దుబ్బాకలో బీజేపీ ప్రచారాస్త్రం అదేనా?

ABN , First Publish Date - 2020-10-16T19:52:59+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీకి సవాల్‌గా మారనుందా? గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకోవడం గాలివాటమా? లేక ప్రజా బలమా?

దుబ్బాకలో బీజేపీ ప్రచారాస్త్రం అదేనా?

దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీకి సవాల్‌గా మారనుందా? గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకోవడం గాలివాటమా? లేక ప్రజా బలమా? ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో ఆన్సర్‌ ఇవ్వాలనుకుంటున్నారా? రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక బండి సంజయ్‌కు ఎదురవుతున్న మొట్టమొదటి పరీక్షను ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు? టీఆర్‌ఎస్‌ కంచుకోటలో కమలం పార్టీ గుబాళిస్తుందా? అసలు దుబ్బాక ఉపఎన్నికపై కాషాయ పార్టీ వ్యూహం ఏమిటి? 


2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో జోష్‌ మీదున్న కమలనాథులు..అధికార టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్రంలో జరగబోయే వరుస ఎన్నికలను ఎదుర్కోనేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర నాయకత్వం..దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా తమ సత్తా ఏంటో చాటాలని తహతహలాడుతోంది. నాలుగు ఎంపీ సీట్లు గాలివాటంగా గెలిచారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు దుబ్బాక గెలుపు అనివార్యంగా భావిస్తోంది. 


వాస్తవానికి 2018 చివరలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 80కి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకొని భారీ విజయం దక్కించుకున్నారు. కానీ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో సారు..కారు..పదహారు నినాదంతో ముందుకెళ్లిన గులాబీ దళపతికి కాషాయ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. 2018లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెలిచిన బీజేపీ..2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంది. అంటే 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో కమలం ప్రభావం కనిపించింది. లోకసభ ఎన్నికల నుంచి టిఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ ఉండేది. ఇప్పుడు టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉండేలా చేయాలని ఆ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.  


అయితే రాష్ట్రంలో హిందువులు, వారి పండుగల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక రేసులో ఉన్న రఘునందన రావు తదితరులు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు..ఎక్కడికక్కడ స్థానిక క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. హిందూ ఓటు బ్యాంకును తెలంగాణలో సంఘటితం చేయాలనే లక్ష్యంతో నాయకులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 




మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక రూపంలో వచ్చిన ఛాన్స్‌ను అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు రఘునందన్ రావు. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న దుబ్బాకలో గెలిస్తే దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బీజేపీలో అభ్యర్థి ఎంపికకు పెద్ద తతంగమే ఉంటుంది. పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమై ముగ్గురు పేర్లనే హైకమాండ్‌కు పంపిస్తారు. అక్కడి పార్లమెంటరీ పార్టీలో చర్చ జరిగిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇక్కడ భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. రఘునందన్‌కే ఈసారి కూడా టికెట్ ఇచ్చేందుకు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. 


దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, సానుభూతి టిఆర్ఎస్‌ వైపు  ఉంటుందని అధికార పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అయితే నారాయణఖేడ్ వంటి ఉప ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. సానుభూతి అంశానికి కాలం చెల్లిందని, ప్రజలు చైతన్యవంతులు అయ్యారని చెబుతున్నారు. ఎన్నికల ముందే టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుర్తుకొస్తారని విమర్శిస్తున్నారు. దుబ్బాకలో చాలామందికి ఇన్నాళ్లు పింఛన్లు ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా ఇస్తున్నారనీ..భూపరిహారం అందజేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ లోపాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలంటే రఘునందన రావు లాంటి నాయకుడు అవసరమనీ..ఆయన బరిలో ఉంటే ఈజీగా గెలుస్తామని కమల నేతలు భావిస్తున్నారట. ప్రజా సమస్యలపై రాష్ట్ర నాయకత్వం పోరాటాలు చేస్తుందనీ.. దాంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. 


ప్రధానంగా కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఉదాహరణగా చూపిస్తూ కేసీఆర్‌ పాలనపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. దుబ్బాకలో స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల పరిహారం దుబ్బాక నియోజకవర్గ రైతులకు తక్కువ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గ రైతులకు 30 లక్షల నుంచి 50 లక్షలు ఇచ్చారనీ..దుబ్బాకలో మాత్రం 15 లక్షల లోపు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తామంటున్నారు. దీనికి తోడు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంపై టీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందనుకుంటున్నారు. అలాగే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కార్‌ తీసుకునే నిర్ణయాలు ప్లస్‌ అవుతాయని భావిస్తున్నారు. దుబ్బాకలో గెలిచి ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్‌లకు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు తహతహలాడుతున్నారు. మరి కాషాయ నేతల ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి. 


Updated Date - 2020-10-16T19:52:59+05:30 IST