బీజేపీకి విరాళాల పంట.. డీలాపడ్డ కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-06-11T00:00:56+05:30 IST

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ విరాళాల లెక్కలను సమర్పించాయి. ఈ లెక్కల ప్రకారం.. భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా 785.77 కోట్ల రూపాయల

బీజేపీకి విరాళాల పంట.. డీలాపడ్డ కాంగ్రెస్

న్యూఢిల్లీ: కొంత కాలంగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మెజారిటీ ఓటు బ్యాంకుతో ముందుకు దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ నోటు బ్యాంకులోనూ ముందే ఉంది. అదేనండి పార్టీ విరాళాల్లో దేశంలోని అన్ని పార్టీలు కలిపినా భారతీయ జనతా పార్టీకి సమానం కాలేనంత విరాళాలను భారతీయ జనతా పార్టీ సేకరిస్తోంది. గత కొంత కాలంగా బీజేపీకి ఇదే విధమైన విరాళాలు అందుతున్నాయి. పార్టీ విరాళాల్లో ఏ జాతీయ పార్టీ కూడా బీజేపీకి దరిదాపుల్లో ఉండకపోవడం గమనార్హం. అయితే ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి.. జాతీయ పార్టీల స్థాయిలో విరాళాలు రాబట్టింది.


2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ విరాళాల లెక్కలను సమర్పించాయి. ఈ లెక్కల ప్రకారం.. భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా 785.77 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. వివిధ కంపెనీలు, వ్యక్తుల నుంచి ఆ వివరాలు వచ్చాయని పేర్కొంది. బీజేపీకి అందిన విరాళాల్లో 271 కోట్ల రూపాయల విరాళాలు బీజేపీ ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌కు చెందిన జూపిటర్‌ క్యాపిటల్‌తో పాటు ఐటీసీ గ్రూప్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌ తదితర బడా బడా కార్పొరేట్‌ సంస్థలతో కూడిన ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు నుంచి వచ్చాయని ప్రకటించారు. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో అయితే బీజేపీ అత్యధికంగా 1,612 కోట్ల రూపాయల విరాళాలను బీజేపీ సేకరించింది. ఆ యేడాది మొత్తం రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో ఒక్క బీజేపీకి వచ్చినవే 64 శాతం.


ఇక ఓట్లలోనూ వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీ నోట్లలోనూ వెనకబడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ 139.01 కోట్ల రూపాయల విరాళాల్ని మాత్రమే రాబట్టుకోగలిగింది. ఇందులో ఎలక్టోరల్‌ ట్రస్టుల ద్వారా రూ.58 కోట్లు వచ్చినట్లు ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాల్లో పేర్కొంది. అయితే ప్రాంతీయ పార్టీయైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కాంగ్రెస్ పార్టీ స్థాయిలో విరాళాల్ని రాబట్టుకోగలిగింది. ఆ పార్టీకి 130.46 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. ఇక వంద కోట్ల క్లబ్‌లో ఉన్న మరో పార్టీ అయిన శివసేన 111.4 కోట్ల రూపాయలు సేకరించగలిగింది.


దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలే విరాళాల్లో ముందుతున్నాయి. టీఆర్ఎస్ తర్వాత వైయస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కుగా 92.7 కోట్ల రూపాయల విరాళాల్ని సేకరించంది. తమిళనాడులోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా పార్టీ విరాళాల్లో ముందున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి 89.6 కోట్ల రూపాయల విరాళాలు రాగా, డీఎంకేకు 64.90 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఈ పార్టీలు మినహా ఏ ప్రాంతీయ పార్టీ రెండంకెల సంఖ్యలో పార్టీ విరాళాలు రాబట్టుకోలేకపోయింది.


పార్టీ విరాళాల్లో జాతీయ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ అత్యంత ఘోర స్థితిలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి అసలు నిధులే రాలేదని ఎన్నికల సంఘానికి తెలిపిన వివరాల్లో స్వయంగా ఆ పార్టీనే ప్రకటించింది. 2017-18 ఏడాదిలో 738 కోట్ల రూపాయల పార్టీ విరాళాలతో ముందున్న బీఎస్‌పీ రెండేళ్లు తిరిగే లోపు సున్నాకు పడిపోవడం గమనార్హం. ఇకపోతే మరో జాతీయ పార్టీ అయిన నేషనిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాస్త మెరుగైన విరాళాల్నే రాబట్టుకోగలిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి 59.94 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీలు బాగా వెనుకబడి ఉన్నాయి. సీపీఎంకు 8.08 కోట్ల రూపాయలు విరాళాలు రాగా, సీపీఐకి 1.29 కోట్ల విరాళాలు వచ్చినట్లు ప్రకటించాయి.

Updated Date - 2021-06-11T00:00:56+05:30 IST