ఖైరతాబాద్‌‌లో ఫలించిన కమలనాథుల వ్యూహం..

ABN , First Publish Date - 2020-12-05T14:53:42+05:30 IST

ఖైరతాబాద్‌ నియోజకవర్గం ప్రజలు పోలింగ్‌లో మరోసారి విశిష్టతను

ఖైరతాబాద్‌‌లో ఫలించిన కమలనాథుల వ్యూహం..

  • రెండు డివిజన్‌లలో గెలిచిన బీజేపీ
  • మరో రెండుప్రాంతాల్లో రాణించిన కమలనాథులు
  • ఖైరతాబాద్‌లో 4 సిట్టింగ్‌ స్థానాల్లో తిరిగి గెలిచిన టీఆర్‌ఎస్‌ 


హైదరాబాద్/బంజారాహిల్స్‌ : ఖైరతాబాద్‌ నియోజకవర్గం ప్రజలు పోలింగ్‌లో మరోసారి విశిష్టతను చాటారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిన ఓటర్లు ఈ సారి మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపించారు. 2016లో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఆరు సిట్టింగ్‌లు ఉండగా ఈ సారి రెండింట బీజేపీ విజయబావుట ఎగుర వేసింది. మరో రెండింట సత్తా చాటింది. టీఆర్‌ఎస్‌ నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. నియోజకవవర్గంలో హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, వెంకటేశ్వరనగర్‌కాలనీ డివిజన్‌, సోమాజిగూడలో 2016లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ సారి ఫలితాలు తారుమారు అయ్యాయి. సిట్టింగ్‌లందరికీ టీఆర్‌ఎస్‌ టికెట్లు తిరిగి ఇచ్చింది. సోమాజిగూడ డివిజన్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అనారోగ్యంతో తప్పుకోవడంతో కొత్త వారికి టికెట్టు కేటాయించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎలాగైనా కొల్లగొట్టాలని బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్‌ఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న జూబ్లీహిల్స్‌తోపాటు హిమాయత్‌నగర్‌ను కైవసం చేసుకుంది. ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌ డివిజన్‌లలో సత్తా చాటింది.


చివరి వరకు ఉత్కంఠ

గ్రేటర్‌ ఎన్నికల కౌటింగ్‌ బంజారాహిల్స్‌లోని ముఫకంజా కళాశాలలో శుక్రవారం జరిగింది. మొదట బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ డివిజన్‌లలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాజా సూర్యనారాయణ, బీజేపీ అభ్యర్థి వెల్దండ వెంకటేశ్‌ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. చివరకు బీజేపీ అభ్యర్థి 779 ఓట్లతో గెలుపొందాడు. ఇక బంజారాహిల్స్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి  782 ఓట్ల మెజారిటీతో, హిమాయత్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి మహాలక్ష్మి 800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖైరతాబాద్‌లో సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.విజయారెడ్డి ఘన విజయం సాధించారు. సోమాజిగూడలో వనం సంగీతాయాదవ్‌ గెలుపొందారు. వెంకటేశ్వరనగర్‌కాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె కవితారెడ్డి  7,060ఓట్ల మెజారిటీ సాధించారు.

Updated Date - 2020-12-05T14:53:42+05:30 IST