బీజేపీ స్థానిక వ్యూహం!

ABN , First Publish Date - 2021-04-11T07:48:11+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని సాగర్‌లో అమలు చేస్తోంది.

బీజేపీ స్థానిక వ్యూహం!

  • నియోజకవర్గంలో 400 చిన్న సభలు
  • ప్రతి ఓటరుకు చేరువ కావడమే లక్ష్యం
  • 12, 15 తేదీల్లో సంజయ్‌ రోడ్‌ షో
  • 28 గ్రామాల్లో డీకే అరుణ ప్రచారం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని సాగర్‌లో అమలు చేస్తోంది. ఓటర్లకు చేరువ కావడమే లక్ష్యంగా పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మక ప్రచార కార్యాచరణ చేపట్టింది. ప్రతి జాతీయ, రాష్ట్ర నాయకులు పంచాయతీ లేదా తండాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులంతా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాల్సి ఉంటుం ది. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మా జాతీయ నాయకత్వం ఇదే వ్యూహాన్ని అమలు చేసి ఫలితాలు సాధించింది. 100-150 మంది స్థానికులతో నిర్వహించిన ప్రచార సమావేశాల్లో కేంద్ర మంత్రి అమిత్‌ షా స్వయంగా పాల్గొన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసి సీట్లు పెంచుకున్నాం. ఒక్కో పోలింగ్‌ బూత్‌ పరిధిలో 2, 3 చిన్నచిన్న సభలు పెట్టాం. అలాగే సాగర్‌లోనూ ఏర్పాటు చేశాం. నియోజకవర్గం పరిధిలో 5 రోజుల్లో 400 సమావేశాలు నిర్వహిస్తున్నాం’’ అని బీజేపీ ముఖ్య నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 


కమలం గుర్తుకు ఎందుకు ఓటేయాలి? టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలు ఏంటి? తదితర అంశాలను వివరిస్తున్నామని.. స్థానిక సమస్యలపై వారితో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ రెండు రోజుల కిందట రాష్ట్ర నాయకత్వంతో సమీక్షించిన అనంతరం ముఖ్య నేతల పర్యటనల షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు చెప్పారు. పార్టీ జాతీయ ఉపాఽధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం నుంచి అనుముల మండలంలో ప్రచారం ప్రారంభించారు. పార్టీ సీనియర్‌ నేత గరికపాటి మోహన్‌రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీలు వివేక్‌, జితేందర్‌రెడ్డిలతో పాటు పలువురు సీనియర్‌ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి శనివారం సాగర్‌ నియోజకవర్గంలో ప్రచారం చేశారు.   


సంజయ్‌ రోడ్‌ షో..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 12, 15 తేదీల్లో సాగర్‌లో ప్రచారం చేయనున్నారు. రోడ్‌ షోలో పాల్గొననున్నారు. సంజయ్‌ రోజూ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహిస్తూ, ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారని పార్టీ నేత ఒకరు తెలిపారు. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా చివరి క్షణంలో సంజయ్‌ రంగప్రవేశం చేశారని, సాగర్‌లోనూ అదే తరహా వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారని తెలిపారు.

Updated Date - 2021-04-11T07:48:11+05:30 IST