ధనిక రాష్ట్రమని అటు KCR సర్కార్ గొప్పలు.. ఇటు పెరిగిపోతున్న పేదల సంఖ్య : విజయశాంతి

ABN , First Publish Date - 2021-10-09T20:48:07+05:30 IST

కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నాయకురాలు సోషల్ మీడియా వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు...

ధనిక రాష్ట్రమని అటు KCR సర్కార్ గొప్పలు.. ఇటు పెరిగిపోతున్న పేదల సంఖ్య : విజయశాంతి

హైదరాబాద్ సిటీ : కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నాయకురాలు సోషల్ మీడియా వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక వైపు మనది ధనిక రాష్ట్రమని రాష్ట్ర సర్కార్ గొప్పలు చెప్పుతున్నప్పడు.. మరో దిక్కు రాష్ట్రంలో పేదల సంఖ్య నానాటికీ ఎలా పెరిగిపోతున్నదో కేసీఆర్ సర్కార్ చెప్పాలని రాములమ్మ డిమాండ్ చేశారు. జీఎస్‌‌డీపీలో దేశంలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందని, సర్​ప్లస్‌‌ స్టేట్‌‌ అని ఆర్థిక శాఖ చెప్పే లెక్కలకు, సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ జారీ చేసే రేషన్‌‌ కార్డులకు పొంతన లేదని స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. 


ఈ లెక్కలు చూస్తేనే..!

గురువారం అసెంబ్లీ సమావేశంలో టీఆర్ఎస్ సర్కార్  రేషన్‌‌ కార్డుల వివరాలు ప్రకటించడం చూస్తుంటే రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో పేదల సంఖ్య ఎక్కువయిందని స్పష్టంగా అర్ధమవుతుంది. రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్ల వరకు ఉండగా.. చట్ట ప్రకారం బీపీఎల్​స్థాయికి దిగువలో ఉన్న కుటుంబాలకు మాత్రమే రేషన్‌‌ కార్డులు ఇస్తారు. అలా గ్రామాల్లోనైతే లక్షన్నరలోపు సంవత్సరాదాయం, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ. 2 లక్షలలోపు సంవత్సరాదాయం ఉన్న కుటుంబాలు రేషన్‌‌ కార్డులకు అర్హులు. కాగా దీని ప్రకారం.. 2 కోట్ల 87 లక్షల 68 వేల మంది రేషన్‌‌ లబ్ధిదారులు ఉన్నట్లు సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రకటించడం గమనార్హం. రేషన్ కార్డులున్న 90.49 లక్షల కుటుంబాలు పేదవర్గాలే అంటే.. రాష్ట్ర జనాభాలో 71శాతం పైగా ఏడేండ్లలోనే 21.30 లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారని రేషన్‌‌ కార్డుల లెక్కలు చూస్తేనే ఈ విషయం తేటతెల్లమవుతున్నది అని విజయశాంతి విమర్శించారు.


ఇప్పటికైనా చరమగీతం పాడండి!

తెలంగాణ రాష్ట్రము ఆదాయంలో ధనిక రాష్ట్రమని దేశ అభివృద్ధికి నిధులు ఇస్తున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఒకటని  సీఎం కెసిఆర్ అసెంబ్లీలో గారడీ మాటలు చెప్పడం సిగ్గుచేటు. అసలు రాష్ట్రంలో 71శాతానికి పైగా పేద ప్రజలు తెల్ల రేషన్ కార్డులు ద్వారా బతుకుతున్నప్పుడు ధనిక రాష్ట్రం ఎలా అయ్యిందో రాష్ట్ర సర్కార్ తెలపాలి. ఇక  ధనిక తెలంగాణ అప్పుల లెక్క అప్పట్లో 70వేల కోట్లు నుండి  ఇప్పడు నాలుగు లక్షల కోట్లు దాటింది. గడిచిన ఈ  5నెలల్లోనే 6800కోట్ల మిత్తి కడుతుందంటే ఏ తీరుగా అప్పులు తెస్తుందో, ఏ తీరుగా ప్రజల వద్ద దోచుకుని మిత్తీలు కడుతుందో  అర్దమవుతుంది. రాష్ట్రంలోని ప్రజలందరిపై ప్రభుత్వం మోపే అప్పు  ఒక్కొక్కరిపై 1లక్ష 5వేల పైనే ఉంది. ఇలా రాష్ట్ర ధనిక రాష్ట్రమంటూనే రాష్ట్ర ప్రజలను దారిద్య రేఖకు దిగువన పడేస్తున్న రాష్ట్ర సర్కార్ పేద ప్రజల ప్రగతికి చేస్తుంది శూన్యమని ప్రజలు గమనించాలి. ఇప్పటికైనా ఈ సీఎం కెసిఆర్ నియంత పాలనకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడి.. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేలా ప్రజలంతా సంకల్పించాలి అని రాములమ్మ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-10-09T20:48:07+05:30 IST