విజయవాడ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు

ABN , First Publish Date - 2020-09-24T17:56:13+05:30 IST

నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు.

విజయవాడ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు

విజయవాడ: నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ప్రధాని మోదీ, యోగిపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బీజేపీ ఆందోళన చేపట్టింది. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి, పాతూరి నాగభూషణం, నూతలపాటి బాల, వంగవీటి నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎంత కాలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. కొడాలి నాని, రోజా వంటి వారు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మోదీ, యోగి ఆదిత్యనాథ్ వంటి వారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ఆయన నిలదీశారు. యోగిల గురించి నాని వంటి భోగిలు మాట్లాడుతారా అని మండిపడ్డారు.


రాష్ట్రంలో ఉన్న ఐఏయస్, ఐపీయస్‌లు.. ప్రభుత్వానికి ‘‘అయ్యా.. యస్’’ అనవద్దని సూచించారు. కొడాలి నాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. అదే చర్చిపై రాళ్లు వేస్తే 41 మందిని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మహిళలపై కేసులు పెట్టి అరెస్ట్‌లు చేశారని.. నానిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలనేదే తమ డిమాండ్ అన్నారు. హిందూ సమాజం ఓపిక ఉన్నంత వరకే... ఆ తర్వాత ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న మంత్రులు క్యాబినెట్లో ఉండకూడదని డిమాండ్ చేశారు. జగన్ చర్యలు తీసుకోకపోతే .. నాని చేత ఆయనే ఇలా మాట్లాడిస్తున్నది‌ వాస్తవం అవుతుందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-24T17:56:13+05:30 IST