కర్నాటక రాజకీయంలో ‘బెంగళూరు’ ప్రకంపనలు

ABN , First Publish Date - 2020-09-28T20:58:00+05:30 IST

ఓ వైపు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... రాష్ట్రమంతా ప్రదర్శనలు జరుగుతూ కర్నాటక రాజకీయం హీట్ ఎక్కింది.

కర్నాటక రాజకీయంలో ‘బెంగళూరు’ ప్రకంపనలు

బెంగళూరు : ఓ వైపు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... రాష్ట్రమంతా ప్రదర్శనలు జరుగుతూ కర్నాటక రాజకీయం హీట్ ఎక్కింది. తాజాగా ఎంపీ తేజస్వీ సూర్య బెంగళూరు విషయంలో చేసిన వ్యాఖ్యలు మరోవైపు అగ్గి రాజేస్తున్నాయి. వెరసి... కర్నాటక రాజకీయాలు ఒక్కసారిగా రంగు మారాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ కూర్పులో భాగంగా ఎంపీ తేజస్వీ సూర్యకు ప్రమోషన్ దక్కింది. ‘జాతీయ యువమోర్చా అధ్యక్షుడి’గా బీజేపీ ప్రమోషన్ ఇచ్చింది.


ఈ బాధ్యత తీసుకోవడమే తడువుగా... ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ‘బెంగళూరు తీవ్రవాదుల హబ్’ గా మారిపోయిందంటూ సంచలన ఫిర్యాదు చేశారు. బెంగళూరులో జాతీయ దర్యాప్తు బృందం’ కార్యాలయాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని షాకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అమిత్‌షా బదులిస్తూ ‘‘ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారితో ఓ కార్యాలయాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తా.’’ అని అమిత్‌షా బదులిచ్చారు.


కొన్ని రోజుల క్రితమే బెంగళూరులో ఉగ్రమూలాలున్న వారు బయట పడ్డారని, బెంగళూరును ఉగ్రవాదులు ‘ఇంక్యుబేషన్ సెంటర్’ గా మార్చేశారని తేజస్వీ సూర్య పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలకు సీఎం యడియూరప్ప కూడా మద్దతు పలికారు. బెంగళూరు సిటీలో క్రిమినల్ చర్యలు పెరిగాయని, వెంటనే ఎన్‌ఐఏ కార్యాలయాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి కూడా చాలా సార్లు తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ‘‘బెంగళూరు సిటీలో క్రిమినల్ కేసులు పెరిగిపోతున్నాయి. అందుకే జాతీయ దర్యాప్తు బృందం కార్యాలయాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశా. బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని మాత్రమే తేజస్వీ సూర్య అన్నారు.’’ అని యడియూరప్ప పేర్కొన్నారు.  


తేజస్వీ సూర్యను వెంటనే తొలగించండి : డీకే శివకుమార్

బెంగళూరు ఉగ్రవాద హబ్‌గా మారిందన్న ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘తేజస్వీ సూర్యను వెంటనే పార్టీ నుంచి తొలగించాలి. బెంగళూరు ప్రతిష్ఠను మంట గలుపుతున్నారు. బీజేపీకి ఈ విషయం సిగ్గుచేటు.’’ అని డీకే శివకుమార్ మండిపడ్డారు. 

Updated Date - 2020-09-28T20:58:00+05:30 IST