గెలుపోటముల అంచున బీజేపీ

ABN , First Publish Date - 2022-01-12T06:54:41+05:30 IST

నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నంతవరకు అది ఉత్తర ప్రదేశ్‌లో నంబర్ 1 పార్టీగా ఉండేది. ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడా కనపడడం లేదు. నేను బిజెపిలో చేరిన తర్వాత అది 14 సంవత్సరాల వనవాసం పూర్తిచేసుకుని మెజారిటీ...

గెలుపోటముల అంచున బీజేపీ

నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నంతవరకు అది ఉత్తర ప్రదేశ్‌లో నంబర్ 1 పార్టీగా ఉండేది. ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడా కనపడడం లేదు. నేను బిజెపిలో చేరిన తర్వాత అది 14 సంవత్సరాల వనవాసం పూర్తిచేసుకుని మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు సమాజ్‌వాది పార్టీలో చేరుతున్నానంటే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అర్థం చేసుకోవచ్చు.. అబ్ పతా చలేగా బిజెపికో.. ‘అని మంగళవారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, బిజెపి నుంచి నిష్క్రమించిన ప్రముఖ ఓబీసీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. ఆయనతో పాటు కనీసం పన్నెండు మంది బిజెపి ఎమ్మల్యేలు సమాజ్‌వాది పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ‘ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా బిజెపి పనిచేస్తున్నదని నేను చాలాసార్లు చెప్పాను. అయితే నా మాటలు ఎవరూ వినిపించుకోలేదు. బిజెపి హయాంలో దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారుల అణిచివేత సాగుతోంది. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాను’ అని మౌర్య అన్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మౌర్య సమాజ్‌వాది పార్టీకి వ్యతిరేకంగా ఓబీసీలను కూడగట్టేందుకు ఒకప్పుడు బిజెపికి తోడ్పడిన నేత. ఆయన కుమార్తె సంఘ మిత్ర కూడా బిజెపి తరపున ఎంపీగా ఎన్నికయ్యారు.


ఉత్తరప్రదేశ్‌తో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు మరింత వేగవంతమయ్యాయి. ఫిబ్రవరి 10న తొలి విడత ఎన్నికలు ప్రారంభమయ్యే లోపు అనేక రాజకీయ పరిణామాలకు ఆస్కారం ఉన్నది. టిక్కెట్ల పంపిణీ ఆయిన తర్వాత కూడా అనేక చోట్ల రాజకీయాలు తారుమారయ్యేందుకు అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో పంజాబ్ తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి అవలీలగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని నాలుగైదు సర్వేలు తేల్చడానికి ఎంత విలువ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. విచిత్రమేమంటే ఈ సర్వేలన్నీ బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. భారతదేశంలో సర్వేలు పూర్తిగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. గత ఏడాది పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన సర్వేల్లో ఏ ఒక్క సర్వే కూడా మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లు దాటుతుందని చెప్పలేదు. తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన సంస్థలు కూడా ఆ పార్టీ బొటాబొటి ఆధిక్యత సాధిస్తుందని మాత్రమే చెప్పాయి. కొన్ని సర్వే సంస్థలయితే పశ్చిమబెంగాల్‌లో బిజెపియే అధికారంలోకి వస్తుందని, 173-192 సీట్లు గెలుచుకుంటుందని ఘంటాపథంగా తేల్చాయి. చివరకు తృణమూల్ కాంగ్రెస్ 294 సీట్లలో 215 సీట్లను సాధించి సర్వేకారులను సైతం విభ్రమంలో ముంచెత్తింది. సర్వే సంస్థలు విఫలం కావడానికి అనేక కారణాలుండవచ్చు. అవి ప్రాయోజిత సర్వేలు కావడం ఒక ప్రధాన కారణం. ప్రజలు చాలా వివేకంగా వ్యవహరిస్తూ చివరి నిమిషం వరకు తమ మనసులో మాట బయటకు వ్యక్తం చేయకపోవడం కూడా సర్వేలను విఫలం చేస్తుంది.


