Abn logo
Mar 24 2021 @ 15:35PM

గూండాలను తెచ్చి బెంగాల్‌ను పాడుచేస్తున్నారు: బీజేపీపై మమత ఫైర్

కోల్‌కతా: ఉత్తరప్రదేశ్ నుంచి గూండాలను తీసుకువస్తున్నారని భారతీయ జనతా పార్టీపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గుడ్కాలు, పాన్‌పరాకులు నములుకుంటూ వచ్చి పశ్చిమ బెంగాల్‌ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బుధవారం బిష్నాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.


‘‘వాళ్లు (బీజేపీ) బయటి నుంచి బెంగాల్‌కు రౌడీలను తీసుకొస్తున్నారు. మనవాళ్లను నేను బయటి వాళ్లు అనడం లేదు. బయటి వాళ్లంటే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నవారు. కాషాయపు బట్టలు వేసుకొని, గుడ్కాలు, పాన్‌పరాకులు నమిలే గూండాలను ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకు వస్తున్నారు. వాళ్లే మత బెంగాల్ సంస్కృతిని పాడు చేస్తున్నారు’’ అని మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం ఎనిమిది విడతల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి.