బీజేపీ ఎంపీని చంపేస్తామంటూ పాకిస్థాన్ కాలర్ బెదిరింపు

ABN , First Publish Date - 2020-08-11T16:03:40+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కు పాకిస్థాన్ కాలర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.....

బీజేపీ ఎంపీని చంపేస్తామంటూ పాకిస్థాన్ కాలర్ బెదిరింపు

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కు పాకిస్థాన్ కాలర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. పాకిస్థాన్ దేశానికి చెందిన ఫోన్ నంబరు (+923151225989) నుంచి రెండు సార్లు ఫోన్ చేసిన ఆగంతకుడు తన ఇంటిపై బాంబు వేసి చంపేస్తామంటూ బెదిరించాడని ఉన్నవో ఎంపీ సాక్షి మహారాజ్ జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘నా స్నేహితుడు మహ్మద్ గఫార్ ను  పోలీసులకు పట్టిచ్చి మృత్యువును ఆహ్వానించావని, పదిరోజుల్లోగా నీతోపాటు నీ అనుచరులను హతమారుస్తాం’’ అని కాలర్ హెచ్చరించాడు. తనకు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాల నాయకుల పేర్లు కూడా ప్రస్తావించారని,  వారి గురించి అసభ్యంగా మాట్లాడారని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  తనను బెదిరించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్లను కూడా తీసుకున్నారని సాక్షి మహారాజ్ పేర్కొన్నారు. గజ్వా-ఎ-హింద్ పేరుతో భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించడం గురించి కూడా కాలర్ మాట్లాడారని బీజేపీ ఎంపీ తెలిపారు.గతంలో చాలా ఉగ్రవాద సంస్థల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని సాక్షి మహారాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాడికల్ ఐడియాలజీ ఉన్న కొంతమంది వ్యక్తులు, ఉన్నవోలోని పీఎఫ్‌ఐ సభ్యులు కూడా గతంలో తనను బెదిరించారని ఎంపీ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకు ముందు కువైట్ కు చెందిన మహ్మద్ గఫార్ తనను బెదిరించాడని సాక్షి మహారాజ్ చెప్పారు. తన ఫిర్యాదుపై ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ గఫార్‌ను అరెస్టు చేసిందని, అతని స్నేహితుడు ఇప్పుడు బెదిరించాడని ఎంపీ చెప్పారు.కాల్ చేసిన వ్యక్తి మూడు నిమిషాలు మాట్లాడాడని ఎంపీ సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన ఫిర్యాదుపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉన్నవో ఎస్పీ రోహన్ పి కనయ్ చెప్పారు.

Updated Date - 2020-08-11T16:03:40+05:30 IST