భారీ ఎగుమతుల లక్ష్యం దిశగా భారత్ పరుగులు : బీజేపీ

ABN , First Publish Date - 2022-01-18T22:02:18+05:30 IST

2021-22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను

భారీ ఎగుమతుల లక్ష్యం దిశగా భారత్ పరుగులు : బీజేపీ

న్యూఢిల్లీ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించాలనే లక్ష్యం దిశగా భారత దేశం పరుగులు తీస్తోందని బీజేపీ తెలిపింది. 2022లో మొదటి వారంలో 33 శాతం ఇయర్ ఆన్ ఇయర్ ఎగుమతుల వృద్ధి నమోదై, 7.63 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొంది. 2022లో మునుపెన్నడూ లేనంత వృద్ధి కనిపించినట్లు వెల్లడించింది. 17 జనవరి 2021నాటికి 5.73 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని, 17 జనవరి 2022నాటికి 33 శాతం వృద్ధి చెంది 7.63 బిలియన్ డాలర్లకు చేరిందని వివరించింది. 


సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రయాణికుల వాహనాల ఎగుమతుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో 46 శాతం వృద్ధి నమోదైంది. 1.68 లక్షల యూనిట్లను ఎగుమతి చేసిన మారుతి సుజుకి ముందంజలో ఉంది. 2021-22 ఏప్రిల్-డిసెంబరు మధ్య కాలంలో 4,24,037 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. అంతకుముందు సంవత్సరం ఏప్రిల్-డిసెంబరు మధ్య కాలంలో 2,91,170 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. 


ఇండియన్ సుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) వెల్లడించిన వివరాల ప్రకారం, అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో పంచదార ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయి. విదేశాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో 17 లక్షల టన్నుల పంచదారను భారత్ ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల టన్నుల పంచదారను ఎగుమతి చేసేందుకు పంచదార మిల్లులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయ ధరలు మరింత మెరుగుపడితే ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో మిల్లులు ఎదురు చూస్తున్నాయి. 


కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన ట్వీట్‌లో యాపిల్ భారత దేశానికి కంటిపాప వంటిదని అభివర్ణించారు. 2014 నుంచి యాపిల్ పండ్ల ఎగుమతుల్లో 82 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. దీనివల్ల జమ్మూ-కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్‌ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, ఎగుమతులను మరింత పెంచేందుకు  ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 


Updated Date - 2022-01-18T22:02:18+05:30 IST