ఏపీలో రోడ్ల దుస్థితిపై బీజేపీ ఆందోళనలు

ABN , First Publish Date - 2020-12-05T16:56:25+05:30 IST

ఏపీలో రోడ్ల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వం తీరును నిరసిస్తూ మొగల్రాజపురం మధు చౌక్‌లో బీజేపీ ధర్నాకు దిగింది.

ఏపీలో రోడ్ల దుస్థితిపై బీజేపీ ఆందోళనలు

విజయవాడ: ఏపీలో రోడ్ల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వం తీరును నిరసిస్తూ మొగల్రాజపురం మధు చౌక్‌లో బీజేపీ ధర్నాకు దిగింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, బబ్బూరి శ్రీరాం, అడ్డూరి శ్రీరాం ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయన్నారు. రోడ్డు ప్రమాదాలు పెరిగి అనేక మంది చనిపోతున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 18నెలలుగా ఏ ఒక్క రహదారి నిర్మాణం చేయలేదని విమర్శించారు. కనీసం గుంతలు కూడా పూడ్చకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గాలిలో గెలిచిన పార్టీ .. ఆ గాలిలోనే హెలికాప్టర్‌లోనే జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారన్నారు. కేంద్రం పంచాయతీ రాజ్‌కు నిధులు ఇస్తే.. వాటిని ఇతర అవసరాలకు మళ్లించారని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనను పూర్తిగా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.






ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై ప్రాధాన్యత లేదన్నారు. ఒక చేత్తో డబ్బులు తీసుకుని, మరో చేత్తో తాయిలాలు ఇచ్చి గెలవాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆరు‌వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేశారని..కమిషన్‌లు మాత్రం దోచుకున్నారని ఆరోపించారు. పట్టాలు మాత్రం పంచడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రహదారులపై పడవలలో వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రం వేసిన జాతీయ రహదారులపై  తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నేతల ఆస్తులు పెరిగిపోతున్నాయని.. ప్రజల ఆస్తులు తరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. బిల్లులు చెల్లించక పోవడంతో... కాంట్రాక్టర్‌లు కూడా ముందుకు రావడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు, సీట్లు తప్ప మరో ఆలోచన లేదని విమర్శించారు. 18నెలల పాలనలో ఎన్ని రహదారులు వేశారు.. పనులు చేశారు అనే అంశం పై శ్వేత పత్రం విడుదల చేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-05T16:56:25+05:30 IST