సొంత ఇలాకాల్లో పట్టు సాధించిన బీజేపీ అగ్రనాయకులు

ABN , First Publish Date - 2020-12-05T15:55:26+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకులు

సొంత ఇలాకాల్లో పట్టు సాధించిన బీజేపీ అగ్రనాయకులు

  • వ్యూహాత్మకంగా బీజేపీ మళ్లీ పాగా
  • ముషీరాబాద్‌, గోషామహల్‌లో ప్రభంజనం
  • అంబర్‌పేట, ఖైరతాబాద్‌లో పలు డివిజన్లు

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకులు తమ ఇలాకాలలో పట్టు సాధించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించి, తమ అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి ఫలితాలు సాధించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ తన సొంత నియోజకవర్గమైన ముషీరాబాద్‌లో మెజారిటీ డివిజన్లలో కాషాయజెండా ఎగరడంలో కీలకంగా వ్యవహరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు గ్రేటర్‌ ఎన్నికలను ఆయన సవాల్‌గా తీసుకున్నారు. దీంతో ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉండగా, ఐదు డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది.


రాంనగర్‌, అడిక్‌మెట్‌, ముషీరాబాద్‌, కవాడిగూడ, గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. గోషామహల్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన ఒకే ఒక నియోజకవర్గం. ఇక్కడ రాజాసింగ్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉండగా, ఐదు డివిజన్‌లలో బీజేపీ విజయం సాధించింది. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్‌లోనూ బీజేపీ పట్టు సాధించింది. ఇక్కడ ఆరు డివిజన్లు ఉండగా, రెండు డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే  ప్రభాకర్‌ ప్రాతినిధ్యం వహించిన చోట రెండు డివిజన్లలో విజయ కేతనం ఎగురవేసింది.


మిగిలిన చోట్లా.. 

అంబర్‌పేటలో బీజేపీ మూడు డివిజన్లను గెలుచుకుంది. సనత్‌నగర్‌లో మూడు డివిజన్లలో విజయం సాధించింది. అమీర్‌పేట, రాంగోపాల్‌పేట, మోండా డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.  కార్వాన్‌ నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో రెండు డివిజన్లు బీజేపీ వశమయ్యాయి. రాజేంద్రనగర్‌లో మూడు డివిజన్లలో, కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఓ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.

Updated Date - 2020-12-05T15:55:26+05:30 IST