ఏకపక్ష నిర్ణయాలు కుదరవ్‌!

ABN , First Publish Date - 2021-11-30T08:46:41+05:30 IST

మొత్తం కోర్‌ కమిటీ సభ్యులను సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఇక రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని బీజేపీ జాతీయ నాయకత్వం..

ఏకపక్ష నిర్ణయాలు కుదరవ్‌!

  • కోర్‌ కమిటీ సభ్యులందరినీ సంప్రదించాల్సిందే
  • బీజేపీ రాష్ట్ర నేతలకు  అధ్యక్షుడు నడ్డా స్పష్టీకరణ
  • 13 మంది కమిటీ సభ్యుల ప్రకటన


న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మొత్తం కోర్‌ కమిటీ సభ్యులను సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఇక రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని బీజేపీ జాతీయ నాయకత్వం.. రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం కోర్‌ కమిటీ సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఒకరిద్దరినే పిలిచి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై నిషేధం, రైతుల మహాపాదయాత్రలో పాల్గొనకపోవడం, టీడీపీ నుంచి వచ్చిన కొందరు ఎంపీలను ఆహ్వానించకపోవడంపై ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిరుపతిలో రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై జాతీయ నాయకత్వానికీ ఫిర్యాదులందాయి. దరిమిలా కోర్‌ కమిటీ సభ్యుల పేర్లను నడ్డా ప్రకటించారు.


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , బీజేపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) మధుకర్‌, ఎమ్మెల్సీ పీఎన్‌వీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యవేక్షకుడు శివప్రకాశ్‌, కేంద్ర మంత్రి, రాష్ట్ర ఇన్‌చార్జి వి.మురళీధరన్‌ హాజరవుతారు.

Updated Date - 2021-11-30T08:46:41+05:30 IST