ఐషా సుల్తానా ఎఫెక్ట్.. లక్షద్వీప్‌లో బీజేపీకి భారీ షాక్!

ABN , First Publish Date - 2021-06-12T23:02:17+05:30 IST

లక్షద్వీప్‌లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌ను ‘జీవాయుధం’గా పేర్కొంటూ

ఐషా సుల్తానా ఎఫెక్ట్.. లక్షద్వీప్‌లో బీజేపీకి భారీ షాక్!

న్యూఢిల్లీ: లక్షద్వీప్‌లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌ను ‘జీవాయుధం’గా పేర్కొంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నటి, దర్శకురాలు ఐషా సుల్తానాపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. సరిగ్గా అదే ఇప్పుడు బీజేపీలో కలకలానికి కారణమైంది. ఇటీవల ఓ మలయాళ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న ఐషా సుల్తానా.. ప్రఫుల్ పటేల్‌ను బయోవెపన్ (జీవాయుధం)గా అభివర్ణించారు. ఒకప్పుడు లక్షద్వీప్‌లో కరోనా కేసులు సున్నా అని, ఇప్పుడు ప్రతి రోజు వందకు పైగా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్న ఆమె కేంద్ర ప్రభుత్వం లక్షద్వీప్ ప్రజలపై జీవాయుధాన్ని ప్రయోగించిందని ప్రఫుల్‌ను ఉద్దేశించి అన్నారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన లక్షద్వీప్ బీజేపీ చీఫ్ అబ్దుల్ ఖదీర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది.


సుల్తానాకు ప్రతిపక్ష రాజకీయ నాయకులు సహా పలు సాంస్కృతిక సంఘాలు అండగా నిలిచాయి. ఆమెపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బీజేపీలోనే చిచ్చు మొదలైంది. ఆమెపై తప్పుడు కేసు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా 15 మంది నేతలు, కార్యకర్తలు రాజీనామాలు చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ అబ్దుల్‌కు లేఖ రాశారు. ప్రఫుల్‌పై బీజేపీ నేతలే పోరాడుతున్నారని, అలాంటప్పుడు ఓ టీవీ చర్చలో సుల్తానా విమర్శలు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆమెపై పెట్టింది తప్పుడు కేసేనని పేర్కొన్నారు. ఆమె కుటుంబ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రఫుల్ పటేల్ అప్రజాస్వామిక నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మే నెలలో లక్షద్వీప్‌లో గత నెలలో 8 మంది నేతలు బీజేపీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మరో 15 మంది రాజీనామా చేయడం గమనార్హం.

Updated Date - 2021-06-12T23:02:17+05:30 IST