బాబు 5 వేలకే ఇచ్చారు..

ABN , First Publish Date - 2020-06-05T08:47:50+05:30 IST

రాష్ట్రంలో ఇసుక సరఫరా అవినీతిమయమైందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో నేతలు ఎంత తిన్నప్పటికీ చంద్రబాబు రూ.5 వేలకే లారీ ఇసుక సరఫరా

బాబు 5 వేలకే ఇచ్చారు..

  • జగన్‌ హయాంలో 20 వేలు!
  • ఇసుకంతా అవినీతిమయం
  • ఆవ భూముల్లో 150 కోట్ల స్కాం
  • మద్యం బ్రాండ్లు వైసీపీ వాళ్లవే
  • ప్రతీ ఊర్లో నాటుసారా
  • ఏడాది పాలనపై సోము వీర్రాజు ఫైర్‌


రాజమహేంద్రవరం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక సరఫరా అవినీతిమయమైందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో నేతలు ఎంత తిన్నప్పటికీ చంద్రబాబు రూ.5 వేలకే లారీ ఇసుక సరఫరా చేశారని.. కానీ ఇవాళ జగన్‌ రూ.20 వేలు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆన్‌లైన్‌ విధానం అస్తవ్యస్తంగా ఉందని.. శాండ్‌ యాప్‌ అర గంటలోనే క్లోజవుతోందని ఆక్షేపించారు. బ్లాకులో మాత్రం కోట్లాది రూపాయల వ్యాపారం జరిగిపోతోందన్నారు. జగన్‌ ఏడాది పాలనపై గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ రంగు చూసి ప్రజలు 151 సీట్లు ఇవ్వలేదు. ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసే పరిస్థితి రావడంతో రాష్ట్రానికి అపప్రద వచ్చింది. వార్డు/గ్రామ సచివాలయాలకు రంగులు వేసే జీవో వచ్చినప్పుడే పంచాయతీరాజ్‌ మంత్రికి ఫోన్‌ చేసి పద్ధతి కాదని చెప్పాను. ముఖ్య కార్యదర్శితో మాట్లాడమన్నారు. టీడీపీ హయాంలో ఉపాధి నిధులతో సత్తెనపల్లి, నరసన్నపేట, మాచర్ల శ్మశానాలకు పసుపు రంగు వేశారు. ఇవాళ వాటికి కూడా వైసీపీ రంగులు వేసేశారు. ఇవాళ రంగుల గొడవను కోర్టు పట్టించుకుంది కాబట్టి తీర్పు ఇచ్చింది. 


కోర్టుకు వెళ్తే తీర్పులు వస్తాయనే సంగతి టీడీపీకి బాగా తెలుసు. అందులో బాగా ట్రైనింగ్‌ ఇచ్చింది. వైసీపీ వాళ్లకు ఇంకా ట్రైనింగ్‌ లేదు’ అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం సేకరిస్తున్న భూముల్లోనూ అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. ‘రాజమహేంద్రవరం ఆవలో ఎకరం రూ.10 లక్షల చేసే భూమిని రూ.45లక్షలకు కొన్నారు. ఇరిగేషన్‌ అధికారులు ఇది ముంపు ప్రాంతమని చెప్పినప్పటికీ కొనుగోలు చేసి రూ.150 కోట్ల కుంభకోణం చేశారు. ఈ సొమ్ము ఎవరు తినేశారో అధికారులే చెప్పాలి. వారి ప్రమేయంతోనే అవినీతి జరిగింది. ఇచ్చిన ఇళ్ల పట్టాలను 10 ఏళ్లలోపు అమ్మేసుకోవచ్చని సీఎం చెబుతున్నారు. ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పు తెచ్చారు. డబ్బు వాళ్లది కాదు కదా.. ఏదైనా చేస్తారు’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మించారని.. తాగి బయటకు వస్తే పోలీసులు పట్టుకునేవారని.. రెండు రకాలుగానూ పన్ను వసూలు చేసేవారని చెప్పారు. ‘ఇవాళ పేదలు తాగకూడదని జగన్‌ ధరలు పెంచారు. కానీ తాగేదంతా పేదలే. పైగా అన్నీ కొత్త బ్రాండ్లే అమ్ముతున్నారు. అవి వైసీపీ నేతలవేనన్న సమాచారం నా దగ్గరుంది. టీడీపీ జన్మభూమి కమిటీలు వేస్తే.. వైసీపీ వలంటీర్లను నియమించింది. వలంటీర్ల జీతభత్యాలకు రూ.300 కోట్లవుతోంది. ప్రతీ ఊర్లో నాటుసారా అమ్ముతున్నారు. మరి వలంటీర్లు ఫిర్యాదు చేయరేం’ అని నిలదీశారు. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాలన్న టీడీ పీ  డిమాండ్‌ను వీర్రాజు తప్పుపట్టారు.

Updated Date - 2020-06-05T08:47:50+05:30 IST