తిరుపతి ఉప ఎన్నికపై కీలక నేతలతో సునీల్ రహస్య భేటీ

ABN , First Publish Date - 2020-10-24T20:44:48+05:30 IST

తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం విదితమే.

తిరుపతి ఉప ఎన్నికపై కీలక నేతలతో సునీల్ రహస్య భేటీ

తిరుపతి : తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం విదితమే. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయం. ఈ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా దుర్గాప్రసాద్ కుటుంబానికి చెందిన వ్యక్తినే అధిష్టానం ఖరారు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. జనసేన-బీజేపీ కూడా అభ్యర్థిని ఖరారు చేసే పనిలో ఉంది. ఇంకోవైపు టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టి తీరుతామని... కచ్చితంగా పసుపు జెండా ఎగరేస్తామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజురోజుకూ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వ్యవహారం వేడెక్కుతున్నది.


6 నెలలు మకాం..!

శనివారం నాడు బీజేపీ కీలక నేతలతో ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ రహస్యంగా భేటీ అయ్యారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. జనసేన, బీజేపీల్లో ఎవరికి సీటు కేటాయించినా సమిష్టిగా పనిచేయాలని నేతలకు సునీల్ సూచించారు. ఉప ఎన్నికల్లోపు పార్టీలోకి చేరికలను పెంచాలని.. వైసీపీ అసమ్మతి నేతలు, టీడీపీ నేతలతో చర్చలకు బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఉప ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని కీలక నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం 6 నెలలపాటు తిరుపతిలోనే మకాం వేస్తామని సునీల్ దేవధర్ చెప్పుకొచ్చారు.


గతంలో ఇలా..

కాగా.. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన దుర్గా ప్రసాద్ 2,28,376 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి పనబాక లక్ష్మీకి 4,94,501 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు మాత్రం 25వేల లోపే ఓట్లు పోలయ్యాయి. మరి ఈ ఉప ఎన్నికలో ఏయే పార్టీల అభ్యర్థులు ఎంత మాత్రం ఓట్లు దక్కించుకుంటారో వేచి చూడాలి.

Updated Date - 2020-10-24T20:44:48+05:30 IST