సర్వేలను ప్రక్కన పెడితే నిజానికి ఏ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అంత సులువుగా విజయం సాధించే అవకాశాలు లేవని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో అధికారం నిలబెట్టుకోవడానికి బిజెపి విపరీతంగా కష్టపడాల్సి వస్తోందన్న విషయం ఆ పార్టీ నేతలకు అవగతమయింది. ఎన్నికలు మరో ఒకటి రెండు నెలలు ఉండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగప్రవేశం చేసి పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ప్రారంభించినంత మాత్రాన అభివృద్ధి జరుగుతోందని ప్రజలు నమ్మి ఓట్లు వేసే అవకాశాలు లేవని బిజెపికి తెలియనిది కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఉపాధి కల్పన పరిస్థితి అయిదేళ్ల కంటే ఇప్పుడు ఎంతో ఘోరంగా ఉన్నదని, 2016లో 38.5 శాతం ఉన్న ఉపాధి కల్పన 2021 నాటికి 32.8 శాతానికి తగ్గిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తేల్చింది. బిజెపి ప్రభుత్వం చెప్పుకున్నట్లు కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగి ఉంటే ఉపాధి కల్పన పెరగాలి కాని తగ్గిపోయే అవకాశాలు లేవు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మోదీ జనాకర్షణ వల్ల బిజెపి గెలిచింది. కాని ఇప్పుడు ఏడు సంవత్సరాల ప్రధాని మోదీ ప్రభుత్వం, అయిదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్ల జనం వ్యతిరేకత ఉండే అవకాశాలు ఉన్నాయి. రైతులు, యువత, దళితులు, ఓబీసీలతో పాటు వివిధ వర్గాలలో బిజెపి పాలన పట్ల వ్యతిరేకత చాప క్రింద నీరులాగా పాకిపోతోంది. అభివృద్ధి ప్రాతిపదికగా ఎన్నికల్లో పోటీ చేస్తే జనం ఆదరించే అవకాశాలు లేవని తెలిసినందువల్లే బిజెపి హిందూత్వ ఎజెండాను ముందుకు నెట్టింది. కాశీ కారిడార్ నిర్మాణం, అయోధ్యలో రామమందిర నిర్మాణం బిజెపి ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశాలయ్యాయి. ఈ ఎన్నికలు 80 శాతానికీ, 20 శాతానికీ మధ్య పోటీగా ఆదిత్యనాథ్ అభివర్ణించడం ద్వారా హిందువులు, ముస్లింలకు మధ్య పోటీ జరుగుతున్నట్లు చిత్రించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడమే హిందూ ఓట్లను సంఘటితం చేయడం కోసం కాని ఆయన హయాంలో వివిధ కులాల మధ్య చీలికలు తీవ్రమయ్యాయి. బ్రాహ్మణులు, రాజపుత్రుల మధ్య, యాదవులు, యాదవేతరుల మధ్య, జాతవులు, జాతవేతరుల మధ్య, జాట్లు, ఇతరుల మధ్య సమాజం మరింత విభజనకు గురైంది.


పంజాబ్‌లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ బిజెపి ఖాతా తెరిచే అవకాశాలు ఉన్నాయా అన్నది అనుమానమే, సాగుచట్టాలను వెనక్కు తీసుకోవడం ద్వారా సిక్కుల మనసులను కరిగించే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని అర్థమవుతోంది. అమరీందర్ సింగ్‌తో పాటు పలువురు నేతలు కష్టపడినా పంజాబ్‌లో బిజెపి సభలకు జనాన్ని పోగు చేయడం కష్టమవుతోంది. ప్రధాని మోదీ హాజరుకావల్సిన ఫెరోజ్‌పూర్‌లో 70 వేల మందికి కుర్చీలు వేస్తే 5 వేలమంది మాత్రమే వచ్చారని ‘ద ట్రిబ్యూన్’ పత్రిక రాసింది. ప్రధాని భద్రత విషయంలో వైఫల్యం జరిగిన తర్వాత జనంలో సానుభూతి ఎంతవరకు ఏర్పడుతుందో చెప్పలేము. ఈ భద్రతా వైఫల్యంపై కేంద్రం నియమించిన కమిటీ నిష్పాక్షికతలో తమకు నమ్మకం లేదని, కేంద్రం రాజకీయాలు ఆడే అవకాశం ఉన్నదన్న పంజాబ్ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సైతం అంగీకరించి స్వతంత్ర కమిటీని నియమించడం గమనార్హం. ఒకవైపు సుప్రీం విచారణ జరుపుతుండగా పంజాబ్ అధికారులకు నోటీసులు ఎందుకు పంపారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ప్రశ్నించడం కేంద్రం దూకుడుకు కళ్లెం వేసింది.


ఉత్తరాఖండ్‌లో బిజెపి అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, అధికారంలో లేని ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు వేర్వేరు శిబిరాలు నడుపుతున్నారు. ఈ రాష్ట్రంలో బిజెపి విజయం సాధిస్తే నరేంద్రమోదీ ఆకర్షణ మరోసారి పనిచేసినట్లు లెక్క. గోవాలో గత పది సంవత్సరాలుగా బిజెపి అధికారంలో ఉన్నది, గత ఎన్నికల్లో బిజెపి ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్‌తో సహా మిగతా పార్టీలను చీల్చి అత్యంత దౌర్జన్యంతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనోహర్ పరిక్కర్ మరణం తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో బిజెపి గోవాలో ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది.


నాగాలాండ్‌లో 14 మంది అమాయకులను కాల్చి చంపి, కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఈశాన్య భారతం కుతకుతలాడుతోంది. కనుక మణిపూర్‌లో బిజెపికి ఈ సారి పరిస్థితులు అంత సవ్యంగా లేవనే చెప్పవచ్చు. ఈ అయిదు రాష్ట్రాల్లో పరిస్థితులు అంత సానుకూలంగా లేవన్న వాస్తవం ప్రధాని మోదీకి తెలియనిదేమీ కాదు. అయితే ప్రతికూల పరిస్థితుల్లో కూడా రకరకాల వ్యూహాలు రచించి బిజెపిని పోటీలో బలంగా ఉంచగల సత్తా ఆయనకు ఉన్నది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా అనేక పరిణామాలు సంభవించాయి. వీటన్నిటినీ తట్టుకుని మెజారిటీ రాష్ట్రాల్లో ముఖ్యంగా యూపీలో బిజెపి అధికారంలోకి రాగలిగితే దేశంలో ఆ పార్టీని అడ్డుకోవడం ఇక ఎవరి తరమూ కాదనే నిర్ధారణకు రావల్సి ఉంటుంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-01-12T06:54:41+05:30 IST