ఇంధనం ధరల పెరుగుదలకు కారణమదే: బీజేపీ

ABN , First Publish Date - 2021-09-05T20:19:53+05:30 IST

దేశంలో ఇంధనం ధరలు పెరగడానికి అప్ఘనిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభమే కారణమని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే..

ఇంధనం ధరల పెరుగుదలకు కారణమదే: బీజేపీ

బెంగళూరు: దేశంలో ఇంధనం ధరలు పెరగడానికి అప్ఘనిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభమే కారణమని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలకు తాలిబన్ల అంశం ప్రధాన కారణమని హుబ్లీ-దర్వాడ్‌ వెస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన చెప్పారు. అప్ఘనిస్థాన్‌ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి యావత్ ప్రపంచం ఇంధనం సరఫరా సమస్యను ఎదుర్కొంటోందని అన్నారు.


''అప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అంశం మొదలైనప్పటి నుచి ఇంధనం సరఫరాలో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ కారణంగానే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి'' అని చెప్పారు. గత మే నుంచి అనేక సందర్భాల్లో ఇంధనం ధరలను ఆయిల్ కంపెనీలు పెంచుతూ వస్తుండటంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. దీనిపై విపక్షాలు కేంద్రాన్ని తప్పుపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచి కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని, ఆ కారణంగానే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటిందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.


అప్ఘనిస్థాన్‌కు పొండి...

ద్రవ్యోల్బణం, ఇంధనం ధరల పెరుగుదలపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మధ్యప్రదేశ్ బీజేపీ నేత రామ్‌రతన్ పాయల్ ఘాటిగా స్పందించారు. ''అప్ఘనిస్థాన్‌కు పొండి'' అంటూ  సలహా ఇచ్చారు.

Updated Date - 2021-09-05T20:19:53+05:30 IST