కేసీఆర్ కుటుంబం తరగని ఆస్తులు సంపాదించుకుంటోంది: విజయశాంతి

ABN , First Publish Date - 2021-09-12T02:33:02+05:30 IST

బీజేపీ మహిళా నేత విజయశాంతి మరోమారు కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్రం ప్రభుత్వంపై తెలంగాణ

కేసీఆర్ కుటుంబం తరగని ఆస్తులు సంపాదించుకుంటోంది:  విజయశాంతి

హైదరాబాద్: బీజేపీ మహిళా నేత విజయశాంతి మరోమారు కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ మోదీ నాయకత్వంపై చెడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిజానికి దేశ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుంది బీజేపీ మాత్రమేనంటూ ట్విట్టర్‌లో  నిప్పులు చెరిగారు.


తెలంగాణ ఏర్పాటు ఎజెండా అయిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం మేధావులు, తెలంగాణవాదులు, నిరుద్యోగ యువత  కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే... కేసిఆర్ కుటుంబం నీళ్ల పేరుతో దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కొన్ని తరాలు కూడా తరగని నిధులు సమకూర్చుకున్నారని మండిపడ్డారు. నియామకాలు వారి ఇంటికి మాత్రం  పరిమితం చేసుకుని, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా విమర్శలు చేసే కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అందరికీ తెలిసిందేనని అన్నారు.


ఇటీవల కేంద్ర మంత్రివర్గం టెక్స్‌టైల్ రంగానికి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని ఆమోదించి నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధి కల్పనకు కృషి చేస్తోందని విజయశాంతి తెలిపారు. 2021-22 బడ్జెట్‌లో ప్రకటించిన పీఎల్ఐ పథకంలో భాగంగా రూ. 1.97 లక్షల కోట్లు  టెక్స్‌టైల్స్ కోసం కేటాయించినట్టు గుర్తు చేశారు.


ఈ రంగం ద్వారా 7.5 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వస్త్ర పరిశ్రమ ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పిస్తోందని అన్నారు. మహిళా సాధికారతకు ఈ పథకం చక్కని ఉదాహరణ అని అన్నారు. అలాగే, ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతోందని వివరించారు.


ఈ పథకం ముఖ్యంగా గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఏపీ, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాలపై సానుకూల ప్రభావం చూపిస్తోందన్నారు. గులాబీ పార్టీ నేతలు మాత్రం ఎప్పుడూ కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎవరెన్ని చేసినా బీజేపీ ప్రభుత్వ పాలనపైనా, మోదీ నాయకత్వంపైనా ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నాని పేర్కొన్న విజయశాంతి.. రాబోయే రోజుల్లో తెలంగాణాలో అధికారం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-12T02:33:02+05:30 IST