకు ధర నిర్ణయించేవారన్నారు. ఇప్పుడు అలా కాకుండా.. రైతులకు అన్ని విధాలా మేలు చేసేలా మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.


నాలుగు లక్షల 95వేల కోట్ల ధాన్యాన్ని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని... కాంగ్రెస్ కన్నా 2.4రెట్లు అధికంగా ధర ఇచ్చి రెట్టింపు ఉత్పత్తులను కొనుగోలు చేశామని తెలిపారు. రైతు వ్యవసాయ ఖర్చుల కన్నా కనీస మద్దతు ధర యాభై శాతం అధికంగా ఉండేలా మోదీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నిజమైన రైతు బంధువు మోదీ అని.. అందుకే వారి సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని అన్నారు. రైతులకు నిజమైన స్వాతంత్ర్యం నిన్నే వచ్చిందని తాను భావిస్తున్నానన్నారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న అసత్యాలను అందరూ తిప్పికొట్టాలని..  వారి హయాంలో రైతును మోసం చేసిన తీరును ప్రజలకు వివరించాలని జీవీఎల్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-09-21T15:55:41+05:30 IST