Abn logo
Dec 4 2020 @ 16:11PM

మహా ఎన్నికల్లో బీజేపీ బోల్తా

నాగ్‌పూర్: మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చతికిల పడింది. ఈ ఎన్నికల్లో అధికార మహా వికాస్ అగాడీ విజయ ఢంకా మోగించింది. రాష్ట్రంలో మండలికి చెందిన ఆరు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు పట్టభద్రుల నియోజకర్గాలు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒక స్థానిక సంస్థల నియోజకవర్గం. కాగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అంతే కాకుండా ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కూడా వెనుకబడే ఉంది. ఒక్క స్థానిక సంస్థల నియోజకవర్గంలో మాత్రం గెలిచి.. మొత్తంగా ఆరు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది. ఇక మహా వికాస్ అగాడీ పార్టీలే నాలుగు స్థానాల్ని గెలుచున్నాయి. మరో విశేషం ఏంటంటే.. బీజేపీ కంచుకోట అయిన నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం గెలుచుకున్నారు.


నాగ్‌పూర్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గోవిందరావు వాంజర్రి విజయం సాధించారు. సుమారు 55 ఏళ్ల తర్వాత నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ ఉనికి చాటుకుంది. 1.33 లక్షల ఓట్లు ఉన్న నాగ్‌పూర్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి 55,947 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక పూణె, ఔరంగాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1.22 లక్షల ఓట్లు ఉన్న పుణె పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సంగ్రం దేశ్‌ముఖ్‌ను 48 వేల ఓట్ల తేడాతో ఎన్సీపీ అభ్యర్థి అరుణ్ లాండ్ ఓడించారు.


ఇక ఔరంగాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా ఎన్సీపీ గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి శిరీష్ బోరాల్కర్‌పై ఎన్సీపీ అభ్యర్థి సతీష్ చవాన్ విజయం సాధించారు. చావన్‌కు 1,16,638 ఓట్లు రాగా శిరీష్‌కు 58,743 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక పూణె ఉపాధ్యాయ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీకి చెందిన జయంత్ దిన్కర్ ఆస్గావ్కర్ గెలుపు దిశగా కొనసాగుతున్నారు. ఇక బీజేపీ, స్థానిక సంస్థల నియోజకవర్గమైన ధూలే-నందుర్బార్‌లో గెలిచింది. ఇక అమరావతి ఉపాధ్యాయ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కిరణ్ సరనాయిక్ గెలుపొందారు.

Advertisement
Advertisement
Advertisement