రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకుతున్న రైతాంగం

ABN , First Publish Date - 2020-10-25T07:03:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం అట్టుడికి పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకుతున్న రైతాంగం

నిర్బంధంగా సన్నరకం సాగు చేయించడంతోనే ఈ దుస్థితి 

ఫోన్‌లో రైతు దేవరాజును ఓదార్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 


గంభీరావుపేట, అక్టోబరు 24 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం అట్టుడికి పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిర్బంధంగా సన్నరకం వరిని సాగు చేయించడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో దోమపోటుతో దెబ్బతిన్న వరికి నిప్పు పెట్టుకున్న రైతు దేవరాజు పంట నష్టాన్ని పరిశీలించి, ఓదార్చేందుకు శనివారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన  గోపి, స్థానిక సర్పంచ్‌ కటకం శ్రీధర్‌పంతు, బీజేపీ మండల అధ్యక్షుడు గంట అశోక్‌ పొలం వద్దకు వెళ్లారు. అదే సమయంలో  బండి సంజయ్‌ రైతు దేవరాజుతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఫోన్‌ ద్వారానే విలేకరులతో మాట్లాడారు. దోమపోటు కారణంగా రెండెకరాల వరి పంటకు రైతు దేవరాజు నిప్పు పెట్టుకున్న విషయం పత్రికల్లో చూడడంతో చాల బాదేసిందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల వరి పంట సాగులో  ప్రభుత్వం బలవంతంగా 30 లక్షల వరకు సన్నరకం వడ్లను సాగు చేయించిందన్నారు.


రాష్ట్రంలో ఎక్కడా భూసార పరీక్షలు నిర్వహించకుండ నిర్బంధంగా సన్నరకం వరి సాగు  చేయించారని మండిపడ్డారు.  సీఎం కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో భూసార పరీక్షలు నిర్వహించి, అక్కడి కలెక్టర్‌ సూచనల మేరకు దొడ్డు వడ్లు పండించారని అన్నారు. ప్రభుత్వం ద్వంద వైఖరితో ఈ రోజు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, ఇప్పటికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని, రైతులను ఆదుకుంటామని అన్నారు.  

Updated Date - 2020-10-25T07:03:13+05:30 IST