290 కోట్లు కరోనా కట్టడి కోసమే

ABN , First Publish Date - 2020-09-23T09:07:09+05:30 IST

తెలంగాణలో కరోనా కట్టడికి రూ. 290 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిస్తే... కేంద్రం మొత్తం ..

290 కోట్లు కరోనా కట్టడి కోసమే

కేంద్ర నిధుల్లోనూ 160 కోట్లే ఖర్చు: అర్వింద్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా కట్టడికి రూ. 290 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిస్తే... కేంద్రం మొత్తం ఇచ్చిన నిధులు రూ. 290 కోట్లేనని మంత్రి కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. ఈ నిధుల్లోనూ కేవలం రూ. 160 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసేవారు శవాలపై పేలాలు ఏరుకునే రకమని విమర్శించారు.


‘నువ్వు చేసే నల్లికుట్ల చేష్టలకు నీ పేరును నల్లికుట్ల రామారావు అని పెట్టేదుండే. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించిపోతున్నావు’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో రాష్ట్రానికి పీఎం కిసాన్‌ కింద రూ. 652 కోట్లు, జనధన్‌  కింద రూ. 789 కోట్లు, ఉజ్వల పథకం కింద రూ. 180 కోట్లతో 10 లక్షల సిలిండర్లు, భవన నిర్మాణ కార్మికులకు రూ. 127 కోట్లు, పెన్షన్లకు రూ. 66 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ. 1004 కోట్లు, వలస కార్మికులకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రూ. 599 కోట్లు, ఆహార భద్రత పథకం కింద రూ. 1523 కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందని ఆయన వివరించారు.


అర్వింద్‌.. నువ్వో జీరో: వెంకటేశ్‌

‘‘ధర్మపురి అర్వింద్‌.. నీ జీవితం జీరో.. నువ్వో జీరో. సంస్కారం లేకుండా మాట్లాడాలని ప్రధాని మోదీ చెప్పారా? పార్లమెంటు సభ్యుడిగా మీ ఉన్నతిని పెంచుకోండి. బీజేపీ ఎంపీలు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదు’’ అని టీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత ధ్వజమెత్తారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణకు కేవలం రూ. 290 కోట్లు మాత్రమే ఇచ్చామని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు. కేంద్రం రూ. 7 వేల కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ ఎంపీలు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. వ్యవసాయ బిల్లులపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ ఎంపీలు సమాధానం ఇవ్వాలని ఎంపీ రంజిత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్‌  అనేక పథకాలను  అమలు చేస్తున్నారని తెలిపారు.

Updated Date - 2020-09-23T09:07:09+05:30 IST